అట్రాసిటీ కేసుల పురోగతిపై డివిజన్ల వారీగా కలెక్టర్ సమీక్ష

అట్రాసిటీ కేసుల పురోగతిపై డివిజన్ల వారీగా కలెక్టర్ సమీక్ష

నిజామాబాద్, వెలుగు: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు కేసుల దర్యాప్తును పూర్తి చేసి 60 రోజుల్లోపు చార్జ్‌‌ షీట్ దాఖలు చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌‌ కాన్ఫరెన్స్ హాల్‌‌లో శనివారం ఆయన అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్‌‌ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అట్రాసిటీ కేసుల పురోగతిపై డివిజన్ల వారీగా కలెక్టర్ సమీక్షించారు. దర్యాప్తులో పూర్తి ఆధారాలను సేకరించి సకాలంలో చార్జ్‌‌షీట్ ఫైల్ చేయాలన్నారు. వచ్చే సమావేశం నాటికి 60 రోజుల్లోపు చార్జ్‌‌షీట్ దాఖలు చేయని ఏ ఒక్క కేసు కూడా పెండింగ్‌‌లో ఉండకూడదన్నారు. పీసీఆర్ 1955, పీఓఏ 1989 చట్టాలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. పోలీస్, రెవెన్యూ తదితర శాఖల అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. ఆర్మూర్ డివిజన్ పరిధిలో గ్రామాభివృద్ధి కమిటీల ముసుగులో కొనసాగుతున్న ఆగడాలను ఉపేక్షించకూడదన్నారు. సామాజిక బహిష్కరణ చేస్తూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వీడీసీలపై ఫిర్యాదు అందిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించారు. చిట్టీలు, వ్యాపార లావాదేవీల పేరుతో ప్రజలను మోసం చేసి వారి డబ్బులను ఎగ్గొట్టి  తప్పించుకు తిరుగుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. సీపీ కె.ఆర్ నాగరాజు మాట్లాడుతూ ఆర్మూర్ డివిజన్‌‌లో అత్యాచారం కేసులో తాము సమగ్ర సాక్షాధారాలతో ఫైల్ చేసిన చార్జిషీట్ ఆధారంగా న్యాయ స్థానం నిందితుడికి జీవిత ఖైదు విధించిందని తెలిపారు. సమావేశంలో జిల్లా  సోషల్‌ వెల్ఫేర్‌‌ ఆఫీసర్‌‌ శశికళ, ఏసీపీలు వెంకటేశ్వర్లు, కిరణ్‌‌కుమార్, ప్రభాకర్, ఆర్డీవోలు రవి, రాజేశ్వర్, శ్రీనివాస్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. 

భూసార పరిరక్షణ బాధ్యత మనదే

భూసారాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. భూసారాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు సద్గురు ఫౌండేషన్ తరఫున ఢిల్లీకి చెందిన జయ సోలంకి, ప్రతీక్ యాదవ్ అనే ఇద్దరు యువకులు దేశ రాజధాని నుంచి కోయంబత్తూరు వరకు సైకిల్ ర్యాలీ చేపట్టారు. ఇప్పటి వరకు 4 వేల కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేసుకుని శనివారం నిజామాబాద్‌‌కు చేరుకున్న యువకులు కలెక్టరేట్‌‌లో కలెక్టర్ సి.నారాయణరెడ్డి, సీపీ నాగరాజు వారు కలిశారు. సదుద్దేశంతో ప్రజల్లో అవగాహన కల్పిస్తూ సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్న వారిని కలెక్టర్, సీపీ అభినందించారు. కార్యక్రమంలో అడిషనల్‌‌ కలెక్టర్ చంద్రశేఖర్, నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ పాల్గొన్నారు.