దివీస్ ​ల్యాబ్స్​ లాభం రూ.348 కోట్లు.. వార్షికంగా 29 శాతం తగ్గుదల

దివీస్ ​ల్యాబ్స్​ లాభం రూ.348 కోట్లు.. వార్షికంగా 29 శాతం తగ్గుదల

న్యూఢిల్లీ :  హైదరాబాద్​కు చెందిన ఫార్మా కంపెనీ దివీస్ ల్యాబ్స్  సెప్టెంబరు 2023తో ముగిసిన రెండో క్వార్టర్​లో రూ.348 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్​) సంపాదించింది. ఏడాది క్రితం రెండో క్వార్టర్​లో వచ్చిన లాభం రూ. 493 కోట్లతో పోలిస్తే ఇది 29 శాతం తగ్గింది. ఎనలిస్టులు ఈసారి దివీస్​కు  రూ.424 కోట్ల లాభం వస్తుందని అంచనా వేశారు.    కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం వార్షికంగా 3శాతం పెరిగి రూ.1,909 కోట్లకు చేరుకుంది. అంతకు ముందు సంవత్సరం ఇదే క్వార్టర్​లో ఆదాయం రూ.1,855 కోట్లు ఉంది. ఈ క్వార్టర్​లో కన్సాలిడేటెడ్​ ఇబిటా రూ. 479 కోట్లు కాగా, మార్జిన్లు 25.1శాతం వద్ద ఉన్నాయి.

పన్నుకు ముందు లాభం (పీబీటీ) రూ. 469 కోట్లు ఉండగా, గత సంవత్సరం ఇదే క్వార్టర్​లో వచ్చిన రూ. 615 కోట్ల పీబీటీతో పోలిస్తే 24శాతం తగ్గింది. మొత్తం ఆదాయం కూడా 3శాతం పెరిగి రూ. 1,995 కోట్లకు చేరుకుంది. గత సంవత్సరం సెప్టెంబరు -క్వార్టర్​లో రూ. 1,935 కోట్లుగా ఉంది. కంపెనీ గత ఏడాది ఇదే క్వార్టర్​లో రూ. 31 కోట్ల ఫారెక్స్​ లాభం పొందగా, ఈసారి రూ. 11 కోట్ల ఫారెక్స్ లాభాన్ని సాధించింది. సెప్టెంబరు 2023తో ముగిసిన అర్ధ సంవత్సరంలో కంపెనీ  మొత్తం ఆదాయం (కన్సాలిడేటెడ్​) రూ. 3,854 కోట్లకు చేరింది. గత అర్ధ సంవత్సరంలో రూ. 4,278 కోట్ల ఆదాయం వచ్చింది.