- హెచ్1బీ వీసాల నిలిపివేతపై స్పందించిన పిచాయ్
- ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన మైక్రోసాఫ్ట్, ట్విట్టర్
వాషింగ్టన్: కరోనా కాలంలో ఉద్యోగాలు పోయిన అమెరికన్లకు సాయం చేసేందుకు హెచ్1బీ వీసాలను రద్దు చేయాలని ట్రంప్ నిర్ణయించిన విషయంపై గూగుల్, ఆల్ఫాబెల్ సీఈవో సుందర్‌పిచాయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్విట్టర్ ద్వారా స్పందించారు. వీసాలు జారీ చేయబోమని ట్రంప్ చెప్పినప్పటికీ తాము మాత్రం ఇమ్మిగ్రెంట్లకు మద్దతుగా నిలుస్తామని ఆయన అన్నారు“ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం నిరూత్సాహ పరిచింది. . అమెరికా ఆర్థిక ప్రగతిలో ఇమ్మిగ్రేషన్ విధానం చాలా హెల్ప్ చేస్తోంది. ఆ కారణంగానే అమెరికా టెక్నాలజీలో గ్లోబల్ లీడర్‌గా నిలిచింది. గూగుల్ కంపెనీ ఈ రకంగా ఉండేందుకు ఇమ్మిగ్రేంట్లే కారణం” అని పిచాయ్ ట్వీట్ చేశారు. ట్రంప్ నిర్ణయాన్ని మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ సంస్థలు కూడా వ్యతిరేకించాయి. మైక్రోసాఫ్ట్ అధ్యక్షుడు బ్రాడ్ స్మిత్ ట్రంప్ చర్యలను విమర్శిస్తూ ట్వీట్ చేశారు. అమెరికాకు ఇప్పుడు వలసదారుల అవసరం చాలా ఉందని, వాళ్లే కంపెనీలో కీలక పాత్ర పోషిస్తారని, వారు అమెరికాలో క్లిష్టమైన మౌలిక సదుపాయాలకు మద్దతు ఇస్తారు, అవసరమైన సమయంలో వాళ్లు దేశానికి ఎంతో సహకరించారు అని ఆయన ట్వీట్ చేశారు. బ్రాడ్ స్మిత్ చేసిన ట్వీట్‌ను మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెండ్ల కూడా రీట్వీట్ చేశారు. దీనిపై ట్విట్టర్ కూడా ప్రకటన రిలీజ్ చేసింది. “ ఈ చర్య అమెరికా ఆర్థిక పరిస్థితిని, దాని వైవిధ్యాన్ని బలహీనపరుస్తుంది. ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు మన శ్రమశక్తిలో చేరడానికి, పన్నులు చెల్లించేందుకు ప్రపంచ వేదికపై మన పోటీతత్వానికి సహకరించేందుకు ఇక్కడకు వస్తారు. వారిని ఇబ్బందులు పెట్టే ఆలోచనలు మంచివికావు” అని వరుస ట్వీట్లు చేసింది. ట్రంప్ ఆడ్మినిస్ట్రేషన్‌లో ఒకరైన ఆలిస్ జి వెల్స్ కూడా ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. హచ్1బీ ద్వారా ఉత్తమమైన, టాలెంట్ ఉన్నవారి వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎంతో డెవలప్ అయిందని, విదేశీ ప్రతిభను ఆకర్షించడం అమెరికా బలం అని, అది బలహీనత కాదు అని అన్నారు. ఈ ఏడాది చివరి వరకు హెచ్ –1బీ వీసాల జారీని నిలిపేస్తూ ట్రంప్ నిర్ణయించారు.
ఇదీ చదవండి:
