సాగు కరెంట్ లెక్క తేల్చట్లేదు

సాగు కరెంట్ లెక్క తేల్చట్లేదు

ట్రాన్స్‌‌‌‌ఫార్మర్ల దగ్గర స్మార్ట్ మీటర్లు పెట్టని డిస్కంలు 

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి వాడుతున్న కరెంట్ లెక్కలు తేల్చేందుకు డిస్కంలు ముందుకురావడం లేదు. ఈ నెల 31లోపు ప్రతి వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్‌‌‌‌ఫార్మర్ (డీటీఆర్) వద్ద స్మార్ట్ మీటర్ పెట్టాల్సిందేనని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) నాలుగు నెలల కింద స్పష్టం చేసినా.. ఇంతవరకు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా సగటున రూ.11 వేల కోట్ల అగ్రికల్చర్ సబ్సిడీ చెల్లిస్తున్నది. డిస్కంల సమస్యలతో పాటు సంస్థకు వస్తున్న నష్టాలను ఈ సబ్సిడీతో భర్తీ చేసుకుంటున్నాయని, అందుకే ట్రాన్స్‌‌‌‌ఫార్మర్లకు మీటర్లు పెట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అలాగే, స్మార్ట్ మీటర్లు పెట్టేందుకు తమ వద్ద నిధులు లేవనే సాకులు కూడా చెబుతున్నది. అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌కు ఎంత కరెంట్ ఇస్తున్నారనే లెక్కలు బయటకు వస్తే.. ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ మొత్తం తగ్గుతుందనే కారణంతో మీటర్లు పెట్టేందుకు డిస్కంలు వెనకడుగు వేస్తున్నట్లు తెలిసింది. 

ఆదాయం రూ.43,221 కోట్లు వస్తుంటే.. మీటర్లకు వంద కోట్లు లేవంట..

రిలీజ్ విద్యుత్ అవసరాలు, ఆదాయ, వ్యయ అంచనాల వివరాలను శుక్రవారం ఈఆర్సీ వెల్లడించింది. దీని ప్రకారం 2023-–24లో డిస్కంలకు కరెంట్ బిల్లుల ద్వారా రూ.43,221 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇంత భారీగా ఆదాయం వస్తున్నా.. వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్‌‌‌‌ఫార్మర్ల దగ్గర మీటర్లు పెట్టేందుకు డబ్బులు లేవని సాకులు చెబుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6 లక్షల డీటీఆర్‌‌‌‌‌‌‌‌లు ఉండగా, వీటికి స్మార్ట్ మీటర్లు పెడితే రూ.93 కోట్లు అవసరమని గతంలో నిర్వహించిన స్టడీలో వెల్లడైంది. ఈ మొత్తం కూడా తమ దగ్గర లేవని డిస్కంలు చెబుతున్నాయి. దీనిపై ఈఆర్సీ వివరణ అడిగితే, అప్పు కోసం రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌‌‌‌కు దరఖాస్తు చేస్తే, రుణం ఇవ్వలేదని చెప్పాయి. మీటర్లు పెట్టేందుకు ఇప్పటికే ఈఆర్సీ నాలుగు సార్లు గడువిచ్చినా.. ఒక్క అడుగు మందుకు పడలేదు. 

కరెంట్ లెక్కలు తెల్వొద్దని..

రాష్ట్రంలో వ్యవసాయ ట్రాన్స్‌‌‌‌ఫార్మర్లకు మీటర్లు ఏర్పాటు చేస్తే సాగుకు ఎంత కరెంట్ ఇస్తున్నారనే లెక్కలు తెలుస్తాయి. దీని ఆధారంగా యూనిట్‌‌‌‌కు ఇంత అని రాష్ట్ర ప్రభుత్వం లెక్కగట్టి వంద శాతం సబ్సీడీని రిలీజ్ చేస్తుంది. అయితే, ఇక్కడే అసలు కథ మొదలవుతోంది. రాష్ట్రంలో నార్త్ డిస్కం (ఎన్‌‌‌‌పీడీసీఎల్), సౌత్‌‌‌‌ డిస్కం(ఎస్పీడీసీఎల్) రెండు ఉన్నాయి. ఇప్పటివరకు అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌కు ఇస్తున్న కరెంట్‌‌‌‌పై ఈ సంస్థలు అంచనాల లెక్కలనే చెబుతున్నాయి. వీటి ఆధారంగానే మొత్తం కరెంటులో యావరేజ్‌‌‌‌గా 36 శాతం వ్యవసాయానికి ఇస్తున్నట్లు పేర్కొంటున్నాయి. మొత్తం 6 లక్షల డీటీఆర్‌‌‌‌‌‌‌‌లు ఉంటే, గతంలో పెట్టిన 6 వేల డీటీఆర్‌‌‌‌‌‌‌‌లకు మీటర్లు ఏర్పాటు చేశారు. అందులో లెక్కలను అంచనా వేసుకుని అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌కు ఎంత కరెంట్‌‌‌‌ ఇస్తున్నామనేది చెబుతున్నారే తప్ప.. కరెక్ట్‌‌‌‌ లెక్కలు చెప్పడం లేదు.