
- హయ్యస్ట్ పెయిడ్ ఎగ్జిక్యూటివ్‌గా మురళి
- రూ.58.8 కోట్లు చెల్లింపు
హైదరాబాద్, వెలుగు : ఇండియన్ ఫార్మా ఇండస్ట్రీలో ఎవరికి ఎక్కువ శాలరీ ఉంటుందో తెలుసా ? హైదరాబాద్‌కు చెందిన దివీస్ ల్యాబోరేటరీస్ ఎండీ, ఛైర్మన్ మురళి కే దివీకే ఇండియన్ ఫార్మా ఇండస్ట్రీలో అత్యధిక వేతనం ఉందట. రూ.58.8 కోట్ల వేతనంతో మురళి హయ్యస్ట్ పెయిడ్ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్నట్టు ఇటీవల కంపెనీ విడుదల చేసిన 2018–19 వార్షిక రిపోర్ట్‌లో వెల్లడైంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. ఆయన రెమ్యునరేషన్ ఏకంగా 46.3 శాతం పెరిగిందని తెలిసింది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎన్‌వీ రమణకి రూ.30 కోట్లు, పూర్తికాలపు డైరెక్టర్ కిరణ్ ఎస్.దివీ(మురళి కుమారుడు)కి రూ.20 కోట్లకు పైగా కంపెనీ ఆఫర్ చేసినట్టు వెల్లడైంది. కమిషన్ల ద్వారానే మురళి రూ.57.61 కోట్లు పొందినట్టు తెలిపింది. 2018–19లో దివీస్ ల్యాబ్స్ రూ.5,036 కోట్ల రెవెన్యూలపై పన్నుల తర్వాత రూ.1,333 కోట్ల లాభం ఆర్జించిన సంగతి తెలిసిందే. దేశంలో అతిపెద్ద ఫార్మాగా ఉన్న సన్‌ఫార్మా ఫౌండర్, ఎండీ దిలీప్ సంఘ్వి జీతం కేవలం ఒక్క రూపాయి కాగా, రూ.2,62,800ను ప్రోత్సాహకాలుగా పొందడం విశేషం. ఇక రెండో అతిపెద్ద ఫార్మా కంపెనీ అరబిందో ఫార్మా ఎండీ ఎన్ గోవింద రాజన్‌కు రూ.14.6 కోట్ల రెమ్యునరేషన్ చెల్లించింది ఆ కంపెనీ.
ఎఫ్‌ఎంసీజీలో గోద్రెజ్ వివేక్‌కే ఎక్కువ….
ఇక ఎఫ్‌ఎంసీజీ రంగాన్ని తీసుకుంటే.. గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఎండీ, సీఈవో వివేక్ గంభీర్ హయ్యస్ట్ పెయిడ్ ఎగ్జిక్యూటివ్‌గా నిలిచారు. వివేక్‌కు మొత్తం రెమ్యునరేషన్ కింద కంపెనీ రూ.20.09 కోట్లు చెల్లిస్తున్నట్టు తెలిసింది. ఆయన తర్వాత హెచ్‌యూఎల్‌కు చెందిన సంజీవ్ మెహతా రూ.18.88 కోట్ల వేతనం పొందుతున్నట్టు కంపెనీల వార్షిక రిపోర్ట్‌ల డేటాలో వెల్లడైంది. నెస్లే ఇండియా ఛైర్మన్, ఎండీ సురేశ్ నారాయణన్‌కు కంపెనీ రూ.11.09 కోట్లు చెల్లిస్తున్నట్టు తెలిసింది.