పోటీకి దూరంగా గద్వాల జేజమ్మ.. అదే బాటలో మిగతా సీనియర్లు..

పోటీకి దూరంగా గద్వాల జేజమ్మ.. అదే బాటలో మిగతా సీనియర్లు..

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు చాలమంది తెలంగాణ బీజేపీ ముఖ్య నాయకులు వెనుకంజ వేస్తున్నారు. గతంలో ఎన్నిక బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపిన నాయకులు.. ఈ సారి మాత్రం ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా.. చాలామంది నాయకులు పోటీ చేయొద్దని భావిస్తున్నారు. పార్టీ అధిష్టానం ఒత్తిడి మేరకు కొందరు నాయకులు ఎన్నిక బరిలో నిలుస్తుంటే.. మరికొందరు మాత్రం టికెట్ వద్దని ముందుగానే తేల్చేస్తున్నారు. 

ఈసారి అసెంబ్లీ ఎన్నికలో పోటీకి దూరంగా ఉంటున్నారు మాజీ మంత్రి, డీకే అరుణ. ప్రస్తుతం ఈమె బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని అధిష్టానానికి చెప్పినట్లు తెలుస్తోంది. తన స్థానంలో గద్వాలలో బీసీ అభ్యర్థికి టికెట్ ఇస్తామని తెలిపారు డీకే అరుణ. బీసీ సీఎం నినాదంతో బీజేపీ పార్టీ తెలంగాణలో ఎన్నికలకు వెళ్తోంది. తాము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని సూర్యాపేట సభ వేదికగా ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. అంతేకాదు మెజారిటీ సీట్లు కూడా బీసీలకే కేటాయిస్తోంది. ఈ క్రమంలోనే డీకే అరుణ కూడా..తన సీటును బీసీలకు త్యాగం చేసినట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు.

ఇప్పటికే పోటీ చేయమని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ ప్రకటించారు. ఈ నాయకుల దారిలోనే మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వరెడ్డి, చాడ సురేష్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. విజయశాంతి పోటీపై బీజేపీలో ఇంకా క్లారిటీ లేదు. ఈసారి ఆమె పోటీ చేస్తారా..? లేదా అనేదానిపై సందిగ్దత నెలకొంది. ప్రస్తుతం బీజేపీ ఎంపీల్లో బండి సంజయ్ కరీంనగర్ నుంచి, ధర్మపురి అర్వింద్ కోరుట్ల నుంచి, బోథ్ నుంచి ఎంపీ సోయం బాపూరావు పోటీ చేస్తున్నారు. చాలామంది సీనియర్లు పోటీకి దూరంగా ఉండటంతో బీజేపీ క్యాడర్ అయోమయంలో పడింది.

బీజేపీ ఇప్పటి వరకు 53 మంది అభ్యర్థులను ప్రకటించింది. 52 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. రెండో జాబితాలో ఒకే ఒక్కరిని ప్రకటించింది.  హుజూరాబాద్‌, గజ్వేల్‌ నుంచి ఈటల రాజేందర్‌ బరిలో ఉన్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ మళ్లీ గోషామహల్ నుంచే పోటీలో ఉన్నారు. ఇప్పటి వరకు 12 మంది మహిళలకు అవకాశం ఇచ్చింది బీజేపీ.  బీసీలు-16, ఎస్సీలు-8, ఎస్టీలు-6, ఓసీలు-10 మందికి స్థానాలు కేటాయించింది.