
కొండకోనల్లో గలగలాపారే సెలయేళ్ల మధ్య పచ్చని ప్రకృతి ఒడిలో జీవించే ఆదివాసీల హక్కుల గురించి చైతన్యం కల్పించాలనే లక్ష్యంతో ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ ముఖ్య ఉద్దేశ్యాన్ని మరచి మూడు దశాబ్దాలకుపైగా అయ్యింది. పాలకులు దీన్ని ఒక జాతరలాగ లేదా కేవలం ఒక పండుగగా మార్చేశారు. అభివృద్ధి పేరుతో జరుగుతోన్న విధ్వంసం వారి జీవితాలపాలిట శాపంగా మారింది.
నేటికీ విద్య, ఉద్యోగ, ఉపాధి, వైద్యావకాశాలుగానీ కనీస మౌలిక సదుపాయాలుగానీ వారికి అందుబాటులోకి రాలేదు. తమదైన ప్రత్యేక ఆచార వ్యవహారాలను, హక్కులను కోల్పోతున్నారు. తాము పోరాడి సాధించుకున్న హక్కులు క్రమంగా ఒక్కొక్కటిగా కనుమరుగవుతున్నాయి. అటవీ వనరులు, ఆదివాసీల హక్కుల పరిరక్షణకు సంబంధించిన సమస్యలపై 1982 ఆగస్టు 9న జెనీవాలో మానవ హక్కులకు సంబంధించిన 26 మందితో ఒక సమావేశాన్ని నిర్వహించారు.
140 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలోనే అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ తేదీని ఖరారు చేశారు. ఐక్య రాజ్య సమితి అంచనా ప్రకారం నేటికీ ఐదువేల ఆదివాసీ తెగలు, 6700 భాషలు మనుగడలో ఉన్నాయి. మనదేశంలో 467 ఆదివాసీ తెగలు ఉండగా వాటిలో 92శాతం ఈనాటికీ అడవిపైనే ఆధారపడి, అర్ధాకలితో జీవిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా 37 కోట్ల మంది ఆదివాసీలు వివిధ రకాల సమస్యలు, వివక్షను ఎదుర్కొంటున్నారు.
సిఫార్సులు బుట్టదాఖలు ఆదివాసీల హక్కులు, సంస్కృతుల రక్షణ కోసం ఐక్యరాజ్యసమితి ఆమోదించిన తీర్మానాలు, విధానాలు, అభివృద్ధి ఆశయాలు ఆచరణలో తుంగలో తొక్కేస్థితి నెలకొంది. ఆదివాసీల అభివృద్ధిపై ఐక్యరాజ్యసమితిలో సంతకం చేసిన భారత దేశంలో ఆదివాసీలపై అనుసరిస్తున్న అమానుష విధ్వంసకాండ ఫలితంగా నిలువనీడకూడా లేని పరిస్థితి ఉంది. ప్రభుత్వం చేపడుతోన్న ఆదివాసీ వ్యతిరేక చర్యలు వారిని నిర్వాసితులుగా తయారుచేసింది.
ద్రౌపది ముర్ముకి రాష్ట్రపతి పదవి ఇచ్చినంత మాత్రానే మోదీ ప్రభుత్వం ఆదివాసీలకు ఎంతో చేసినట్లు ప్రచారం చేస్తోంది. కానీ, కనీసం రాష్ట్రపతి సొంత గ్రామంలో సైతం కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడాన్ని కప్పిపెడుతోంది కేంద్రంలోని ప్రభుత్వం. 805 ఆదివాసీ గ్రామాలను 5వ షెడ్యూల్‌లో చేర్చాలని 1980లో వేసిన భూరియా కమిషన్ చేసిన సిఫార్సులను సైతం బుట్టదాఖలు చేశారు. ఐదవ షెడ్యూల్ లో ఈ ఆదివాసీ గ్రామాలు లేకపోవడం వల్ల చట్టాలు అమలు కావడం లేదు.
ఆదివాసీ హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం, తమ సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణ కోసం శ్రీకాకుళ సాయుధ రైతాంగ పోరాటం ఫలితంగా ఆదివాసీలు అనేక హక్కులు సాధించుకోగలిగారు. ఆ ఉద్యమాల ఫలితంగా 1 ఆఫ్ 70 చట్టం, పెసా చట్టం, 2006 అటవీ హక్కుల చట్టాలు ఆదివాసీలు సాధించుకోగలిగారు. కానీ, ఆచరణలో అవి అమలు కావడంలేదు.
