
హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యే టికెట్ దక్కక అసంతృప్తితో ఉన్న బీఆర్ఎస్ నేతలు పార్టీని వీడి వెళ్తున్నారు. ఇప్పటికే కొంతమంది రాజీనామా ప్రకటించగా, మరికొంత మంది రిజైన్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు పార్టీ పంపిన దూతలు రంగంలోకి దిగారు. కీలక నేతలు పార్టీని వీడకుండా చర్యలు తీసుకుంటున్నారు. పాలేరు టికెట్ ఇవ్వలేదని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన అనుచరులు మంగళవారమే ఖమ్మంలో సమావేశమై పార్టీని వీడాలంటూ తుమ్మలపై ఒత్తిడి తెచ్చారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న తుమ్మల.. తన అనుచరులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటూ ఏం చేయాలో చెబుతున్నారు. ఈ క్రమంలోనే బుధవారం హైదరాబాద్గచ్చిబౌలిలోని తుమ్మల ఇంటికి ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్రావు, మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు వెళ్లారు. పార్టీ దూతలుగా వెళ్లిన ఈ ఇద్దరు.. బీఆర్ఎస్లోనే కొనసాగాలని తుమ్మలను బుజ్జగించారు. కేసీఆర్ త్వరలోనే సముచిత స్థానం కల్పిస్తారని, తొందరపడి పార్టీని వీడొద్దని విజ్ఞప్తి చేశారు.
అయితే పార్టీలో కొనసాగడంపై తుమ్మల వారికి ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలిసింది. ఇక స్టేషన్‌ఘన్‌పూర్ టికెట్రాకపోవడంతో తన అనుచరుల ముందు బోరున విలపించిన రాజయ్యను బుజ్జగించడానికి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి రంగంలోకి దిగారు. బుధవారం స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొనాలని కోరేందుకు పల్లా హనుమకొండలోని రాజయ్య ఇంటికి వెళ్లారు. అయితే తాను ఇంట్లో లేనని, ర్యాలీలోనూ పాల్గొనలేనని.. ఏమైనా ఉంటే రేపు మాట్లాడుతానని ఫోన్లోనే రాజయ్య బదులిచ్చారు.