ఏకమవుతున్న అసంతృప్త నేతలు..అధికార పార్టీ ఎమ్మెల్యేకు చెక్ పెట్టేందుకు ప్లాన్

ఏకమవుతున్న అసంతృప్త నేతలు..అధికార పార్టీ ఎమ్మెల్యేకు చెక్  పెట్టేందుకు ప్లాన్

గద్వాల, వెలుగు:  గద్వాల బీఆర్ఎస్ లో ముసలం ముదురుతోంది. సిట్టింగ్  ఎమ్మెల్యేకు చెక్  పెట్టి తమ క్యాండిడేట్ ను గెలిపించుకునేందుకు బీఆర్ఎస్ అసంతృప్త నేతలు ఏకమవుతున్నారు. ఎమ్మెల్యే బంధువు ఒకరు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ లో మంచి హోదాలో ఉన్న ఇద్దరు నేతలను వేరే పార్టీలోకి తీసుకెళ్లి ఎమ్మెల్యే టికెట్  ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తుండడం హాట్​టాపిక్​గా మారింది. కొంతకాలంగా అసంతృప్త నేతలంతా బీఆర్ఎస్  పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. అదను చూసి దెబ్బ కొట్టేందుకు భారీ ప్లాన్ తో ముందుకెళ్తున్నారు..

కీలకపాత్ర పోషిస్తున్న ఎమ్మెల్యే బంధువు..

బీఆర్ఎస్ లో వర్గ విభేదాలు కొంతకాలంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వారంతా ఒకే తాటిపైకి వచ్చి ఓ పార్టీ వైపు అడుగులు వేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎమ్మెల్యేకి దగ్గరి బంధువులు హ్యాండిచ్చే పరిస్థితి కనిపిస్తోంది. బంధువుల్లో కొందరు అసంతృప్త నేతలందరినీ ఏక తాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా స్థాయి పదవిలో ఉన్న ఒకరు బీఆర్ఎస్  టికెట్  కోసం చివరి వరకు పోటీలో ఉండాలని, టికెట్  రాకపోతే వేరే పార్టీలో జాయిన్  అయ్యేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే పట్టణానికి చెందిన ముఖ్యమైన నేత కూడా అసంతృప్త నేతలతో చేతులు కలుపుతున్నట్లు తెలుస్తోంది.

 గట్టు మండలానికి చెందిన ఒక ప్రజా ప్రతినిధి వీరికి సపోర్ట్  చేస్తున్నారు. కాంగ్రెస్  టికెట్  కోసం ఇప్పటికే ప్రయత్నాలు చేసిన ఆయన, అభ్యర్థిత్వానికి ఓకే చెబితే జంప్​ అయ్యేందుకు రెడీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్  పదవిలో ఉన్న ఒక లీడర్ కు కూడా ఎమ్మెల్యేతో పడడం లేదు. ఇటీవల సీఎం పర్యటనలో ఈ విషయం బహిరంగంగా తెలిసిపోయింది. ఫ్లెక్సీలలో ఎక్కడ కూడా ఆయన ఫొటో పెట్టకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆయన కూడా అసంతృప్త నేతలకు సపోర్ట్​ చేస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉద్యమ సమయం నుంచి పార్టీలో ఉన్నా తగిన గుర్తింపు రాలేదని బీసీ వర్గానికి చెందిన ఒక లీడర్  కూడా అసంతృప్తితో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పని చేస్తున్నారు. వీరంతా ఇప్పుడు ఏకమయ్యే పరిస్థితి ఉందని అంటున్నారు. 

కాంగ్రెస్  టికెట్  కోసం..

గద్వాల నియోజకవర్గంలో ప్రస్తుతం డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి అన్నీ తానే పార్టీని ముందుకు నడుపుతున్నాడు. వచ్చే ఎన్నికల్లో గద్వాల నుంచి పోటీ చేసేందుకు టికెట్  కోసం ప్రయత్నం చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్  అసంతృప్తులు, ఇతర పార్టీ లీడర్లు కూడా కాంగ్రెస్  టికెట్  ఆశిస్తున్నారు. ఇప్పటికే ఒక బీసీ నేత టికెట్  కోసం ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎమ్మెల్యే బంధువు అసంతృప్తితో ఉన్న బీఆర్ఎస్​ లీడర్లను పార్టీలోకి తీసుకొస్తానని, తమకే టికెట్ ఇవ్వాలని ప్రతిపాదించినట్లు ప్రచారం జరుగుతోంది. ఏఐసీసీ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కూడా అసంతృప్తులతో రహస్యంగా భేటీ అయినట్లు టాక్  వినిపిస్తోంది. బీఆర్ఎస్ లో ఓ వర్గం కాంగ్రెస్ లో చేరడంపై దృష్టి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.

సీఎం నోరు విప్పకపోవడం వల్లే..

ఈ నెల 12న సీఎం కేసీఆర్  గద్వాలలో జరిగిన బహిరంగ సభలో సిట్టింగ్  ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని మరోసారి ఆశీర్వదించాలని చెప్పి ఉంటే ఈపాటికే బీఆర్ఎస్ లో లుకలుకలు బయట పడేవనే టాక్  వినిపిస్తోంది. పార్టీలో వర్గ విభేదాల కారణంగానే కేసీఆర్  టికెట్​ విషయం ప్రస్తావించలేదని పార్టీలోనే చర్చ సాగుతోంది. డెవలప్​మెంట్  గురించి ఎక్కువగా మాట్లాడకపోవడం, ఉద్యమ సమయం నాటి పరిస్థితులను, అప్పట్లో తేరు మైదానంలో పెట్టిన మీటింగ్  గురించి ప్రస్తావించడం వంటి విషయాలు చూస్తుంటే ఈసారి ఉద్యమకారులకు లేదంటే ఇతరులకు టికెట్  కేటాయిస్తారని చెప్పుకుంటున్నారు.