తెలంగాణలో నియంత పాలన అంతమయ్యే వరకూ బీజేపీ నిద్రపోదు : డీకే అరుణ

తెలంగాణలో నియంత పాలన అంతమయ్యే వరకూ బీజేపీ నిద్రపోదు : డీకే అరుణ

తెలంగాణలోని నియంత పాలన అంతమయ్యే వరకూ బీజేపీ నిద్రపోదన్నారు ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చే వరకూ రాష్ర్ట ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామన్నారు. అర్హులైన నిరుపేదలకు తక్షణమే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. మహబూబ్ నగర్ లో బీజేపీ పార్టీ మహా ర్యాలీకి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రదీప్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, తల్లొజు ఆచారి, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహబూబ్ నగర్ ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ నుంచి గడియారం చౌరస్తా వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. క్లాక్ టవర్ వద్ద నిర్వహించిన సభలో డీకే అరుణ మాట్లాడారు.

ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు నెరవేర్చలేదన్నారు డీకే అరుణ. మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి కేసీఆర్ వస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును ప్రజలందరికీ తెలిసేలా ప్రతి బీజేపీ కార్యకర్త ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ర్ట ప్రజల పేర్లపై అప్పులు తీసుకువచ్చి..కేసీఆర్ తన కుటుంబ సభ్యుల జేబులు నింపారని ఆరోపించారు. ధనిక రాష్ట్రంగా, మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణ రాష్ర్టాన్ని అప్పుల పాల్జేశాడని ఆరోపించారు. 

సీఎం కేసీఆర్ తరహాలోనే ఆ పార్టీ నాయకులు, కింది స్థాయి నేతలు వ్యవహరిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేసులు పెట్టిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ అభివృద్ధి పేరున కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన అభివృద్ధి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరిగిందన్నారు. పాత కలెక్టరేట్ భవనాన్ని కూల్చి వేయించి.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన ఇంటికి దగ్గరలో  కట్టించుకున్నారని, హెరిటేజ్ బిల్డింగ్ ను కూల్చి ఏం చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడ కూడా నియంత పాలన జరుగుతోందన్నారు.