కిలో కంది పప్పు రూ.200.. కెనడాతో వివాదమే కారణమా..?

కిలో కంది పప్పు రూ.200.. కెనడాతో వివాదమే కారణమా..?

ధరల మంట మామూలుగా లేదు. ఒకటి తగ్గితే.. మరొకటి పెరుగుతుంది. మొన్నటికి మొన్న టమాటా ఠారెత్తించింది. ఇప్పుడు కందిపప్పు వంతు. కిలో కంది పప్పు రిటైల్ మార్కెట్ లో 200 రూపాయలకు చేరింది. నెల క్రితం వరకు 140 రూపాయలుగా ఉన్న కిలో కిందిపప్పు.. 15 రోజుల్లోనే కిలోకు 60 రూపాయలు పెరగటం సామాన్యులను ఆందోళనకు గురి చేస్తుంది. 

కంది పప్పు దిగుమతుల్లో కెనడా, ఆఫ్రికా దేశాలే ప్రధానం. ప్రస్తుతం కెనడా దేశంతో భారత్ ఉన్న దౌత్యపరమైన విబేధాల కారణంగా.. భారతీయ మార్కెట్ లో కందిపప్పు ధరను అమాంతం పెంచేశారు హోల్ సేల్ వ్యాపారులు. ఇప్పటికే వీసాలపై ఆంక్షలు విధించింది భారత్. ఈ క్రమంలోనే.. రాబోయే రోజుల్లో మరిన్ని ఆంక్షలు ఉంటాయనే భయాందోళనలతో.. కెనడా దేశం నుంచి దిగుమతి చేసుకునే ఆహార, పప్పు ధాన్యాల ధరలకు రెక్కలొచ్చాయి. ముఖ్యంగా కందిపప్పు దిగుమతులపై ఎక్కువగా ప్రభావం పడే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం భారత మార్కెట్లో కందిపప్పు ధర రూ. 200 పలుకుతోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి 8 లక్షల టన్నుల కందిపప్పు దిగుమతి కాగా… అందులో 4.85 లక్షల టన్నులు కెనడా దేశం నుంచే దిగుమతి అయింది. ఈ ఏడాది జూన్ వరకు  3 లక్షల టన్నుల కందిపప్పు దేశంలోకి దిగుమతి అయింది. అందులో కెనడా నుంచి 2 లక్షల టన్నులకు పైగా పప్పు వచ్చింది.

ఈ ఏడాది పప్పు దిగుమతుల విషయంలో కెనడా నుంచి ఎక్కువగా కందిపప్పు ఎక్కువగా వచ్చిందని అగ్రి కమోడిటీ రీసెర్చ్ సంస్థ రాహుల్ చౌహాన్ స్పష్టం చేశారు. దౌత్యపరమైన విబేధాలతో దిగుమతులకు ఎలాంటి ఇబ్బంది లేదని.. వ్యాపారులు ధరలు పెంచొద్దని కోరుతున్నారాయన. 

2023 ఏప్రిల్-జూన్ కాలంలో కెనడా నుండి భారతదేశం సుమారు 0.95 లక్షల టన్నుల పప్పు, ఇతర కాయ ధాన్యాలను దిగుమతి చేసుకుంది. ప్రస్తుతం భారత్‌, కెనడా దేశాల మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఇబ్బందులు కందిపప్పు దిగుమతిపై ప్రభావం చూపిందని వ్యాపారులు చెబుతున్నారు. దీని వల్లే ధరలు పెరిగాయని చెబుతున్నారు. ఇప్పటి వరకు భారత్, కెనడాల మధ్య జరుగుతున్న వివాదంతో అక్కడ నివసించే భారతీయులే ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు కందిపప్పు దిగుమతిపై ఆ ప్రభావం చూపడంతో.. అది సామాన్యులపై పడనుంది. ఏది ఏమైనప్పటికి కందిపప్పు ధర రోజు రోజుకు పెరగడం అనేది సామాన్య ప్రజలను కన్నీరు పెట్టిస్తుంది. టమాటా విషయంలో ఎలాగైతే సబ్సిడీ ఇచ్చి ఆదుకున్నారో..కందిపప్పు విషయంలో కూడా అలాగే చేయాలని ప్రభుత్వాలను సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు.