SS Rajamouli: ‘బాహుబలి’ రాకెట్ ప్రయోగం భారీ సక్సెస్.. ఇస్రోను అభినందించిన ఎస్ ఎస్ రాజమౌళి

SS Rajamouli: ‘బాహుబలి’ రాకెట్ ప్రయోగం భారీ సక్సెస్.. ఇస్రోను అభినందించిన ఎస్ ఎస్ రాజమౌళి

ఇస్రో (ISRO) చేపట్టిన CMS-03 ఉపగ్రహ ప్రయోగం సక్సెస్ అయిన విషయం తెలిసిందే. ఈ అరుదైన ప్రయోగంతో భారతదేశం అంతరిక్ష పరిశోధనలో మరో చారిత్రాత్మక ఘనతను సాధించింది. ఆదివారం (2025 నవంబర్ 2న) సాయంత్రం 5.26 గంటలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్‌ సెంటర్‌ (SDSC) నుంచి బాహుబలి రాకెట్‌గా పేరొందిన ‘LVM3-M5’ వాహకనౌక నింగిలోకి బయల్దేరింది. 16 నిమిషాల 29 సెకన్లపాటు పయనించి 5.42 గంటలకు ఉపగ్రహాన్ని జియో సింక్రోనస్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌ (GTO)లోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది.

ఇలా “బాహుబలి” రాకెట్.. భారతదేశ అంతరిక్ష సరిహద్దులను విస్తరించి అఖండ విజయం సాధించింది. ఈ సందర్భంగా టాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇస్రో బృందం సాధించిన గొప్ప విజయానికి అభినందనలు తెలుపుతూ, కృతజ్ఞతను వ్యక్తం చేశారు రాజమౌళి.

Also Read : రవితేజ మార్పు కోరుకుంటున్న ఫ్యాన్స్

 “అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం CMS-03ను విజయవంతంగా ప్రయోగించినందుకు ఇస్రో బృందానికి అభినందనలు! అంతరిక్ష పరిశోధనలో మన సాంకేతిక బలాన్ని మరియు సామర్థ్యాన్ని ప్రదర్శించడం భారతదేశానికి గర్వకారణమైన క్షణం. ఈ రాకెట్‌కు 'బాహుబలి' (Bahubali Rocket Launch) అని ప్రేమగా పేరు పెట్టడంతో.. మా మొత్తం బాహుబలి బృందం ఉప్పొంగిపోయింది. దాని బరువు మరియు బలం కారణంగా.. నిజంగా ఇది మనందరికీ లభించిన గౌరవం” అని రాజమౌళి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

బాహుబలి బృందం కూడా లాంచ్ వీడియోను తిరిగి పోస్ట్ చేసి, “ప్రపంచవ్యాప్తంగా హృదయాలను గెలుచుకోవడం నుండి ఇప్పుడు ఆకాశాన్ని జయించడం వరకు బాహుబలి స్ఫూర్తికి నిజంగా అవధులు లేవు! ఇస్రో బృందానికి అభినందనలు” అని తెలిపింది. 

వెండితెర నుంచి అంతరిక్షం:

ఇండియన్ సినిమా రూపురేఖలను మార్చేసిన దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి. ఆయన సృష్టించిన అద్భుత చిత్రం 'బాహుబలి'. 2015లో రిజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టించింది. ఈ తర్వాత వచ్చిన బాహుబలి 2 సృష్టించిన రికార్డుల గురించి చెప్పనక్కర్లేదు. ఇలా తెలుగు వెండితెరపై ఆవిష్కృతమైన బాహుబలి.. తెలుగు సినీ పరిశ్రమ సత్తాను ప్రపంచ వ్యాప్తంగా సాటిచెప్పింది. ఇపుడు 'బాహుబలి-ది ఎపిక్' పేరుతో కొత్త హంగులతో మళ్ళీ రీ రిలీజై బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. 3 గంటల 45 నిమిషాల నిడివి గల ఈ చిత్రం తొలి మూడు రోజుల్లో రూ.25 కోట్లకి పైగా వసూళ్లతో దూసుకెళ్తుంది.

ఈ క్రమంలో ఇస్రో చేపట్టిన CMS-03 “బాహుబలి” రాకెట్ సక్సెస్ అవ్వడంతో.. "వెండితెర నుంచి అంతరిక్షం" వరకు బాహుబలి సత్తా చాటింది అని సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

బాహుబలి రాకెట్ బరువు & ప్రత్యేకతలు:

ఇస్రో యొక్క బాహుబలి రాకెట్ CMS-03 అత్యంత బరువైన ఉపగ్రహం. 4,410 కిలోల బరువున్న CMS-03, భారత నావికాదళానికి సేవలందించిన GSAT-7 స్థానంలోకి వచ్చింది. ఈ శాటిలైట్‌ 15 ఏళ్ల పాటు కమ్యూనికేషన్‌ సేవలు అందించనుందని ఇస్రో ఛైర్మన్‌ నారాయణన్‌ వెల్లడించారు. 2013లో ప్రయోగించిన జీశాట్‌-7 ఉపగ్రహ స్థానంలో ఇది సేవలందించనుంది.