స్టార్‌‌‌‌ హీరోలతో చేయాలంటే నాకు భయం

స్టార్‌‌‌‌ హీరోలతో చేయాలంటే నాకు భయం

రొటీన్‌ గా ఉండే సబ్జెక్టుల జోలికి పోకుం డా ఏదో ఒక కొత్త కాన్సెప్ట్‌‌ తెరకెక్కించడానికే ఇష్టపడుతుంటారు డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ. నాని, సుధీర్‌‌‌‌బాబులతో
ఆయన రూపొందించిన ‘వి’ ఈ నెల 5న ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఇంద్రగంటి ఇలా ముచ్చటించారు.

వెబ్ సిరీస్ కోసం నన్ను కొందరు సంప్రదించారు. కానీ నాకు మూడు, నాలుగు కమిట్‌‌మెంట్స్ ఉన్నాయి. అందుకే చేయలేనని చెప్పేశాను.  ఓటీటీల ద్వారా మనకు చాలామంది మంచి యాక్టర్స్ దొరుకుతున్నారు. నేను కూడా వెబ్‌‌ సిరీసులు బానే ఫాలో అవుతాను. నాకు ‘పాతాళ్ లోక్’ బాగా నచ్చింది.దర్శకుడిగా నాకిది పదో సినిమా. 2006 నుంచి 2015 వరకు  రెండేళ్లకో సినిమా చేశాను. ఆ తర్వాత ఏడాదికో సినిమా చేశాను. ఈ సినిమా కూడా  పోయినేడు డిసెంబర్‌‌‌‌లోనే రిలీజ్ కావాల్సింది. కానీ మా నాన్న చనిపోవడంతో షూటింగ్ లేటయ్యింది.  హీరోలకు ఓ సినిమా చేస్తూనే మరో సినిమా చేసే అవకాశం ఉంటుంది. దర్శకులకు అలా ఉండదు. దాసరి గారు మాత్రమే అలా చేసేవారు.

‘వి’ అని పేరు పెట్టడానికి కారణం ఏంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. థియేటర్లోనే రిలీజ్ చేద్దామనుకున్నా పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఓటీటీ విడుదలకు డిసైడయ్యాం. దాదాపు రెండొందల దేశాల్లో రిలీజవుతోంది. థియేటర్ ఎక్స్‌‌‌‌పీరియెన్స్‌‌‌‌కి ఎక్కడా తగ్గకుండా.. సౌండ్ సిస్టమ్ దగ్గర్నుంచి స్క్రీన్‌‌‌‌ ప్రెజెంటేషన్ వరకు అన్ని విధాలుగా టెస్ట్ చేశాకే విడుదల చేస్తున్నాం. పద్మావత్, బాజీరావు మస్తానీకి పని చేసిన సౌండ్ డిజైనర్స్ ఈ సినిమాకి వర్క్ చేశారు.

దిల్ రాజు గారికి ఎగ్జిబిటర్‌‌‌‌‌‌‌‌గా, డిస్ట్రిబ్యూటర్‌‌‌‌‌‌‌‌గా ఎంతో అనుభవం ఉంది. ఆయనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే మామూలు విషయం కాదు. నేను, నాని థియేటర్ కోసమే చూశాం. కానీ థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియకపోవడంతో  రాజు గారి నిర్ణయానికి ఒప్పుకున్నాం. ఐదు నెలల కన్నా ఎక్కువ వెయిట్ చేయడం మంచిది కాదనిపించింది.

‘అష్టా చమ్మా’ రిలీజ్ రోజునే ఈ సినిమా రిలీజ్ కావడం హ్యాపీగా ఉంది. నానితో నాకిది మూడో సినిమా. ఫైనల్ కాపీ చూసి నాని ‘ఇది నా 25వ సినిమా కావడం గర్వంగా ఉంది’ అన్నాడు. తన ఇరవై అయిదో సినిమా అని ప్రత్యేకంగా ప్లాన్ చేయలేదు. నాకసలు ఆ విషయం తెలియదు కూడా. తర్వాత తెలిసి ‘నువ్వేమన్నా ప్లాన్ చేస్తున్నావా’ అని అడిగితే అదేమీ లేదన్నాడు నాని. తను రిస్క్‌‌‌‌ చేయడానికి భయపడడు. కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే ప్రయోగాలకు ముందుంటాడు. ‘జెర్సీ’లాంటి సినిమా చేయడం కూడా రిస్కే. కానీ చేశాడు. తనకి పాత్ర బాగుండాలంతే. అందుకే అంచెలంచెలుగా ఎదిగాడు.

ఆల్రెడీ పని చేసిన యాక్టర్స్‌‌తో వర్క్ చేయడమే నాకు చేసిన నటులతో చేయడమే నాకు కంఫర్ట్‌‌‌‌గా ఉంటుంది. నేను ఎలాంటి నటన కోరుకుంటానో నాని, సుధీర్, నివేదలకు బాగా తెలుసు. నా పాత్రలకు వంద శాతం సూటవుతారు కాబట్టి వారిని ఎంచుకున్నాను. నాని, సుధీర్, నివేద, అదితి అందరూ బెస్ట్ పర్‌‌ఫార్మెన్స్‌ ఇచ్చారు. నాని నెగిటివ్ షేడ్ ఎంత ఉంటుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్. సుధీర్, నాని సెట్స్‌‌‌‌లో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. అస్సలు ఇగోలకు వెళ్లరు. అదితిని ట్రైలర్లో చూపించకపోవడానికి కారణం ఉంది. అదేంటో సినిమా చూశాక తెలుస్తుంది.

సుధీర్ యాక్షన్ ఇమేజ్ ఈ సినిమాకి ప్లస్ అవుతుంది. ఒక పాటలో డ్యాన్స్ కూడా చాలా బాగా చేశాడు. అమిత్ త్రివేది పాటలు బాగున్నాయి. బ్యాగ్రౌండ్  స్కోర్ చేయలేనని చెబితే దిల్‌‌‌‌రాజు గారు తమన్‌‌‌‌ని ఒప్పించారు.  పాటలు ఎంత ప్లస్ అవుతాయో బ్యాగ్రౌండ్ స్కోర్‌‌‌‌‌‌‌‌ కూడా  సినిమాకి అంతే ప్లస్ అవుతుంది.

నా గత సినిమాలతో పోలిస్తే ఇది పెద్ద సినిమా. ఐదు రాష్ట్రాల్లో షూట్ చేశాం. నేను ఏ సినిమాకీ ఇంత కష్టపడలేదు. దర్శకుడిగా నా నెక్స్ట్​లెవెల్ సినిమా ఇది. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది.

ఇదో ఎమోషనల్ డ్రామా. క్లైమాక్స్ చూస్తే సీక్వెల్ ఉందేమోననే డౌట్ వస్తుంది. కానీ నాకా ఆలోచనేమీ లేదు. నిజానికి విజయ్ దేవరకొండతో ప్లాన్ చేశాం. కానీ పూరి జగన్నాథ్ తర్వాత విజయ్ వేరే దర్శకుడితో ఒక సినిమా కమిటయ్యాడు.  పైగా షూటింగ్స్ ఎప్పుడు మొదలవుతాయో తెలియడం లేదు. ముందు అది క్లారిటీ వస్తే.. ఎవరితో చేయాలి, ఎప్పుడు చేయాలనేది తెలుస్తుంది.