కార్పొరేట్లకు ఖనిజాలు ధారాదత్తం
అడవులు, వనరులు, ఖనిజాలనూ కార్పొరేట్లకు ధారాదత్తం చేసే ప్రయత్నం మోదీ ప్రభుత్వం చేస్తోంది. అదానీకి, అంబానీకి, మిట్టల్‌కు అటవీ సంపద కట్టబెడుతోంది బీజేపీ. అంతకంటే ఘోరంగా 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం చట్టప్రకారం ఆదివాసీలుగా నిర్ధారించనివారంతా నేరస్తులు కనుక వారిని అడవుల నుంచి గెంటివేయాలన్న తీర్పు ఆదివాసీల నెత్తిన కత్తిలా వేలాడుతూనే ఉంది.
అటవీ, అటవీయేతర భూములను, ఉమ్మడి భూములను ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేయడానికి పెసా, అటవీ హక్కుల గుర్తింపు చట్టాలు ఆటంకంగా ఉన్నందున వీటిని నిర్దాక్షిణ్యంగా రద్దుచేయడానికి అటవీ సంరక్షణ నియమాల పేరుతో 2023లో తీసుకొచ్చిన చట్టంతో ఆదివాసీలు ఇప్పటివరకు పోరాడి సాధించుకున్న అన్ని హక్కులూ అణచివేతకు గురౌతాయి. మరోవైపు ఆపరేషన్ కగార్ పేరుతో, మావోయిస్టు రహిత భారత్‌ని సృష్టిస్తామంటూ మోదీ ప్రభుత్వం ఆదివాసీలపై యుద్ధం ప్రకటించింది.
గత మార్చిలో చత్తీస్ గఢ్ రాష్ట్రంలో 7000 ఎకరాల్లోని చెట్ల నరికివేతకు నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలో గత మే నెలలో 2,324 క ఎకరాల్లో 1,23,000 చెట్లు నరికివేతకు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు గత ఫిబ్రవరి, మార్చి నెలల్లో బైలదిల్లా1, బైలదిల్లా 2, బైలదిల్లా 3 గనులను ప్రైవేటు పరం చేశారు.
హక్కుల సాధన కోసం ఉద్యమించాలి
మావోయుస్టు ప్రభావిత ప్రాంతమైన దంతెవాడ, కాంకేరు జిల్లాల్లో 7వేల ఎకరాల గనులు 50 ఏండ్లకు లీజుకిచ్చారు. బాక్సైట్ ఖనిజాల కోసం తూర్పు కనుమలు జల్లెడ పడుతున్నారు. చత్తీస్‌గఢ్ ప్రభుత్వం టెండర్లు పిలిస్తే 58 జాతీయ, అంతర్జాతీయ బహుళజాతి సంస్థలు దానికి హాజరయ్యారంటే ఆదివాసీ ప్రాంతాల్లో జరుగుతున్నదేంటో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఏపీఓ అభివృద్ధి పేరుతో ప్రభుత్వం చేస్తోన్న చర్యలు ఆదివాసీల జీవితాల్లో కల్లోలం సృష్టిస్తున్నాయి.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో నిర్వాసితులుగా మారిన లక్షలాది మంది ఆదివాసీల పరిస్థితి పట్టించుకున్న నాథుడు లేడు. ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు తప్ప నిర్వాసితులకు ప్రత్యామ్నాయం చూపడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యింది. ఇప్పటికే రెడ్ జోన్, గ్రీన్ జోన్ పేరుతో ఆదివాసీ ప్రాంతాలను విభజించి, వారి హక్కులను కాలరాస్తున్నారు.
అటవీ భూములలో టైగర్ జోన్‌లు, ఎలిఫెంట్ జోన్‌లు, ఎకో టూరిజం సౌకర్యాలు వంటి కొన్ని అటవీయేతర కార్యకలాపాలను ప్రభుత్వం అనుమతిస్తోంది. వీటికి ప్రపంచ బ్యాంకు నిధులను సమకూరుస్తోంది. అభివృద్ధి ప్రాజెక్టుల కారణంగా భారత దేశంలో గత 50 ఏండ్లలో దాదాపు 5 కోట్ల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. డ్యామ్‌లు, గనులు, పారిశ్రామికాభివృద్ధి కారణంగా 2 కోట్లమందికి పైగా ఆదివాసీలు నిర్వాసితులయ్యారు. వీరిలో 13.3 మంది ఆదివాసీలు తమ పూర్వీకుల భూమి నుంచి కూడా నిర్వాసితులుగా మారారు.
ఆదివాసీలు తమ హక్కుల కోసం, రక్షణ కోసం, అడవులు, పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సమాజ మార్పుకోసం జరిగే ఉద్యమాల్లో ఆదివాసీల హక్కుల సాధన కూడా ఒక భాగం. ఆ ఉద్యమాల ద్వారానే ఆదివాసీల హక్కుల సాధన సాధ్యం అవుతుంది.
- వంకల మాధవరావు, సీపీఐ(ఎంఎల్)న్యూడెమొక్రసి రాష్ట్ర కమిటీ సభ్యుడు-