
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ మహిళా యూనివర్సిటీకి ఇన్చార్జి వీసీని సర్కారు నియమించడంతో త్వరలోనే విభజన ప్రక్రియ మొదలుకానున్నది. టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందితో పాటు విద్యా సంస్థ ఆస్తిపాస్తుల పంపకాలు కూడా జరగనున్నాయి. ఈ ప్రక్రియ నిర్వహణకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేయనుంది. అయితే, సిబ్బంది విభజన జరిగినా.. కొత్త స్టాఫ్ వచ్చే వరకూ పాతవారు విమెన్స్ వర్సిటీలోనే పనిచేయనున్నారు. నిరుడు ఏప్రిల్‌లో హైదరాబాద్ సిటీలోని కోఠి ఉమెన్స్ కాలేజీని తెలంగాణ మహిళా యూనివర్సిటీగా ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసింది. కానీ, ఆ వర్సిటీకి వైస్ చాన్స్‌లర్, స్పెషల్ ఆఫీసర్‌ను ఇప్పటి వరకూ నియమించలేదు. అంతేకాకుండా ఈ వర్సిటీలోని సిబ్బంది అంతా (టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్) ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో పనిచేస్తున్నారు.
దీంతో విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇటీవలే కోఠి ఉమెన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ విజ్జులతను ఇన్చార్జీ వీసీగా ప్రకటించారు. అయితే వర్సిటీ ప్రతినిధిగా ఒక్కరూ కూడా లేకుండానే 2022–23 అకడమిక్ ఇయర్ అడ్మిషన్లన్నీ మహిళా యూనివర్సిటీ పేరుతోనే జరిగాయి. ప్రస్తుతం నాలుగు వేలకు పైగా స్టూడెంట్లు వర్సిటీలో చదువుతున్నారు. ఆ కాలేజీలో టీచింగ్ సిబ్బంది 320 మంది వరకు ఉండగా, వారిలో 28 మంది మాత్రమే పర్మినెంట్ వారున్నారు. నాన్ టీచింగ్ సిబ్బంది 300 మంది వరకు ఉండగా, వారిలో 20 మందే పర్మినెంట్ సిబ్బంది ఉన్నారు. వారిలో పర్మినెంట్ స్టాఫ్ కు ఆప్షన్ ఫాం ఇవ్వనున్నారు. ఆ స్టాఫ్ ఓయూకు ట్రాన్స్ ఫర్ పెట్టుకోవచ్చు లేదా ఇక్కడే కొనసాగేందుకు ఆప్షన్ కూడా ఇవ్వవచ్చు.
ప్లానింగ్ అండ్ డెవలప్ మెంట్ కమిటీ కీలకం..
కొత్త వర్సిటీ ఏర్పాటులో ప్లానింగ్ అండ్ డెవలప్ మెంట్ కమిటీ కీలకంగా వ్యవహరించనుంది. ఈ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. దీంట్లో ఎడ్యుకేషన్ సెక్రటరీ, ఫైనాన్స్, కౌన్సిల్, ఓయూ, విమెన్స్ వర్సిటీ, ఇతర ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారు. పూర్తి స్థాయి వీసీ నియామకంతో పాటు వర్సిటీ ఈసీ ఏర్పాటయ్యేంత వరకూ ఈ కమిటీ కీలకంగా ఉంటుంది. అన్ని నిర్ణయాలు ఈ కమిటీలో తీసుకొని, అమలు చేయనుంది. వర్సిటీకి ప్రభుత్వం రూ.వంద కోట్లు కేటాయించింది. ఆ నిధులను ఈ కమిటీ ద్వారా ఖర్చు చేసే అవకాశముంది.