
- లెక్కలు వేసుకుంటున్న కాంగ్రెస్ రాష్ట్ర నేతలు
- ఎవరి కుటుంబానికి రెండో టికెట్ వస్తుందని ఆరా
- ఉత్తమ్ దంపతులు, కోమటిరెడ్డి, మల్లు బ్రదర్స్‌కు నో డౌట్
- జానారెడ్డి సేఫ్ జోన్.. అంజన్, అనిల్ కు ఢోకా లేదు
- డౌట్లో జగ్గారెడ్డి, కొండా, బలరాం, సీతక్క కుటుంబాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర కాంగ్రెస్‌లో ‘ఉదయ్‌పూర్ డిక్లరేషన్’ హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ‘ఒక కుటుంబం ఒకే టికెట్’ అంశంపై చర్చ జరుగుతున్నది. కొడుకులు, కూతుళ్లు, కుటుంబసభ్యులను వచ్చే ఎన్నికల్లో బరిలో దింపాలనుకుంటున్న నేతలు ఎవరికి వారు తామెంత సేఫ్ అన్నది లెక్కలేసుకుంటున్నారు. రెండో టికెట్ ఆశిస్తున్న వాళ్లలో కొందరు ‘పార్టీలో ఐదేండ్ల పాటు క్రియాశీలంగా పని చేసి ఉండాలి’ అనే మినహాయింపు వల్ల రిలాక్స్ అయ్యారు.
మరికొందరు ‘క్రియాశీలం’ అనే దానికి కొలబద్దత ఏమిటని ఆరా తీస్తున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లోకి జంప్ చేయాలని ఆలోచన ఉన్న వాళ్లు ఈ నిబంధన తమకు అడ్డంకిగా మారుతుందా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో నిజంగానే దీన్ని అమలు చేస్తారా? లేదా గతంలో చేసినట్లు మినహాయింపులు ఉంటాయా అని చర్చించుకుంటున్నారు.
వీళ్లకు నో డౌట్!
- ఉదయ్‌పూర్‌లోని ‘చింతన్ శిబిర్’లో తీసుకున్న నిర్ణయం గట్టిగానే అమలు చేస్తారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. డజనుకు పైగా నేతలు తమ వారసులను రంగంలోకి దింపాలని చూస్తున్నారు. వీళ్లలో కొందరు ఇప్పటికే పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాలుపంచుకుంటుండగా, మరికొందరు ఈ మధ్యనే నియోజక వర్గాల్లోని కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు. ఐదేండ్ల నిబంధనతో తాము సేఫ్ అని ఉత్తమ్‌కుమార్, కోమటిరెడ్డి, మల్లు బ్రదర్స్, జానారెడ్డి, అంజన్ కుమార్లాంటి నేతలు భావిస్తుండగా.. మరికొందరు మాత్రం డౌట్లో ఉన్నారు. అందులో కొండా సురేఖ దంపతులు, జగ్గారెడ్డి, బలరాం నాయక్, సీతక్కలాంటి నేతలున్నారు. వీళ్ల వారసులు నియోజకవర్గంలో పరిమితమైన కార్యకలాపాల్లో మాత్రం పాలుపంచుకున్నారు. క్రియాశీలమైన యాక్టివిటీలో లేనందున అధిష్టానం వీళ్లను పరిగణనలోకి తీసుకుంటుందో లేదో అనే సందేహంతో ఉన్నారు.
- పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్ కుమార్ రెడ్డి, ఆయన భార్య పద్మావతి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్నగర్, కోదాడ నియోజక వర్గాల నుంచి పోటీ చేసి గెలిచారు. 2018 ఎన్నికల్లో మళ్లీ ఇద్దరు అసెంబ్లీకి పోటీ చేసినప్పటికీ ఉత్తమ్ గెలిచారు. పద్మావతి ఓడిపోయారు. తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తమ్ నల్గొండ స్థానానికి పోటీ చేసి గెలిచారు. దాంతో ఖాళీ అయిన ఆయన స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో పద్మావతి పోటీ చేసి ఓడిపోయారు. ఆమె రెండు నియోజక వర్గాల్లో జరిగే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. వీళ్లు తాము సేఫ్ జోన్లో ఉన్నట్లు భావిస్తున్నారు.
- కోమటిరెడ్డి బ్రదర్స్‌లో ఒకరు ఎంపీగా, మరొకరు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భువనగిరి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తుంటే, కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రజాప్రతినిధిగా ఉన్నారు. రాజ్‌గోపాల్ ప్రస్తుతం పార్టీలో కొంత అసంతృప్తిగా ఉన్నప్పటికీ.. ఆయన తన భార్య లక్ష్మిని చట్టసభకు పంపాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. అసెంబ్లీకి పోటీ చేసే సమయంలో ఎమ్మెల్సీగా ఉన్న రాజ్‌గోపాల్‌రెడ్డి తన స్థానం ఖాళీ కావడంతో భార్య లక్ష్మితోనే పోటీ చేయించి ఓటమి పాలయ్యారు. అయితే కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీలో క్రియాశీలంగా ఉన్నప్పటికీ రాజ్‌గోపాల్ భార్య కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు కనిపించడం లేదు. అంతేకాక ఒకే కుటుంబానికి మూడో టికెట్దక్కే సీన్ లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి.
- కాంగ్రెస్‌లో సీనియర్ నేత జానారెడ్డి చాలా కాలంగా తన కుమారుడు రఘువీరా రెడ్డిని రాజకీయ రంగ ప్రవేశం చేయించాలని భావిస్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లో తాను నాగార్జునసాగర్ నుంచి పోటీ చేయాలని, కుమారుడ్ని మిర్యాలగూడ నుంచి పోటీ చేయించాలనుకున్నారు. అయితే అప్పుడు ‘ఒక కుటుంబం ఒక టికెట్’ నిబంధన ప్రచారంలోకి తెచ్చి ఆయన ఆశలను ఫలించనీయలేదు. కాగా నాగార్జునసాగర్ నుంచి పోటీ చేసి జానారెడ్డి ఓడిపోయారు. అక్కడి నుంచి గెలిచిన నోముల నర్సింహయ్య అకాల మరణంతో ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఉప ఎన్నికలో జానారెడ్డి పోటీ చేసేందుకు అంత ఆసక్తి చూపలేదు. తన కుమారుడ్ని బరిలోకి దింపాలనుకున్నారు. కానీ హైకమాండ్ ఆదేశంతో ఆయనే పోటీ చేశారు. కానీ, ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే ఈ దఫా కుమారుడితో పోటీ చేయించాలనే పట్టుదలతో జానారెడ్డి ఉన్నారు. నాగార్జునసాగర్ ఎన్నికల్లో పోటీకి ఒప్పుకునే ముందు ఆయన హైకమాండ్‌కు ఇదే కండీషన్ పెట్టినట్లు అప్పట్లోనే చర్చ జరిగింది. రఘువీరారెడ్డి నియోజక వర్గంలోని సమావేశాలు, ఇతర కార్యకలాపాల్లో పాలు పంచుకుంటూ వస్తున్నారు.
- కాంగ్రెస్ కార్యక్రమాల్లో మల్లు బ్రదర్స్చురుగ్గా పాల్గొంటున్నారు. మల్లు రవి పీసీసీ సీనియర్ఉపాధ్యక్షుడిగా, మల్లు భట్టి విక్రమార్క సీఎల్పీ నేతగా ఉన్నారు. దీంతో తమకు ఢోకా లేదని వారు భావిస్తున్నారు. కాగా, భట్టి తన భార్య నందినిని ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపాలనుకుంటున్నారనే ప్రచారం చాలా కాలంగా సాగుతున్నది.
- పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, ఆయన కుమారుడు, యూత్ కాంగ్రెస్ నేత అనిల్ కుమార్ యాదవ్ పార్లమెంట్‌కు ఒకరు, అసెంబ్లీకి ఒకరు పోటీ చేయాలనుకుంటున్నారు. గత ఎన్నికల్లో అనిల్ ముషీరాబాద్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వీరిద్దరు పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్న వారే.
వీళ్లకు డౌటే!
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈ సారి తన కూతురు విజయారెడ్డి లేదా భార్య నిర్మలను ఎన్నికల బరిలో దింపాలనే బలమైన కోరికతో ఉన్నారు. తాను సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, వీళ్లలో ఒకరిని మెదక్ లోక్‌సభ నియోజకవర్గానికి పోటీ చేయించాలని ఆయన భావిస్తున్నారు. అయితే వీళ్లిద్దరూ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతల మంచి చెడు చూసుకోవడం మినహా వాళ్లకు వాళ్లు కార్యక్రమాలు చేసిన దాఖలాలు లేవు. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు కొండా దంపతులు 2 టికెట్లు ఆశిస్తున్న జాబితాలో ఉన్నారు. గత ఎన్నికల్లోనే వీరు టికెట్ఆశించి నిరాశకు గురయ్యారు. కొండా సురేఖ, ఆమె కూతురు సుష్మితా పటేల్ పరకాల, తూర్పు వరంగల్ అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి పోటీ చేయాలని ఆశిస్తున్నారు. ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్న సీతక్క తన కొడుకు సూర్యను ఖమ్మం జిల్లా పినపాక నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ తాను మహబూబాబాద్ ఎంపీగా, తన కొడుకు సాయిశంకర్‌ను అదేస్థానం నుంచి అసెంబ్లీకి పోటీ చేయించాలనే ఆశ పెట్టుకున్నారు. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహా తన భార్య పద్మినిని పార్లమెంట్‌కు పోటీ చేయించాలని ఆశిస్తున్నట్లు గతంలో ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఆ విషయం అంతగా ప్రచారంలో లేదు. ఎల్బీ నగర్, ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేయాలని మల్రెడ్డి రంగారెడ్డి, రాంరెడ్డి సోదరులు భావిస్తున్నారు. మండలి మాజీ చైర్మన్ షబ్బీర్ అలీ కూడా తన వారసులను రంగంలోకి దింపే ప్రయత్నంలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. అయితే.. జంట టికెట్లు ఆశిస్తున్న చాలా మంది నేతలు తమ వారసులను తమ వెంట పార్టీ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు. కానీ, వాళ్లు నియోజకవర్గాల్లో చురుగ్గా ఉండట్లేదు. దీంతో వాళ్లకు టికెట్లు లభిస్తాయా లేదా అన్నది అనుమానం.