
కేరాఫ్ కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య లాంటి చిత్రాలతో నిర్మాతగా ప్రూవ్ చేసుకున్న ప్రవీణ పరుచూరి దర్శకురాలిగా పరిచయం అవుతోన్న చిత్రం ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’. మనోజ్ చంద్ర, మోనికా లీడ్ రోల్స్‌లో నటించారు. రానా దగ్గుబాటి సమర్పణలో గోపాలకృష్ణ పరుచూరి, ప్రవీణ పరుచూరి కలిసి నిర్మించారు. జులై 18న సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా ప్రవీణ పరుచూరి మాట్లాడుతూ ‘చిన్నప్పట్నుంచీ సినిమాలంటే పిచ్చి. అమెరికాలో డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తూనే ఫిలిం మేకింగ్ సంబంధించి ఒక షార్ట్ కోర్సు చేశా. డైరెక్షన్ అనేది డిఫికల్ట్ క్రాఫ్ట్. అందుకే ప్రొడక్షన్ చేసి నేర్చుకోవాలనుకున్నా.
నా గత రెండు సినిమాలు అన్ని క్రాఫ్ట్స్ మీద అనుభవాన్ని ఇచ్చాయి. మన గ్రామదేవతలపై చాలామందికి విశ్వాసం, నమ్మకం ఉంటుంది. ఇందులో అలాంటి ఓ నమ్మకాన్ని చూపించాం.
మన చుట్టూ జరుగుతున్న కథలాగే అనిపిస్తుంది. ఇందులో నేను ఓ టఫ్ లేడీ క్యారెక్టర్ చేశా. నా పాత్రకు రెండు అద్భుతమైన సీన్స్ ఉన్నాయి.‘పుష్ప 2’లో జాతర సీన్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో అలాంటి ఒక సీక్వెన్స్ ఉంది. అది తప్పకుండా అందర్నీ అలరిస్తుందని భావిస్తున్నా.
ఈ సినిమాకి చాలా మంచి స్క్రీన్‌ప్లే కుదిరింది. అలాగే చాలా మంచి విజువలైజేషన్ ఉంది. ‘కంచరపాలెం’లాగానే ఒక మంచి ఎంటర్‌టైనర్ అవుతుందనే నమ్మకం ఉంది’అని చెప్పింది.