బీఆర్ఎస్ ను బొంద పెట్టుడు ఖాయం: డీకే అరుణ

బీఆర్ఎస్ ను  బొంద పెట్టుడు ఖాయం:  డీకే అరుణ

గద్వాల, వెలుగు: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను నిరుద్యోగులు, అన్నివర్గాల ప్రజలు బొంద పెట్టేందుకు రెడీగా ఉన్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తెలిపారు. శుక్రవారం ఇంటింటికీ బీజేపీ కార్యక్రమంలో భాగంగా మల్దకల్  మండలం శేషంపల్లి, తాటికుంట, నాగర్ దొడ్డి, విఠలాపురం, చిప్పదొడ్డి, మల్లెందొడ్డి, ఎల్కూరు, పెద్దపల్లి తదితర గ్రామాల్లో ఆమె పర్యటించి, బీజేపీ జెండాలను ఎగురవేశారు. తొమ్మిదేండ్ల పాలనలో అన్నివర్గాలు ఇబ్బంది పడ్డారని, నిరుద్యోగులకు భృతి ఇస్తానని చెప్పి మోసం చేశారన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కేవలం కల్వకుంట్ల ఫ్యామిలీ మాత్రమే బాగు పడిందని ధ్వజమెత్తారు.

 ప్రస్తుతం ఏ గ్రామానికి వెళ్లినా రోడ్డు సరిగా లేదని, తన హయాంలో వేసిన రోడ్లు తప్ప కొత్త రోడ్డు వేయలేదన్నారు. గతంలోనే నెట్టెంపాడు లిఫ్ట్​ సాధించడం వల్ల ప్రస్తుతం ఈ ప్రాంతం పచ్చగా ఉందన్నారు. ఇప్పుడున్న పాలకులకు అభివృద్ధిపై ధ్యాస లేదని, కేవలం దందాలు చేయడం దోచుకోవడం మాత్రమే తెలుసని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. గడ్డం కృష్ణారెడ్డి, రామాంజనేయులు, బండల వెంకట్రాములు, రాజశేఖర్ రెడ్డి, జనార్ధన్ రెడ్డి, తిమ్మారెడ్డి, నరసింహులు, గోపాల్  పాల్గొన్నారు.