
- జిల్లాకు ఇద్దరు పరిశీలకుల నియామకం
- ఇయ్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ మీటింగ్
మెదక్, వెలుగు: అధికార కాంగ్రెస్ సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడంపై దృష్టిపెట్టింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఆదేశాల మేరకు గ్రామ, మండల, బ్లాక్, జిల్లా కమిటీలకు కొత్త కార్యవర్గాల నియామకానికి కసరత్తు మొదలుపెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలోపెట్టుకొని చిత్తశుద్ధితో కోసం పనిచేసే వారికి పార్టీ పదవుల్లో అవకాశం కల్పించనున్నట్టు సమాచారం. ముఖ్యంగా 2017 నుంచి పార్టీలో ఉన్న వారికే ఆయా పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. ముందుగా జిల్లా పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసి సంస్థాగత ఎన్నికల విధి విధానాలను పార్టీ శ్రేణులకు వివరిస్తారు. జిల్లాలో 493 గ్రామాలు, 21 మండలాలు, 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 బ్లాక్ లు ఉన్నాయి.
వీటన్నింటికి కొత్త అధ్యక్షులను ఎన్నుకుంటారు. ఆ తర్వాత మే 4 నుంచి 19 వరకు అసెంబ్లీ, బ్లాక్ లెవల్, 13 నుంచి 20 వరకు మండల స్థాయి మీటింగ్ లు జరుగుతాయి. గ్రామ స్థాయి అధ్యక్షుల నియామకం అనంతరం మండల పార్టీ అధ్యక్ష పదవికి ఐదుగురి పేర్లు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ముగ్గురి పేర్లతో టీపీసీసీకి ప్రపోజల్ పంపుతారు. ఆయా పదవులు ఎవరికి ఇవ్వాలనేది అక్కడే నిర్ణయిస్తారు. గ్రామ, మండల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుల నియామక ప్రక్రియ పూర్తయ్యాక జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుల నియామక ప్రక్రియ చేపడతారు.
పరిశీలకులు వీరే..
జిల్లా కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల పరిశీలకులుగా తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఉట్లా వరప్రసాద్ ను నియమిస్తూ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ, మండల, బ్లాక్, డీసీసీ ఎన్నికల ప్రక్రియను వీరు పరిశీలించనున్నారు. జిల్లాలో కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా, నాయకులు, కార్యకర్తల ఏకాభిప్రాయంతో అధ్యక్షుల ఎంపిక జరిగేలా చూస్తామని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ తెలిపారు.