
జనాభా ప్రాతిపదికన, జాతీయ సగటుతోపాటు సమానంగా ముద్ర రుణాలు పొందడం తెలంగాణ ప్రజల హక్కు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర బీజేపీ నాయకత్వం దీనిపై నిజాయతీగా స్పందించాలి. ముద్ర రుణాల మంజూరులో దేశ వ్యాప్తంగా ఒక్క పద్ధతి- తెలంగాణ రాష్ట్రానికి వేరొక పద్ధతిగా ఉంది. ప్రధాని మోదీ ఏప్రిల్ 8, 2015 నాడు ప్రధానమంత్రి ముద్ర యోజన ప్రారంభించారు. స్వయం ఉపాధి కల్పించుకొని బతుకాలనుకునే పేదవారికి ఇప్పటికీ బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం తగినరీతిలో అందడంలేదు.
తామే ఉపాధి కల్పించుకుని బతుకుతున్న చిరువ్యాపారులకు పది లక్షల రూపాయల వరకు ( 24.10.2024 నుంచి 20.00 లక్షల రూపాయల వరకు) ఎలాంటి స్యూరిటీ లేకుండా బ్యాంకుల ద్వారా దీర్ఘ కాలిక రుణాలు ఇప్పించడం, జీవిత ఆధారం చూపించడమే కాకుండా ప్రైవేట్ అప్పుల అధిక వడ్డీ భారం నుంచి స్వయం ఉపాధితో బతుకుతున్నవారిని ఆదుకునే ఉద్దేశ్యంతో ఈ పథకం ప్రారంభించారు.
మన రాష్ట్రంలో ముఖ్యంగా చిరు వ్యాపారస్తులు, వీధి వ్యాపారస్తులు, వారాంతపు వడ్డీ, నెల వడ్డీ చెల్లించడానికి కూడా 5% నుంచి 10% వరకు వడ్డీకి అప్పు తీసుకుంటున్నారు. సంపాదనలో చాలా భాగం వడ్డీలకే చెల్లిస్తూ వ్యాపారం చేస్తూ దుర్బర జీవితం గడుపుతున్నారు. వీరందరికీ ముద్ర రుణాలు చాలా ఉపయోగపడతాయి. కానీ, గత 10 సంవత్సరాల కాలంలో- కేంద్ర ప్రభుత్వం ముద్ర రుణాల మంజూరులో తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున అన్యాయం చేస్తున్నది. 28–2–2025 వరకు దేశ జనాభాలో 37.20 శాతం మందికి ముద్ర రుణాలు మంజూరుకాగా, మన రాష్ట్రంలో కేవలం 20.09 శాతం మందికి మాత్రమే ముద్ర రుణాలు మంజూరు అయ్యాయి.
దేశ సగటుతోపాటు మన రాష్ట్రంలో కూడా (28.02.2025 వరకు) జనాభా ప్రాతిపాదికన 37.20 శాతం మందికి ముద్ర రుణాలు మంజూరు చేయాలంటే , కేంద్ర ప్రభుత్వం ఇప్పటికిప్పుడు మన రాష్ట్రంలో అదనంగా 65.51 లక్షల మందికి అదనంగా ముద్ర రుణాలు మంజూరు చేయాలి. ఈ క్రమంలో రాష్ట్రంలో పనిచేస్తున్న బ్యాంకులకు అదనపు టార్గెట్ ఇవ్వాల్సి ఉంటుంది.
ముద్ర రుణాల పంపిణీలో అన్యాయం
కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపాదికన కాకుండా, రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడకుండా గత కొన్ని సంవత్సరాలుగా వివిధ రాష్ట్రాలకు ముద్ర రుణాల మంజూరులో జరిగిన అన్యాయాన్ని సరిచేసే ప్రయత్నం చేయడంలేదు. ఇష్టారీతిన వివిధ రాష్ట్రాలలో పనిచేస్తున్న బ్యాంకులకు ముద్ర రుణాల మంజూరునకు టార్గెట్ ఇస్తోంది. ఫిబ్రవరి 28, 2025 వరకు జనాభా ప్రాతిపాదికన జాతీయ సగటుకు సమానం చేయడానికి తెలంగాణ రాష్ట్రానికి అదనంగా 65.51 లక్షల మందికి ముద్ర రుణాలు మంజూరు చేయాల్సి ఉంటుంది.
హైకోర్టు ఉత్తర్వులు
31–03–2023 వరకు జనాభా ప్రాతిపాదికన జాతీయ సగటు 29.67% మందికి ముద్ర రుణాలు మంజూరుకు సమానంగా తెలంగాణ రాష్ట్రంలో బ్యాంకులకు 54.00 లక్షల ముద్ర రుణాల అదనపు టార్గెట్ ఇవ్వాలని నేను రాష్ట్ర హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వాజ్యం (Writ Petition (PIL) (SR) No. 14748 of 2023) వేయడం జరిగింది. ముద్ర రుణాలు అవసరం ఉన్నవారికి బ్యాంకులు మంజూరు చేయకపోతే వారు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసుకోవాలని పిల్లో హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది.
తెలంగాణకు న్యాయం చేయాలి
దేశవ్యాప్తంగా ఇప్పటికే 52.07 కోట్ల మందికి పైగా ముద్ర రుణాలను మంజూరు చేయడం జరిగింది. అనగా దేశ జనాభాలో ప్రతి ముగ్గురిలో ఒకరికి ముద్ర రుణాలు మంజూరు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఎప్పుడైనా ఉపసంహరించుకొనే అవకాశం ఉన్నది. ఈ పరిస్థితిలో లక్షలాది తెలంగాణ పేద ప్రజలు స్వయం ఉపాధి కల్పించుకొని సమాజంలో గౌరవంగా బతికే అవకాశాన్ని కోల్పోతారు. న్యాయంగా జనాభా ప్రాతిపదికన మన రాష్ట్రంలో 65.51 లక్షల పేద ప్రజలకు అదనంగా ముద్ర రుణాలు మంజూరు చేస్తే ప్రతి జిల్లాకు ఒక లక్ష మందికి పైగా ముద్ర రుణాలు పొందే అవకాశం ఉన్నది.
ముద్ర రుణాల మంజూరులో తెలంగాణ రాష్ట్రానికి, రాష్ట్రంలోని పేద ప్రజలకు జరిగిన అన్యాయాన్ని సరిచేయవలసిందిగా కోరుతున్నాం. ముద్ర రుణాల మంజూరులో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే బాధ్యత తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్నికోరుతున్నాం.
కేంద్రంపై ఒత్తిడి తేవాలి
ముద్ర రుణాల మంజూరులో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు చేస్తున్న తీవ్రమైన అన్యాయాన్ని గ్రామగ్రామాన చర్చించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. ముద్ర రుణాల మంజూరులో తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరి చేయాలని పదుల సంఖ్యలో కేంద్ర ప్రభుత్వానికి 2018 సంవత్సరం నుంచి విజ్ఞప్తులు చేసినప్పటికీ కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిచేసే ప్రయత్నం చేయలేదు. ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలోని అర్హులైన లక్షలాది పేద ప్రజలు గత 10 సంవత్సరాల కాలంలో ప్రైవేట్ అప్పులపై అధిక వడ్డీ చెల్లిస్తూ తీవ్రంగా నష్టపోతున్నారు.
- పాకాల శ్రీహరిరావు,
రాష్ట్ర అధ్యక్షుడు,
తెలంగాణ రైతురక్షణ సమితి