విలక్షణ నటుడు సముద్రఖని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలిపాడు. ఈమేరకు ట్విట్టర్ వేదికగా ఒక లేఖను విడుదల చేసాడు. ప్రస్తుతం సముద్రఖని పోస్ట్ చేసిన ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు విషయం ఏంటంటే.. నిన్న సముద్రఖని పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓ లేఖను విడుదల చేశారు. దానికి బదులుగా ధన్యవాదాలు తెలుపుతూ ఓ లేఖ రాశాడు సముద్రఖని.
లేఖలో పవన్ కళ్యాణ్ ని ‘‘అన్నయ్యా అని సంబోధించిన సముద్రఖని .. నా పట్ల మీరు చూపించిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడిని. మీతో నటుడిగా, దర్శకుడిగా ఈ ప్రయాణం ఎన్నో మంచి విషయాలను నేర్పించింది. మరింత గొప్పగా కొనసాగేందుకు కావలసిన ధైర్యాన్ని, చైతన్యాన్ని నాలో నింపింది. సమాజం పట్ల మీకున్న ప్రేమ, అక్కర నన్ను మీ వ్యక్తిత్వానికి అభిమానినయ్యేలా చేశాయి. సదా మీలాంటి సాహస యోధుడి ఆలోచనలకు, దృక్పథానికి సహచరుడినై ఉండాలని కోరుకుంటాను. ప్రజాశ్రేయస్సుకై మీరు కలలుగనే మార్పు సాకారమై, తెలుగు రాష్ట్రాలకే కాక యావత్ భారతదేశానికి మేలు జరిగే దిశగా ఆ భగవంతుడు మిమ్మల్ని నడిపించాలని, మీకు శక్తి ప్రసాదించాలని ప్రార్థిస్తాను’’ అని సముద్రఖని తన లేఖలో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ లేఖ నెట్టింట వైరల్ గా మారింది.
ఇక సముద్రఖని దర్శకత్వంలో పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ హీరోలుగా ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ‘వినోదయ సితం’ అనే తమిళ సినిమాకి ఇది రీమేక్. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది.