రైతు వేదికలకు కాదు.. పంట నష్టానికి పైసలియ్యాలె

V6 Velugu Posted on Nov 04, 2020

పంట పండించే రైతుకు తాను ఏ పంట వేయాలన్న స్వేచ్ఛలేదు. సర్కారు చెప్పిన పంటే వేయాలి. లేదంటే పంట కొనేది లేదని ప్రభుత్వ పెద్దల హెచ్చరికలు. వాళ్లు చెప్పిన పంటలే వేయకతప్పని పరిస్థితి తీసుకొచ్చారు. తాము చెప్పిన పంట పండిస్తే పంట మొత్తం ప్రభుత్వమే కొంటుందని స్వయంగా సీఎం కేసీఆర్ చెప్పడంతో ఆ పంటలకు పెట్టుబడి పెరుగుతుందని తెలిసి కూడా రైతులంతా అలానే చేశారు. చివరికి పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాలు రావడంతో భారీగా నష్టం వచ్చింది.

షరతుల సాగుకు సర్కారు ప్రోత్సాహం

మార్కెట్ లో డిమాండ్ ఉండే పంటలనే రైతులు పండించాలని మే నెలలో ప్రగతి భవన్ లో జరిగిన వ్యవసాయ శాఖ సమీక్షలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ ఖరీఫ్ లో ప్రభుత్వం చెప్పిన పంటలనే పండించాలని ఆదేశించారు. దీనిలో భాగంగా దుడ్డు వడ్లకు బదులు సన్న రకం వడ్లను ఎక్కువగా పండించాలని, పత్తి సాగు విస్తీర్ణం పెంచాలని సూచించారు. సీఎం చెప్పిన మాట ప్రకారం రాష్ట్రంలో రైతులు దాదాపు 50 లక్షల ఎకరాలలో సన్నవడ్లు వేశారు. వర్షాలు బాగా కురవడంతో పంట ఏపుగా పెరిగింది. పెట్టుబడి కొంచెం ఎక్కువైనా దిగుబడి బాగా వస్తుందని ఆశాజనకంగా చూస్తున్న సమయంలో అకాల వర్షాలు నెత్తిన పిడుగులా పడ్డాయి. పంట నీళ్లలో తడిసి భారీగా నష్టం వచ్చింది. దొడ్డు వడ్లలో పోలిస్తే సన్న వడ్ల రకాలు కొంచెం పొడవుగా పెరుగుతాయి. దీంతో ఎడతెరిపి లేని వానలకు పంట అడ్డంగా పడిపోయి పూర్తిగా తడిచిపోయింది. దీంతో ధాన్యం రంగు మారింది. కొన్ని చోట్ల రోజుల కొద్దీ కంకులు నీళ్లలో నానడంతో మొలకలు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వ అంచనా ప్రకారమే రూ.8633 కోట్లు పంట నష్టం జరిగినట్లు తెలిసింది.

సంవత్సరానికి కోటి రూపాయలు సంపాదించే మన రాష్ట్రంలోని పెద్ద రైతు చెప్పారని, తాము చెప్పిన పంటలు పండించక పోతే రైతు బంధు కూడా రాదనే బెదిరింపులకు లొంగిన రైతులు ఏటా పండించే పంటలు కాకుండా కొత్త రకాలు వేశారు. రాష్ట్రంలో అత్యధికంగా 60 లక్షల ఎకరాల్లో పత్తి, 50 లక్షల ఎకరాల్లో వరి, ఇంకో 7-.8 లక్షల ఎకరాల్లో కంది, మక్క, మిరప, చిరు ధాన్యాలు పండించారు. ఈ అకాల వర్షాలకు వరి పంట దాదాపు 75 శాతం దెబ్బ తిన్నది. ఇప్పటి వరకు ఏటా తమ ఇంటి – వరకే సన్నరకాలు వేసుకొని దొడ్డు రకం అమ్మకానికి వేసే రైతులు ప్రభుత్వ సలహాతో సన్న రకాలు వేశారు. మామూలుగా ఎకరా దొడ్డు రకానికి రూ.18 వేల నుండి 22 వేల వరకు ఖర్చు అయితే ఈ సన్న రకానికి రూ.40 వేల వరకు పెట్టుబడి అవుతుంది. ఇదిలా వుండగా ఎకరానికి రెండు ట్రాక్టర్ల పంట తీసే పరిస్థితి నుంచి రెండు ఎకరాలకు కలిపి రెండు ట్రాక్టర్ల వడ్లు మాత్రమే వచ్చాయి. తను ఇప్పటి వరకు దొడ్డు రకాలకు మందే చల్ల లేదని, కానీ సన్న రకాల కోసం రెండుసార్లు మందుకొట్టడం, పంట సమయం కూడా ఎక్కువగా ఉండడం వల్ల పెట్టుబడి పెరిగిందని భువనగిరి రైతు ఒకరు చెప్పారు. వర్షాల వల్ల పసుపు తెగులు, కాటుక తెగులు రావడం వల్ల క్వింటాలుకు రూ.1,200 కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

పత్తి రైతుల పరిస్థితి మరీ దారుణం

పత్తి రైతుల విషయానికి వస్తే రాష్ట్రంలో దాదాపు 60 లక్షల ఎకరాల్లో పత్తి వేస్తే దాదాపు 70 శాతం పంటనష్టం జరిగింది.  ఉమ్మడి నల్గొండ జిల్లా మర్రిగూడెం మండలానికి చెందిన – సుభాష్ అనే రైతు తమ అన్నదమ్ములకు చెందిన 13 ఎకరాలకు తోడు ఇంకో రెండెకరాలు కౌలుకు తీసుకుని మొత్తం 15 ఎకరాల్లో పత్తి సాగు చేస్తే 70–-75 క్వింటాళ్లు రావలసిన పత్తి 12 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. అకాల వర్షాలతో పంటకు రెండు సార్లు కొట్టే మందులు, ఆరు సార్లు కొట్టాల్సి రావడం వల్ల పంట పెట్టుబడి పెరగడమే కాక పత్తి కాయల్లో నీరు చేరడం వల్ల పత్తి నలుపుగా మారింది. దీని వల్ల  పత్తికి సీసీఐ ఇస్తామన్న రూ.5,825 మద్దతు ధరలో సగం కూడా దక్కలేదు. ఎక్కువ మంది రైతుల నుంచి రూ.2,500 వరకు మాత్రమే ఇచ్చి పత్తి కొనుగోలు చేశారు.

పంటల సేకరణ మొదలవ్వలేదు

ప్రభుత్వం చెప్పినట్టు పంటలు వేస్తే పూర్తిగా ధాన్యం ప్రభుత్వమే కొంటుందని చెప్పిన తర్వాత కూడా ఇంకా విత్తన/పంట సేకరణ మొదలవలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిన 6,000 సేకరణ కేంద్రాల ఏర్పాటు ప్రకటనలకే పరిమితమైంది. గత నెలలో ఆదిలాబాద్ లో విత్తన సేకరణ మొదలు పెట్టగానే ఆగిపోయే పరిస్థితి వచ్చింది. సిండికేట్ గా ఏర్పడిన మిల్లర్లు రైతుల కష్టాన్ని, అకాల వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని తక్కువ ధరలు ఇచ్చి దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు పంట నష్టం అంచనా వేయడానికి కూడా రాని అధికారుల కోసం నిరీక్షిస్తున్న రైతులకు ప్రభుత్వం పరిహారం ఇచ్చి భరోసా కల్పించాల్సింది పోయి, ఎప్పుడో పెట్టాల్సిన రైతు వేదికల కోసం ఇప్పుడు రూ.600 కోట్లు కేటాయించటం హాస్యాస్పదంగా ఉంది.

రైతు బంధు తర్వాత, రైతులకు బ్యాంకులు ఎలాంటి రుణాలు ఇవ్వడం లేదు. రుణ మాఫీ పేరుతో రుణాలు కొంత మేరకు మాఫీ అయినా కొత్త రుణాలు లేక రైతులు పూర్తిగా ప్రైవేటు అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టారు. ఇక కౌలు రైతుల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. దుబ్బాక ఉప ఎన్నికపై ప్రభావం పడకూడదని పంటల పరంగా జరిగిన నష్టాన్ని ప్రభుత్వం చెప్పకూడదని అధికారులను ఆదేశించింది. ఇప్పటికైనా నష్టపరిహారంగా రైతులకు ఎకరా వరికి రూ.20 వేలు, రూ.30 వేలు పత్తి సాగుదారులకు ఇవ్వడమే కాకుండా, కొనుగోలు చేస్తున్న మిగతా ధాన్యానికి వరికి రూ.2,500, పత్తి సీసీఐ నిర్ణయించినట్లుగా రూ.5,825 క్వింటాలుకు ఇవ్వాలి. పండిన ధాన్యాన్ని ఎండబెట్టుకోవడానికి వీలుగా గ్రామాల్లో ఉన్న ఫంక్షన్ హాల్స్, కమిటీ హాల్స్​ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని రైతులకు ఇవ్వాలి.

– కల్పన తడక, పీసీసీ సెక్రెటరీ

For More News..

కొత్త ధరణిలో పాత పేర్లు.. అమ్మిన భూమిని మళ్లీ అమ్మేందుకు యత్నాలు

అధికారులు.. మా మాట వినాల్సిందే

క్షమాభిక్ష పిటిషన్‌‌ రెండేండ్లుగా పెండింగ్

Tagged Telangana, Farmers, money, Conditional Cultivation, cotton farmers, Crop loss, rythubandhu, rythuvedika

Latest Videos

Subscribe Now

More News