కాంగ్రెస్​లో చేరడంలోనూ.. మేయర్​ వర్సెస్​ కార్పొరేటర్లు

కాంగ్రెస్​లో చేరడంలోనూ.. మేయర్​ వర్సెస్​ కార్పొరేటర్లు
  • కాంగ్రెస్​లో చేరాలనుకున్న బీఆర్​ఎస్​ అసమ్మతి కార్పొరేటర్లు
  • వారికంటే ముందే కాంగ్రెస్​ హైకమాండ్​ను కలిసిన మేయర్​ గుండు సుధారాణి 
  • ఆమె  రాకను వ్యతిరేకించిన మెజార్టీ కార్పొరేటర్లు
  • చేరికకు ముందే అసమ్మతి రాగాలు

వరంగల్‍, వెలుగు: గ్రేటర్‍ వరంగల్‍ కార్పొరేషన్‍లో మేయర్‍ గుండు సుధారాణి ,  సిట్టింగ్‍ కార్పొరేటర్ల మధ్య కోల్డ్‍ వార్‍ నడుస్తోంది. ఇన్నాళ్లు వీరంతా బీఆర్‍ఎస్‍ పార్టీలో ఉన్నాగ్రూపు రాజకీయాలతో పార్టీనికలగాపులగం చేశారు.ఆమెతో విభేదిస్తున్నవారంతా రెండ్రోజుల కింద కారు పార్టీని వీడి కాంగ్రెస్‍ చేరేందుకు  సిద్ధమయ్యారు. కానీ,   వారికంటే ముందే సుధారాణి బీఆర్​ఎస్​ ను వీడి  కాంగ్రెస్​లో చేరేందుకు  లైన్‍ క్లియర్‍ చేసుకున్నారు.  దీనిని అసమ్మతి కార్పొరేటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ మారుతున్న క్రమంలోనూ మరోసారి మేయర్‍ వర్సెస్‍ కార్పొరేటర్లు అన్నట్లు వ్యవహారం నడుస్తోంది. 

సుధారాణి రాకతో.. కార్పొరేటర్లు నారాజ్

బీఆర్‍ఎస్‍ పార్టీకి చెందిన గ్రేటర్ వరంగల్‍ ప్రస్తుత మేయర్‍ గుండు సుధారాణిని కాంగ్రెస్‍ పార్టీలోకి తీసుకోవడాన్ని.. పార్టీ మారుదామని భావించిన మెజార్టీ సిట్టింగ్‍ కార్పొరేటర్లు వ్యతిరేకించారు. ఆదివారం సాయంత్రమే పొంగులేటి శ్రీనివాస్‍రెడ్డి, తన కుమారునితో కలిసి మేయర్​  సీఎం రేవంత్‍రెడ్డిని కలవడాన్ని జీర్ణించుకోలేకపోయారు. అప్పటివరకు బీఆర్‍ఎస్‍ను వీడుదామనుకున్న కార్పొరేటర్లంతా సోమవారం ఉదయమే సమావేశమై సుధారాణి ఇష్యూపై చర్చించారు. బీఆర్‍ఎస్‍లో ఆమె వ్యవహారశైలీ నచ్చకనే తాము హస్తం పార్టీలోకి వచ్చేందుకు నిర్ణయం తీసుకుంటే.. మళ్లీ తనను పార్టీలోకి తీసుకోవడం సరికాదన్నారు. ఇదే అంశంపై గ్రేటర్‍ ఎమ్మెల్యేల ముందు వాపోయారు. ఈ క్రమంలో అప్పటివరకు పార్టీ మారే ఆలోచనతో ఉన్న ఇద్దరు, ముగ్గురు కార్పొరేటర్లు తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలిసింది. 

గ్రేటర్‍ ఎమ్మెల్యేలకు.. నయా హెడేక్‍ 

గ్రేటర్‍ వరంగల్లో 66 మంది కార్పొరేటర్లు ఉండగా మొన్నటివరకు అందులో 51 మంది బీఆర్‍ఎస్‍కు చెందినవారే ఉన్నారు. మేయర్‍ గుండు సుధారాణి సైతం అదే పార్టీలో ఉన్నారు. ఈ క్రమంలో ఎప్పటినుంచో సొంత పార్టీలోనే కొందరు వరంగల్‍ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‍, ఇంకొందరు సుధారాణి గ్రూపులుగా విడిపోయారు. రానూరాను  సుధారాణికి కార్పొరేటర్ల నుంచి వ్యతిరేకత పెరిగింది. ఈ క్రమంలో రాష్ట్రంలో కాంగ్రెస్‍ ప్రభుత్వం రావడంతో సుధారాణి తన పీఠం కాపాడుకునేందుకు హస్తం పార్టీలోకి వెళ్లే ప్రయత్నం చేయగా గ్రేటర్‍ ఎమ్మెల్యేలు ఆమె రాకను వారించారు.

 వారం కింద దాదాపు 30 మంది కార్పొరేటర్లు మేయర్‍ లేకుండా సపరేట్‍ మీటింగ్‍ పెట్టుకున్నారు. సుధారాణి వ్యవహారశైలిపై మండిపడ్డారు. ఆమెతో విభేదించే వారంతా కాంగ్రెస్‍ కండువా కప్పుకోవాలని భావించారు. దీనికి గ్రేటర్ ఎమ్మెల్యేలు ఓకే చెప్పారు. సోమవారం దాదాపు 15 మంది సిట్టింగ్‍ కార్పొరేటర్లు సీఎం రేవంత్‍రెడ్డి, పార్టీ పెద్దల సమక్షంలో చేరేలా ప్లాన్‍ చేశారు. తీరా..సుధారాణి పాత టీడీపీ పరిచయాలతో హైదరాబాద్‍ స్థాయిలో పెద్దలను కలిసి తాను సైతం హస్తం పార్టీలోకి వచ్చేలా అడుగులు వేయడంతో.. గ్రేటర్‍ ఎమ్మెల్యేలు తలలు పట్టుకున్నారు. 

సుధారాణి పార్టీలోకి రావట్లేదనే చెబితేనే..తాము కాంగ్రెస్‍ చేరేందుకు సుముఖత వ్యక్తం చేశామని..తీరా తమకంటే ముందే సుధారాణి పార్టీలో రెడ్‍ కార్పెట్ వేసుకోవడమేంటని మెజార్టీ కార్పొరేటర్లు ఎమ్మెల్యేల ముందు వాపోవడంతో వానికి నయా హెడెక్‍ అయింది. ఆమె చేరిక హైకమాండ్‍ నిర్ణయమని చెబుతూనే.. ఈ ఇష్యూ ఎటునుంచి ఎటువెళ్తుందోనని ఆందోళన చెందుతున్నారు