
స్విచాఫ్ ప్రచారాన్ని ప్రారంభించిన వివో
ముంబై: అతిగా ఫోన్లను ఉపయోగించడం వల్ల మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయని ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ వివో స్టడీ తేల్చింది. దీంతో ఈ కంపెనీ ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో నేరుగా మాట్లాడేందుకు సమయం కేటాయించాలంటూ ‘స్విచాఫ్’ పేరుతో ప్రత్యేక ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఇందుకోసం తన బ్రాండ్ అంబాసిడర్ అమీర్ ఖాన్‌ను రంగంలోకి దింపింది. ఆయన నటించిన వీడియోనూ విడుదల చేసింది. స్మార్ట్‌ఫోన్లను స్విచాఫ్ చేసి,కుటుంబ సభ్యులతో, స్నేహితులతో తగినంత సమయం గడపాలని సూచించడానికే ఈ ప్రయత్నమని వివో తెలిపింది. సీఎంఆర్‌తో కలిసి వివో.. స్మార్ట్‌ఫోన్ల వాడకంపై సర్వే నిర్వహించింది. ఇందులో పాల్గొన్న వారిలో 75 శాతం మంది తమ టీనేజ్‌లో స్మార్ట్ ఫోన్‌ను కొన్నామని చెప్పారు. మరికొందరు డిగ్రీ చదివేటప్పుడు కొన్నామని చెప్పారు. స్మార్ట్‌ఫోన్ తమకు వ్యసనమని అత్యధికులు అంగీకరించారు.