
సినిమా తీయడం ఓ కళ. ఆ కళ బాగా తెలిసిన వ్యక్తి.. ఏఆర్ మురుగదాస్. మొదట రైటర్ కావాలనుకున్నారు. పెన్ను పట్టాక మరి వదల్లేదు. డైరెక్టర్ అవ్వాలనుకున్నారు. మెగాఫోన్ చేతబట్టి ఇక వెనుదిరిగి చూడలేదు. సౌత్ ఇండస్ట్రీలోని బెస్ట్ డైరెక్టర్స్ లో ఒకరైన ఆయన ఇవాళే పుట్టారు. ఈ సందర్భంగా మురుగదాస్ కెరీర్ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం..
అప్పుడే రైటింగ్‌పై ఆసక్తి
మురుగదాస్ 1974లో సేలమ్ దగ్గర్లోని అత్తూర్‌లో పుట్టారు. తండ్రి పేరు అరుణాచలం. నాన్న పేరులోని మొదటి రెండక్షరాలనే తన ఇంటిపేరుగా మార్చుకున్నారు దాస్. తిరుచ్చిలో బీఏ చదివారు. కాలేజీలో కల్చరల్ ఈవెంట్స్ లో యాక్టివ్‌గా ఉండేవారాయన. అప్పుడే రైటింగ్‌పై ఆసక్తి పెరిగింది. స్కిట్స్ రాసి కాలేజ్ ప్రోగ్రామ్స్ లో ప్రదర్శించారు. జోక్స్ కూడా బాగా రాసేవారు. అవి ప్రముఖ పత్రికల్లో అచ్చయ్యాయి. తన ఫ్రెండ్స్‌తో కలిసి సినిమాలు తెగ చూసేవారు మురుగదాస్. మెల్లగా అదో పిచ్చిలా మారింది. మొదట్లో వారానికో సినిమా చూసేవారు.. అది కాస్తా వారానికి ఏడు సినిమాలు చూసేంతగా సినిమాకి అడిక్ట్ అయ్యారు. దీంతో ఆయనకు స్టోరీ రైటర్ అవ్వాలనే ఆశ కలిగింది. కాలేజ్ చదువు ముగిశాక మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాలని ట్రై చేశారు కానీ రిజెక్టయ్యారు. అయినా సరే.. పట్టు వీడకూడదని నిర్ణయించుకున్నారు.
‘రక్షగన్’ మూవీతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా
పట్టుదలతో ప్రయత్నించి ఎట్టకేలకు ఇండస్ట్రీలో అడుగుపెట్టే అవకాశం సంపాదించారు దాస్. పి.కలైమణి దగ్గర అసిస్టెంట్ రైటర్‌గా చేరారు. ‘మధుర మీనాక్షి’ అనే సినిమాకి మొదటిసారి డైలాగ్స్ రాశారు. మరికొన్ని చిత్రాలకు మాటలు రాసిన తర్వాత నాగార్జున హీరోగా రూపొందిన ‘రక్షగన్’ మూవీతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారారు. మొదటి సినిమాతోనే దర్శకుడిగా మంచి మార్కులు వేయించుకున్నారు మురుగదాస్. దాంతో రమణ, గజిని, తుపాకీ, ఖైదీ, సర్కార్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసి స్టార్ డైరెక్టర్ అయ్యారు. ఆయన తీసిన సినిమాలు కొన్ని తెలుగులోకీ డబ్ అయ్యి హిట్టు కొట్టాయి. ‘రమణ’ మూవీ ‘ఠాగూర్’గా రీమేక్ అయ్యింది. ‘గజిని’ సినిమాని ఆమిర్ ఖాన్ హీరోగా హిందీలోకి రీమేక్ చేశారు. విజయ్ ‘తుపాకి’ చిత్రాన్ని అక్షయ్ కుమార్‌తో ‘హాలీడేగా’ తీశారు. సోనాక్షీ సిన్హాతో ‘అకీరా’ అనే హిందీ సినిమా కూడా తెరకెక్కించారు.
దర్శకుడిగానే కాదు
తెలుగులో స్టాలిన్, స్పైడర్ చిత్రాల్ని మురుగదాస్ డైరెక్ట్ చేశారు. స్పైడర్ లో మహేష్ బాబు హీరోగా నటించాడు. నిజానికి అంతకంటే ముందే తెలుగు మూవీస్‌కి వర్క్ చేశారు దాస్. ‘కలిసుందాం రా’ చిత్రానికి అసిస్టెంట్ స్క్రిప్ట్ డైరెక్టర్‌గా పని చేశారు. ‘ఖుషి’ చిత్రానికి ఎస్.జె.సూర్యతోనూ కలిసి వర్క్ చేశారు. ఆయనే అజిత్‌కి మురుగదాస్ గురించి చెప్పాడు. దాంతో ‘దీనా’ అనే చిత్రాన్ని డైరెక్ట్ చేసే చాన్స్ వచ్చింది దాస్‌కి. దర్శకుడిగానే కాదు, నిర్మాణ రంగంలోనూ సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్నారు దాస్. తాను డైరెక్ట్ చేసిన చిత్రాలతో పాటు ఇతర దర్శకుల చిత్రాలనూ ప్రొడ్యూస్ చేస్తుంటారు. ఇక కొన్ని చిత్రాలకు కేవలం రైటర్‌గానే వర్క్ చేశారు, చేస్తున్నారు. అప్పుడప్పుడు సినిమాల్లో మెరుస్తుంటారు కూడా. సెవెన్త్ సెన్స్, ఖైదీ, నోటా లాంటి కొన్ని చిత్రాల్లో కనిపించి మెప్పించారు.
అందుకే సినిమా సినిమాకీ గ్యాప్
మురుగదాస్ కెరీర్ స్టార్ట్ చేసి ముప్పయ్యేళ్లవుతోంది. ఆయన డైరెక్టర్‌గా మారి ఇరవయ్యేళ్లు దాటింది. కానీ ఈ గ్యాప్‌లో ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలు పట్టుమని పదిహేను కూడా లేవు. దానికి కారణం సెలెక్టివ్‌గా ఉండటమే. చాలా సీరియస్ కాన్సెప్టులను ఎంచుకుంటారు. సోషల్ ఇష్యూస్‌ని సైతం టచ్ చేస్తారు. అందుకే ముందు ఫుల్లుగా గ్రౌండ్ వర్క్ చేశాకే బరిలోకి దిగుతారు. అందుకే సినిమా సినిమాకీ గ్యాప్ ఎక్కువ తీసుకుంటారు. 2020లో రజినీకాంత్‌తో ‘దర్బార్’ తీసిన తర్వాత ఇంతవరకు మరో సినిమా అనౌన్స్ చేయలేదాయన. ముందు ముందు ఇంకా మంచి చిత్రాలు తీయ్యాలని కోరుతూ.. మురుగదాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు.