ఆ భయమే సక్సెస్​ తెచ్చింది : అశ్విన్ శరవణన్

ఆ భయమే సక్సెస్​ తెచ్చింది : అశ్విన్ శరవణన్

అతను తీసే సినిమాలు తన భయాల నుంచే పుట్టాయట. సొంత ఎక్స్​పీరియెన్స్​నే కొత్త కథగా క్రియేట్ చేసి, థ్రిల్లర్స్​తో థ్రిల్ చేస్తున్నాడు డైరెక్టర్​ అశ్విన్ శరవణన్. ఈసారి ఆడియెన్స్​తో కనెక్ట్​ అవ్వడానికి, విరామం లేకుండా భయపెట్టడానికి ‘కనెక్ట్​’ సినిమాతో రెడీ అయ్యాడు. అశ్విన్ మాటల్లోనే భయపెట్టే సినిమాల వెనక ఉన్న విశేషాలు.

‘‘మాది మధురై. కానీ, నా ఎడ్యుకేషన్ అంతా చెన్నైలో జరిగింది.  సాఫ్ట్​వేర్ ప్రొఫెషనల్​ను. రాయడం, చదవడం అంటే చాలా ఇష్టం. నేను కాలేజీలో చదువుతున్నప్పుడు ‘నాలయా దిరీక్’ షో చూశా. అప్పటి నుంచి రాయడం మొదలుపెట్టా. అప్పుడే ‘నళయ లియక్కునర్’ అనే టీవీ షోలో షార్ట్ ఫిల్మ్స్ తీసిన యంగ్​ టాలెంట్స్​కి అవకాశం ఇస్తున్నారు. అందులో చాలామంది స్టార్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు. అది నన్ను చాలా ఇన్​స్పైర్ చేసింది. నా షార్ట్ స్టోరీస్​ని సినిమా తీస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచన వచ్చింది. అలా అప్పుడే సినిమా తీయాలనుకున్నా. చిన్న కెమెరా కొనుక్కుని, నా ఫ్రెండ్స్​తో కలిసి షార్ట్​ ఫిల్మ్స్ తీశా. ఆ తర్వాత క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలక్ట్​ అయి, పెద్ద కంపెనీలో చేరా. కానీ, ఒకసారి సినిమా మొదలుపెట్టాక వదల్లేకపోయా. దాంతో మూడు నెలలకు సాఫ్ట్​వేర్ జాబ్ మానేశా. అప్పటికింకా ట్రైనింగ్​లోనే ఉన్నా. జాబ్​ మానేసి, స్క్రిప్ట్‌‌పై పని చేయడం మొదలుపెట్టా. దాదాపు ఒక సంవత్సరం ఇంట్లో కూర్చుని, కథలు రాసుకుంటూ ఉండేవాడిని. రోజంతా తింటూ, నిద్రపోతున్న నేను ఏం చేస్తున్నానో మా అమ్మానాన్నకు అర్థమయ్యేది కాదు. అసిస్టెంట్​ డైరెక్టర్​గా అవకాశం కోసం తిరిగా. టైం వేస్ట్ కాకూడదని, కథ రాయాలనుకున్నా. అప్పుడు రాసిన కథే ‘మయూరి’. 

కథే ఫస్ట్ ప్రియారిటీ

చనిపోవడం, చావు తర్వాత జీవితం ఎలా ఉంటుందనే విషయాలపై ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. అలాగే మనకు తెలియకుండా మనపై ఏదో జరుగుతుంది అని ఊహించుకుంటుంటాం. ఆ ఊహలకే కొన్ని కారణాలు క్రియేట్ చేసి స్ర్కీన్ మీద చూపించాలనుకున్నా. అలా మొదలైందే ‘గేమ్ ఓవర్’.  ఒక ఫిల్మ్ మేకర్​గా నేను బడ్జెట్ గురించి ఆలోచించను. నాకు కథే ఫస్ట్ ప్రియారిటీ. కంటెంట్, దానికి తగ్గట్టు భయపెట్టే సన్నివేశాలు అన్నీ సరిగ్గా కుదరాలంటే తగినంత బడ్జెట్ పెట్టాలి. అప్పుడే సినిమా బాగా వస్తుంది. 

