అక్రమ మైనింగ్ పై కొరడా .. మంత్రి ఆదేశాలతో లక్డారంలో తనిఖీలు

అక్రమ మైనింగ్ పై కొరడా ..  మంత్రి ఆదేశాలతో లక్డారంలో తనిఖీలు

సంగారెడ్డి, వెలుగు: అక్రమంగా కొనసాగుతున్న  మైనింగ్ మాఫియాపై జిల్లా యంత్రాంగం ఫోకస్ పెట్టింది. రెవెన్యూ, మైనింగ్, పోలీస్, ఇరిగేషన్, పొల్యూషన్, సర్వే ల్యాండ్ రికార్డ్ శాఖల సమన్వయంతో కలెక్టర్ వల్లూరు క్రాంతి పర్యవేక్షణలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. శనివారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ఆదేశాల మేరకు పటాన్ చెరు నియోజకవర్గంలోని లక్డారం గ్రామంలో తనిఖీలు చేపట్టారు. సంగారెడ్డి ఆర్డీఓ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో పటాన్ చెరు డీఎస్పీ పురుషోత్తంరెడ్డితో కలిసి సంబంధిత శాఖల అధికారులు మైనింగ్ నిర్వహణ స్థలాలపై దాడులు నిర్వహించారు.

పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి సర్వే నం738లో సంతోష్ సాండ్ మైనింగ్ అక్రమంగా కొనసాగుతున్నట్టు ఆర్డిఓ రవీందర్ రెడ్డి వెల్లడించారు. ఇలాంటి క్రషర్లు ఇక్కడ చాలా కొనసాగుతున్నాయని తనిఖీల్లో ఎన్నో అక్రమాలు బయట పడ్డట్లు పేర్కొన్నారు. అక్రమ మైనింగ్ లపై పది రోజుల్లో కలెక్టర్ కు నివేదిక అందజేస్తామన్నారు. 4.23 హెక్టార్లలో నడవాల్సిన మైనింగ్ 15 ఎకరాల వరకు ఎలాంటి రక్షణ చర్యలు పాటించకుండా నడుపుతున్నట్లు తెలిపారు.