టీఆర్​ఎస్​లో గ్రూపుల లొల్లి

టీఆర్​ఎస్​లో గ్రూపుల లొల్లి
  • జెండా పండుగనాడు పలు జిల్లాల్లో బయటపడిన విభేదాలు

.
నల్గొండ, వెలుగు: ఒక దిక్కు పార్టీని బలోపేతం చేసేందుకు జెండా పండుగ చేస్తుంటే.. మరో దిక్కు టీఆర్ఎస్ లీడర్ల మధ్య విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. నివురుగప్పిన నిప్పులా ఉన్న గొడవలు జెండా పండుగ సందర్భంగా భగ్గుమన్నాయి. ఈ మధ్యనే పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఇంతలోనే పార్టీ ఎమ్మెల్యేలు, వారి ప్రత్యర్థులు బజారుకెక్కి ..  ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్నారు. వీరి చేష్టల వల్ల పార్టీకి నష్టం కలుగుతుందని కేడర్​ఆందోళన చెందుతోంది. 
ఏకపక్ష నిర్ణయాలపై నిరసనలు
విభేదాలను పక్కనపెట్టి సంస్థాగత ఎన్నికల్లో అందరినీ కలుపుకొనిపోవాలని టీఆర్ఎస్​ బాస్​లు ఆదేశిస్తే..  ఎమ్మెల్యేలు మాత్రం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు.. అక్కడ ఉన్న ఇతర ముఖ్య నేతలకు మధ్య సయోధ్య లేదు. సొంత బలగం ఉంటే ఆ నేతలను ఎమ్మెల్యేలు అణిచివేయాలని చూస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. తమ మీద పార్టీ వ్యతిరేకులుగా ముద్రవేసి..  తమ వెంట ఉన్న కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఎమ్మెల్యేల మీద పలువురు లీడర్లు మండిపడుతున్నారు. తమ వర్గానికి పార్టీ సభ్యత్వం కూడా ఇవ్వకుండా అడ్డం పడుతున్నారని, సంస్థాగత ఎన్నికల మీటింగులకు కూడా తమను పిలవడంలేదని, కమిటీల ఏర్పాటు  ఏకపక్షంగానే జరుగుతోందని ఆరోపిస్తున్నారు. గ్రామ, మండల కమిటీలన్నింటినీ ఎమ్మెల్యేల అనుచరులతోనే నింపేస్తున్నారని అంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసే దిశగా కమిటీలు ఉండాలని అధిష్టానం చెప్తుంటే, కమిటీల ఏర్పాటు మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటోందని వాపోతున్నారు. ఎమ్మెల్యేల వెంట ఉన్నవారిలో చాలామంది మీద పబ్లిక్​ అసంతృప్తితో ఉన్నారని, వీరే కమిటీల్లో ఉండడం వల్ల ఎన్నికల్లో ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నారు. 
ఎమ్మెల్యేలదే పెత్తనం
చాలా నియోజకవర్గాల్లో రెండు, మూడు గ్రూపులు ఉన్నాయి. ఇక్కడ ఎమ్మెల్యేలతో పడని లీడర్ల పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. నల్గొండ, మహబూబ్​నగర్, ఖమ్మం జిల్లాల్లో ఎమ్మెల్యేలకు, ఇతర లీడర్లకు మధ్య గొడవలు ముదిరి పాకాన పడ్డాయి. నల్గొండ జిల్లా నకిరేకల్​సెగ్మెంట్​లో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం వర్గానికి చెందిన వాళ్లకు పార్టీ సభ్యత్వం కూడా ఇవ్వలేదు. స్వయానా వీరేశానికి కూడా మెంబర్​షిప్​ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో వారు ఆన్​లైన్​లో అప్లై చేసుకున్నారు. నకిరేకల్​లో శుక్రవారం వీరేశం, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అనుచరులు వేర్వేరుగా జెండాలను ఎగరవేశారు. సంస్థాగత ఎన్నికల మీటింగులకు కూడా వీరేశాన్ని పిలవలేదు. భువనగిరిలో ఎలిమినేటి కృష్ణారెడ్డి, సందీప్ రెడ్డి, చింతల వెంకటేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి మధ్య సఖ్యత లేదు. మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్​ అయితే పార్టీ లీడర్లను పట్టించుకున్న పాపాన పోవడంలేదు. ఆలేరులో మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య వర్గానికి కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వడం  లేదు. మునుగోడులో మాజీ ఎమ్మె ల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్​మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. నాగర్​కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్​ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్​రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వేర్వేరుగా జెండాలు ఎగురవేశారు. కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, కోడేరు, పెంట్లవెల్లి మండలాల్లో రెండు శిబిరాల కార్యకర్తలు వేర్వేరుగానే జెండా పండుగ చేశారు. ఇక నాగర్​కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల  దామోదర్ రెడ్డి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ఇరువర్గాల కార్యకర్తలు గల్లీ లెవల్ నుంచే తలపడుతున్నారు. తన వర్గాన్ని టార్గెట్ చేసి అక్రమ కేసులు పెట్టిస్తున్నారని ఎమ్మెల్యే పై ఎమ్మెల్సీ ఫైర్ అవుతున్నారు. ఈ కొట్లాట మంత్రి కేటీఆర్ దగ్గరకు చేరినా పరిష్కారం కాలేదు. మిగతా జిల్లాల్లోనూ రెండు వర్గాలు బలంగా ఉన్నచోట్ల ఎవరి జెండాలు వాళ్లే ఎగరేసుకున్నారు.