త్వరలోనే వైట్ గూడ్స్ కంపెనీలకు పీఎల్ఐ ఇన్సెంటివ్స్​

 త్వరలోనే వైట్ గూడ్స్ కంపెనీలకు పీఎల్ఐ ఇన్సెంటివ్స్​

నాలుగో క్వార్టర్​లో చెల్లింపు

న్యూఢిల్లీ :  వైట్​గూడ్స్​ తయారు చేసే కంపెనీలకు ఈ ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్లో ప్రభుత్వం పీఎల్​ఐ కింద రూ.79 కోట్ల విలువైన ఆర్థిక ప్రోత్సాహకాలను అందించనుంది. కొన్ని ఎంపిక చేసిన సంస్థలు ఇప్పటికే ఉత్పత్తిని ప్రారంభించాయని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.   వైట్ గూడ్స్‌‌‌‌‌‌‌‌పై ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్​ఐ) పథకాన్ని దేశీయంగా ఎయిర్ కండిషనర్లు, ఎల్​ఈడీ లైట్ కాంపోనెంట్ల తయారీని ప్రోత్సహించడానికి అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద వివిధ రంగాలకు రూ.11 వేల కోట్ల ఇన్సెంటివ్స్​ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చెల్లింపులు తగ్గవచ్చని ఆయన తెలిపారు. వైట్ గూడ్స్ విభాగంలో పీఎల్​ఐ పథకానికి ఎంపికైన 64 మంది లబ్ధిదారుల్లో 15 మంది ఉత్పత్తి ప్రారంభించారు.

ఈ 15 కంపెనీలు మార్చి 31, 2022 వరకు గెస్టేషన్​ పీరియడ్​ను (ఉత్పత్తికి సిద్ధమయ్యే దశ) ఎంచుకున్నారు. మార్చి 31, 2023 వరకు గెస్టేషన్​ పీరియడ్​ను ఎంచుకున్న మిగిలిన కంపెనీల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ పథకం 2021–-22 నుంచి 2028–-29 వరకు అమలు అవుతుంది. దీనికింద ఇన్సెంటివ్స్​ కోసం రూ. 6,238 కోట్లు ఖర్చు చేస్తారు.  మొత్తం రూ.1.98 లక్షల కోట్ల పీఎల్‌‌‌‌‌‌‌‌ఐ పథకం కింద ఈ ఏడాది మార్చి వరకు  రూ.2,900 కోట్ల విలువైన ప్రోత్సాహకాలను పంపిణీ చేశారు. ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీలకు ఈ ఏడాదికి అదనంగా రూ.1,000 కోట్ల ప్రోత్సాహకాలు మంజూరు అయ్యాయి. ఎలక్ట్రానిక్స్, మొబైల్ తయారీ, ఫార్మా  ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల కోసం పీఎల్​ఐ పథకాలు బాగా పనిచేస్తున్నాయని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.