తాప్సీనే ఎందుకంటే..

 హిందీలో తాప్సీ నటించిన ‘పింక్’ మూవీ చూశా. అందులో ఆమె నటన నాకు బాగా నచ్చింది. ఎలాగైనా తనతో వర్క్ చేయాలనుకున్నా. అయితే, అది గేమ్ ఓవర్​లో కాదు. ‘ఇరవాకాలమ్’ అనే మూవీకి తాప్సీ అయితే బాగుంటుందనుకున్నా. కానీ, తను బిజీగా ఉండడం వల్ల అది జరగలేదు. ఆ తర్వాత ‘గేమ్​ ఓవర్​’ కథ తనకు చెప్పా. అయితే, దీన్ని సౌత్ ఇండియన్ ఫిల్మ్​గా కాకుండా, పాన్​ ఇండియా మూవీగా తీసుకురావాలి. దేశం మొత్తం చూడాలి.. ప్రతి ఒక్కరూ రెస్పాండ్ అవ్వాలి అనుకున్నాం. ఆ స్క్రిప్ట్ ప్రొడ్యూసర్స్​కి కూడా నచ్చడంతో ‘సరే’అన్నారు. దేశం మొత్తం తెలిసిన ఫేస్ ఎవరిది అంటే, మాకు కనిపించిన ఆప్షన్ తాప్సీ. అందుకే ఆమెని తీసుకున్నాం.

 అది బెస్ట్​ థ్రిల్లర్  టీవీ షో 

థ్రిల్లర్ మూవీస్​ చాలానే వస్తున్నాయి. కానీ, టీవీల్లోనూ థ్రిల్లర్ షోలు రావడం అరుదు. 1996 –98 మధ్య తమిళంలో ‘మర్మదేశం’ అనే ఆంథాలజీ మిస్టరీ సిరీస్​ వచ్చింది. అందులో ఐదు ఎపిసోడ్స్ ఉండేవి. వాటిలో ‘విడదు కురుప్పు’ అనే ఎపిసోడ్ చాలా థ్రిల్లింగ్​గా ఉంటుంది. అది  గ్రామాన్ని కాపాడే కురుప్పు స్వామి మీద ఆధారపడి ఉండే కథ. అది నాకు బెస్ట్ ఎక్స్​పీరియెన్స్​ ఇచ్చిన థ్రిల్లర్ సబ్జెక్ట్. 

చీకటంటే నాకు భయం

‘గేమ్​ ఓవర్​’ కథలో తాప్సీ క్యారెక్టర్​కి నిక్టోఫోబియా ఉంటుంది. ఆ ఫోబియా ఉన్నవాళ్లు చీకటంటే విపరీతంగా భయపడతారు. కథ రాయడం వెనక ఒక కారణం ఉంది. అదేంటంటే నిజానికి చిన్నప్పుడు చీకటి అంటే నాకు భయం. టీనేజ్​లో  ఉన్నప్పుడు నైట్ టైంలో లేచి, నీళ్లు తాగాలన్నా భయపడేవాడిని. అంతేకాదు, చీకటి ప్రదేశాలకు వెళ్లినా అదే ఫీలింగ్. ఆ ఎక్స్​పీరియెన్స్​తోనే నా సినిమాల్లో ఆ భయాన్ని చూపించడానికి ట్రై చేస్తుంటా. 
హిందీలో రిలీజ్​ చేయాలనుకోలేదు

నిజానికి భాషకు తగ్గట్టు లొకేషన్స్, సీన్స్ మార్చుతూ ఒకేసారి సినిమా తీయాలంటే కష్టం. కానీ, సస్పెన్స్ థ్రిల్లర్స్​కి ఆ అవసరం కూడా రాదు. ఎందుకంటే అందులో కంటెంట్​ ఇంపార్టెంట్​. కాబట్టి, ఎక్కడ తీసినా, ఎలా తీసినా అందరూ ఎంజాయ్ చేస్తారు అనే నమ్మకం ఉంది. అయితే, ‘గేమ్​ ఓవర్’ సినిమా అయిపోయాక అనురాగ్ కశ్యప్​కి చూపిద్దామని చెప్పింది తాప్సీ. 70 శాతం కంప్లీట్ అయ్యాక, ఆయనకి రఫ్ ​కాపీనే చూపించాం. ఎలాంటి ఎక్స్​పెక్టేషన్స్ లేకుండా ఆయన సినిమా చూశారు. సినిమా ఆయనకు నచ్చడంతో హిందీలో చేద్దాం అన్నారు. అలా హిందీలోకి వచ్చింది. 

ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్​ కాదు..

నయనతార తమిళంలో చేసిన ‘మాయ’, తెలుగులో ‘మయూరి’గా వచ్చిన సినిమాలో లీడ్ క్యారెక్టర్​ ఉమన్​దే. ‘గేమ్ ఓవర్​’లో తాప్సీ లీడ్ రోల్ చేసింది. ఎందుకంటే ఆ కథ నా ఒక్కడిదే కాదు. నా కో– రైటర్, కావ్య రామ్​కుమార్​తో​ కలిసి రాశా. ఆమె తన కోణంలో స్క్రిప్ట్ రాసింది. ఆడవాళ్లందరూ అలా ఉంటారని కాదు. ఇలాంటి క్యారెక్టర్ ఎవరిలోనైనా ఉండొచ్చు అనేదే ఉద్దేశం. అవన్నీ నా ఎక్స్​పీరియెన్స్​ల నుంచి తీసుకున్నవే. నాకు తెలిసి అందరిలోనూ ఆ భయాలు ఉండొచ్చు. ‘మాయ’ తర్వాత ఎస్​.జె సూర్యతో ‘ఇరవకాలమ్’ సినిమా చేశా. లవ్​స్టోరీ బ్యాక్​డ్రాప్​లో ఉంటుంది. పోస్ట్ ప్రొడక్షన్​ మాత్రమే మిగిలి ఉంది. కానీ, అనుకోని కారణాల వల్ల ఆ పని ఆగిపోయింది. ఆ టైంలోనే ‘గేమ్ ఓవర్’ కథ అనుకున్నా. 

తను కో– రైటర్ మాత్రమే కాదు..  

కావ్య రామ్​కుమార్ నా కో– రైటర్. మా పరిచయం ఎలాగైందంటే.. కావ్యకి, నాకు కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. అలా ఆమె కథ నా దగ్గరకు వచ్చింది. ఇద్దరం ఫేస్‌‌బుక్‌‌లో మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. అప్పటివరకు నేను డైరెక్టర్​నని ఆమెకి తెలియదు. మేమిద్దరం ఫ్రెండ్స్ అయ్యాక తను ‘మయూరి’ సినిమా చూసింది. ఒకరే రాసి, సినిమా తీయడమంటే చాలా స్ట్రెస్ ఉంటుంది. దానికంటే ఇద్దరు కలిసి డిస్కస్ చేసుకుని, కథని మళ్లీ రాసుకుని, తీస్తే సినిమా ఇంకా బాగా వస్తుంది. రైటర్​ ఉంటే డైరెక్టర్​ కాస్త రిలాక్స్ అయ్యే టైం ఉంటుంది. టెన్షన్స్ ఏం లేకుండా ఫోకస్​ పెట్టి సినిమా తీయొచ్చు అనుకున్నప్పుడు నాకు తెలిసిన వ్యక్తి కావ్య మాత్రమే. నేను ఇంకొకరితో కలిసి కథ రాయడం అదే మొదటిసారి. ఇద్దరం కలిసి పనిచేసిన సినిమా ‘గేమ్ ఓవర్’. కథ, స్క్రీన్‌‌ప్లే, డైలాగ్‌‌లకు కలిసి వర్క్‌‌ చేశాం. మా ఇద్దరి ప్రపంచాలను, ఆలోచనలను కలపడం ఛాలెంజింగ్​గా ఉండేది. ఆ ప్రాసెస్​ని చాలా ఎంజాయ్ చేశా. ఆ టైంలోనే మా స్నేహం మరో అడుగు ముందుకేసి ప్రేమగా మారింది. ఈ ఏడాది జనవరిలో మేం పెండ్లి చేసుకున్నాం. 

లాక్ డౌన్ ఎక్స్​పీరియెన్స్​తో..

