
- జనాల ఇబ్బందులు తప్పించడానికి అర్ధరాత్రి వరకు క్షేత్రస్థాయిలోనే..
- కలిసి పని చేసిన హైడ్రా, బల్దియా, ట్రాఫిక్ పోలీస్, వాటర్ బోర్డు, పవర్ డిపార్ట్మెంట్లు
హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలో గురువారం కురిసిన భారీ వర్షం కారణంగా అర్దరాత్రి వరకు అధికారులు, సిబ్బంది ఫీల్డ్ లో పనిచేశారు. ఒక్కసారిగా 15 సెంటీమీటర్ల వర్షం కురడంతో ఎక్కడికక్కడ నీరు చేరింది. దీంతో అర్ధరాత్రి వరకు కూడా నగరంలో సహాయక చర్యలు చేపట్టాల్సి వచ్చింది.
నగరంలోని అన్ని ప్రాంతాల్లో రాత్రి 1.30 గంటలకు ట్రాఫిక్ కంట్రోల్ లోకి వచ్చింది. హైడ్రా, బల్దియా, ట్రాఫిక్‌పోలీస్, వాటర్‌బోర్డు, పవర్ డిపార్ట్మెంట్ల అధికారులు కలిసి సహాయక చర్యల్లో పాల్గొని ఇబ్బందులను తొలగించారు. ముఖ్యంగా హైడ్రా కీలకంగా వ్యవహరించింది. కమిషనర్ రంగనాథ్ ఎప్పటికప్పుడు సహాయకచర్యలపై కోర్డినేషన్ చేశారు. అలాగే జీహెచ్ఎంసీ అధికారులు ఫీల్డ్ లో ఉన్నారు.
మేయర్ గద్వాల్ విజయలక్ష్మి బంజారాహిల్స్ లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. రోడ్డుపై చెట్టు పడిన ప్రాంతాన్ని పరిశీలించి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వాటర్ బోర్డు అధికారులు కూడా ఫీల్డ్ లో పర్యటించి సీవరేజీ ఓవర్ ఫ్లో అయిన ప్రాంతాలతో పాటు నీరు నిలిచే ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు.
వర్షంలోనే ట్రాఫిక్ పోలీసులు
భారీ వర్షం కారణంగా ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. భారీ వర్షానికి బొల్లారం జంక్షన్, హకీంపేటలోని కోటేవ్వర్ ఆలయం దగ్గర చెట్లు కూలాయి. వెంటనే స్పందిన తిరుమలగిరి ట్రాఫిక్ పోలీసులు చెట్టును తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. ఛత్రినాక క్రాస్ రోడ్స్‌లో నీళ్లు భారీగా జామ్ కావడంతో.. ట్రాఫిక్ పోలీసులు హైడ్రా టీమ్‌తో కలిసి నీళ్లను తొలగించారు.
నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు లంగర్ హౌజ్, నానల్ నగర్, కేసీపీ జంక్షన్లో ట్రాఫిక్ డీసీపీ రాహుల్హెడ్డే పర్యటించారు. నిలిచిపోయిన నీళ్లను తొలగింప జేశారు. అప్పటికప్పుడు ట్రాఫిక్ డైవర్షన్స్ , వాహనాల రద్దీ నియంత్రించడం కోసం కష్టపడ్డారు. ట్రాఫిక్ పోలీసులు అందరూ రైన్ కోట్లు, రైన్ షూలు ఏ జంక్షన్‌ను వదలకుండా వాహనాల రాకపోకలకు నియంత్రించారు. ఫీల్డ్ లో ఉండి, వర్షపు నీరు నిలిచిపోకుండా డ్రైన్లు క్లియర్ చెయ్యడంతో పాటు, పడిపోయిన చెట్లు, ఎలక్ట్రిక్ వైర్లు తొలగించారు.
అర్దరాత్రి వరకు ఫీల్డ్‌లో హైడ్రా కమిషనర్..
గచ్చిబౌలి పరిసరాలు గురువారం రాత్రి నీట మునిగాయి. గచ్చిబౌలి నుంచి మెహిదీపట్నం వెళ్లే రహదారి షేక్ పేట ఫ్లైఓవర్ వద్ద నడుము లోతు నీళ్లు నిలిచిపోయాయి. అలాగే ఉస్మానియా కాలనీలోని కొన్ని ప్రాంతాల్లోకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరింది.
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అక్కడ నీటిని తొలగించే పనులను పర్యవేక్షించారు. తొలుత ఉస్మానియా కాలనీలో వరద ప్రాంతాల్లో సహాయక చర్యలను పర్యవేక్షించిన కమిషనర్ మల్కం చెరువు పరిసరాలను పరిశీలించారు. వరద తొలగించే పనులను పర్యవేక్షిస్తూనే ట్రాఫిక్ క్లియరెన్స్ పై దృష్టి పెట్టారు. వరద ముప్పు లేని ప్రాంతాల నుంచి కూడా హైడ్రా డీఆర్ ఎఫ్, ఎంఈటీ బృందాలు అక్కడికి చేరుకుని వాహన రాకపోకలు సాఫీగా సాగేలా చర్యలు తీసుకున్నారు.
ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ ఎంసీ సిబ్బందితో పాటు అర్ధరాత్రి 12.30 గంటల వరకు అక్కడే ఉండి వరదతోపాటు ట్రాఫిక్ క్లియర్ అయ్యేలా చూశారు. ఇలా మొత్తం 78 ఫిర్యాదులను రాత్రికి రాత్రే హైడ్రా పరిష్కరించింది. 41 చోట్ల పడిపోయిన చెట్లను పక్కకు తొలిగాంచారు. 36 చోట్ల వరద నీరు నిలిచిపోగా హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ , మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు సమస్యను పరిష్రించాయి. బంజారాహిల్స్ లోని ఎస్ బీఐ ఎగ్జిక్యూటివ్ ఎంక్లెవ్, గ్రీన్ వ్యాలీ సమీపంలో వరదలో చిక్కుకున్న మహిళను కాపాడారు.
రాత్రి 2 గంటల వరకు విద్యుత్ అధికారులు
భారీ వర్షాలకు గురువారం రాత్రి పలు ప్రాంతాల్లోని 43, 11 కేవీ ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. బంజారా హిల్స్-11, సికింద్రాబాద్-12, హైదరాబాద్ సెంట్రల్-3, హైదరాబాద్ సౌత్-1, సైబర్ సిటీ-5, రాజేంద్రనగర్-2, సరూర్‌నగర్-1, హబ్సిగూడ-1, మేడ్చల్-7 ఫీడర్లలో విద్యుత్ తీగలు తెగి కరెంటు సరఫరాకు ఇబ్బంది ఏర్పడింది.
హబ్సిగూడ, మేడ్చల్ సర్కిల్ పరిధిలోని మౌలాలి, ఎఎస్ రావు నగర్, ఎఎస్ రాజు నగర్, బాబు రెడ్డి నగర్ వంటి ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలపై పడటంతో కరెంటు సరఫరా నిలిచిపోయింది. అయితే, అప్రమత్తమై సదరన్ డిస్కం సిబ్బంది రెస్క్యూ టీమ్ లు రంగంలోకి దిగి చెట్ల కొమ్మలను తొలగించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. అన్ని ఫీడర్లలో సరఫరా పూర్తిగా పునరుద్ధరించే వరకు అధికారులు, సిబ్బంది ఫీల్డ్‌లోనే ఉండి పనిచేశారు. కొన్ని ప్రాంతాల్లో రాత్రి 2 గంటల వరకు పనులు జరిగాయి.