ఆదిలాబాద్‌టౌన్, వెలుగు: సైబర్ క్రైమ్ బాధితులకు మెరుగైన సేవలు అందించేందుకు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతీ పోలీస్ స్టేషన్‌లో ఒక సైబర్ వారియర్‌ను నియమించినట్లు జిల్లా ఎస్పీ గౌష్ ఆలం అన్నారు. ఈ సందర్భంగా గురువారం సైబర్ వారియర్స్ కి ప్రత్యేకంగా ఒక సెల్ ఫోన్, సిమ్ కార్డ్ ను అందజేశారు. ప్రజలు సైబర్ నేరం జరిగిన వెంటనే 1930 ఫోన్ నెంబర్‌కు, ఎన్సీఆర్జీ పోర్టల్లో గాని, దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని సూచించారు.
సైబర్ నేరం ద్వారా మోసపోయిన డబ్బును త్వరగా ఇప్పించే విధంగా నూతన పద్ధతిపై సైబర్ వారియర్స్ కు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఇది వరకే సైబర్ నేరగాళ్ల ద్వారా మోసపోయిన వ్యక్తులు ఎవరన్నా ఉంటే వారి డబ్బు బ్యాంకులో ఫ్రీజ్ అయి ఉన్నట్లయితే సైబర్ వారియర్స్ వారికి సహకరించి వీలైనంత త్వరగా డబ్బులు తిరిగి వచ్చే విధంగా కృషి చేస్తారని పేర్కొన్నారు. అడిషనల్ ఎస్పీ బి.సురేందర్రావు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ పి.ప్రసాద్, సైబర్ సెల్ ఇన్‌చార్జ్ సింగజ్ వార్ సంజీవ్ కుమార్, ఎంఏ.రియాజ్, జిల్లా సైబర్ సెల్ వారియర్స్ పాల్గొన్నారు.