‘కనెక్ట్’ ఐడియా అనుకున్నప్పుడు నేను ఫలానా వాళ్లతో చేయాలి. ఇంతకుముందు చేసిన స్టార్స్​తోనే చేయాలని ఆలోచించను. నా ఐడియా నయనతారకి చెప్పానంతే. ఆమె వెంటనే రెస్పాండ్ అయింది. ‘ఐడియా బాగుంది, సినిమా తీయొచ్చు’ అంది. కొవిడ్​ టైం కాబట్టి, అందరి ఎక్స్​పీరియెన్స్​లు కనెక్ట్ అవుతాయి. ప్రతి కథ కొత్తగా, ఫ్రెష్​గా ఉండాలి. ఒక ఐడియాని బాగా చెప్పడమే పెద్ద రెస్పాన్సిబిలిటీ అని ఫీలయ్యా. ఇందులో కూడా ఫిమేల్ లీడ్ కావాలని పెట్టలేదు. నా ఐడియాకి, స్టోరీకి తగ్గట్టు తీశా. ఇది కూడా నా లాక్​ డౌన్ ఎక్స్​పీరియెన్స్​ల నుంచి అల్లుకున్న ఆలోచనే. నేను అప్పుడు ఫ్యూచర్​ గురించి చాలా భయపడేవాడిని. కంగారు పడేవాడిని. ఆ టైంలో ఆశలు వదిలేసుకున్న పరిస్థితులు ఫేస్ చేశా. అప్పుడు నాకు కలిగిన ఎమోషన్స్ అన్నీ ఒక సినిమాలో పెట్టాలనుకున్నా. ఆ ఎమోషన్స్ అన్నీ చూపించాలంటే హారర్ జానరే బెస్ట్ అనిపించింది. 

వితౌట్ బ్రేక్​

చిన్నప్పటి నుంచి థ్రిల్లర్ నవలలు చదవడం అంటే చాలా ఇష్టం. అందుకే థ్రిల్లర్ చిత్రాలను డైరెక్ట్ చేసేటప్పుడు హ్యాపీగా ఫీలవుతా. ఒకే జానర్​లో రకరకాల కథలు చెప్పడం పెద్ద ఛాలెంజ్. నాకు ఆ ఛాలెంజ్​ ఇష్టం. ‘కనెక్ట్‌‌’ విషయానికొస్తే ఈ సినిమా ఇంటర్వెల్​ లేకుండా చూడాలి. ఈ సినిమా 95 నిమిషాల నిడివితో చాలా గ్రిప్పింగ్‌‌గా ఉంది. కాబట్టి, ప్రేక్షకులకు అస్సలు బోర్ కొట్టదు. 

నేను మొదట కలిసిన కొంతమంది నిర్మాతలు నా కెపాసిటీ మీద డౌట్​ పడ్డారు. దాంతో నా ఫ్రెండ్స్ ఒక పైలట్ సీన్​ షూటింగ్ చేయమని ఐడియా ఇచ్చారు. అతి తీయడానికి నా ఫ్రెండ్స్ 60,000 రూపాయలు ఇచ్చారు. నిర్మాతలకు చూపించడానికి మేం ఒక ఇంపార్టెంట్ సీన్ తీశాం’ ఆ టైంలో, నా టెన్షన్​ ఒక్కటే. నా కథను ఇప్పటికే చాలామందికి చెప్పా. వాళ్లలో ఎవరైనా నా ఆలోచనను దొంగిలించి సినిమా తీస్తారేమోనని. అందుకని నేను దానిని ‘రైటర్స్ గిల్డ్‌‌’లో నమోదు చేశా. 

పెద్ద యాక్టర్స్​ని పెట్టాలని..

‘కనెక్ట్’లో సత్యరాజ్, అనుపమ్​ ఖేర్​ లాంటి పెద్ద యాక్టర్స్​ ఉన్నారు. ఈ కథని పెద్దగా చూపించాలంటే అలాంటి స్టార్స్ ఉండాలని విగ్నేష్ శివన్​ సలహా ఇచ్చాడు. అలా వాళ్లని కలిసి, కథ చెప్పా. నటించడానికి ఇద్దరూ ఒప్పుకున్నారు. 

ప్రజ్ఞ