అరుణపై రగులుతున్న అసమ్మతి

అరుణపై రగులుతున్న అసమ్మతి
  •     పార్టీని వీడిన నలుగురు కీలక నేతలు
  •     అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటమికి కారణమయ్యారని ఆరోపణలు 
  •     వీళ్ల బాటలోనే మరికొందరు
  •     ఇప్పటికే సైలెంట్​మోడ్​లోకి బీసీ లీడర్లు

హైదరాబాద్​, వెలుగు : త్వరలో లోక్​సభ ఎన్నికల షెడ్యూల్​ రానున్న నేపథ్యంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఆ పార్టీ మహబూబ్​నగర్​ పార్లమెంట్​అభ్యర్థి డీకే అరుణపై అసమ్మతి రాజుకుంటోంది. తమ ఓటమికి అరుణే కారణమయ్యారని ఆరోపిస్తూ బీజేపీ నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన నలుగురు కీలక నేతలు తాజాగా పార్టీని వీడడం కలకలం రేపింది. పార్టీలో తమకు ప్రియారిటీ దక్కడం లేదని ఆరోపిస్తూ మరికొందరు లీడర్లు ఇటీవల వారి పదవులకు, పార్టీ సభ్యత్వాలకు వరుసగా రాజీనామాలు చేశారు. ఇప్పటికే బీసీ లీడర్లంతా సైలెంట్​మోడ్​లోకి వెళ్లిపోగా, ఈ నెలాఖరు నాటికి మరికొందరు పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతుండడంతో కమలం క్యాడర్​లో అయోమయం నెలకొంది.

రాజీనామాలతో షాక్​ ఇస్తున్న లీడర్లు.. 

ఎన్నికల ముంగిట కీలకనేతలంతా రాజీనామాలతో అరుణకు షాక్​  మీద షాక్ ​ఇస్తున్నారు. మహబూబ్​నగర్ ​పార్లమెంట్​లో పాలమూరు, జడ్చర్ల, షాద్​నగర్, కొడంగల్​, నారాయణపేట, మక్తల్​, దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇందులో నాలుగు చోట్ల గత ఎన్నికల్లో బీజేపీ తరుపున పోటీ చేసిన అభ్యర్థులు పార్టీని వీడారు. మక్తల్ సెగ్మెంట్​ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన మాదిరెడ్డి జలంధర్​ రెడ్డి, నారాయణపేట నుంచి బరిలో నిలిచిన కొత్తకాపు రతంగ్​పాండు రెడ్డి పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. ఈ రెండు చోట్ల అరుణ, తన బంధువులకు సహకరించడం వల్లే తాము ఓడిపోయామని ఇద్దరు నేతలు కొన్నాళ్లుగా ఆరోపిస్తున్నారు. ఆమెపై  చర్యలు తీసుకోవాలని జలంధర్​రెడ్డి అప్పట్లోనే పార్టీ హైకమాండ్​కు ఫిర్యాదు చేశారు.

కానీ, అధిష్ఠానం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇద్దరూ బీజేపీని వీడాలని నిర్ణయించుకున్నారు. గురువారం రాత్రి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి, రాష్ర్ట అధ్యక్షుడు కిషన్​ రెడ్డికి రిజిగ్నేషన్ ​లెటర్ ​పంపించారు. భవిష్యత్​ కార్యాచరణపై చర్చించేందుకు శుక్రవారం అనుచరులతో సమావేశమయ్యారు. ఇక మహబూబ్​నగర్​ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఏపీ మిథున్​ రెడ్డి కూడా సీఎం రేవంత్​ రెడ్డి సమక్షంలో కొద్ది రోజుల కిందే కాంగ్రెస్​లో చేశారు. జడ్చర్ల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి  ఓడిపోయిన చిత్త రంజన్​దాస్ ​కూడా ఇటీవల కాంగ్రెస్ ​గూటికి వచ్చారు.

గత గురువారం నవాబ్​పేట మండలంలో పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించగా ఆ పార్టీ స్టేట్​ఎగ్జిక్యూటివ్​ మెంబర్, నవాబ్​పేట ఇన్​చార్జి బాలా త్రిపుర సుందరి హాజరయ్యారు. మీటింగ్​లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తన ఫొటో లేకపోవడంతో అలిగిన ఆమె సమావేశంలో పాల్గొనకుండానే వెళ్లిపోయారు.  ఆమె కూడా త్వరలో పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు చర్చ జరుగుతోంది.