అభివృద్ధి చెందిన కులాలను బీసీ జాబితాలో చేర్చొద్దు

అభివృద్ధి చెందిన కులాలను బీసీ జాబితాలో చేర్చొద్దు

ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో  ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ ద్వారా రిజర్వేషన్లు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే. అభివృద్ధి చెంది, సామాజిక వెనుకబాటు లేని కులాలను బీసీ జాబితాలో చేర్చడాన్ని విరమించుకోవాలి. ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఉద్యోగుల్లో 59 శాతం మంది అగ్రకులాలకు చెందిన వాళ్లు ఉన్నారు. అయినప్పటికీ ఈడబ్ల్యూఎస్  కోటా కింద వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధం. ఇటీవల మరాఠా రిజర్వేషన్లను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం.. మహారాష్ట్ర ప్రభుత్వం మరాఠ కులం వారికి వెనుకబడిన తరగతుల కోటాలో ఇప్పటికే అమలు చేస్తున్న 50 శాతం రిజర్వేషన్లకు అదనంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో 12 శాతం, ఉద్యోగాల్లో 13 శాతం రిజర్వేషన్ల కల్పనకు సంబంధించిన కేసును విచారించి, ఆరు అంశాలపై తీర్పు వెలువరించింది. ఇందులో.. 

  • 1992లో తొమ్మిది మంది జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన కేసు, 27 శాతం ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించి వర్టికల్ రిజర్వేషన్లు 50 శాతం మించరాదనే తీర్పును 11 మంది జడ్జీలు కల్గిన విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసి, పున:సమీక్షించడం అవసరంలేదని తెలిపింది . 
  • మహారాష్ట్ర ప్రభుత్వం మరాఠాలకు కల్పించిన రిజర్వేషన్లతో మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి పెంచడాన్ని ప్రత్యేక పరిస్థితులుగా పరిగణించలేమని, మరాఠా రిజర్వేషన్లను కొట్టివేసింది. 
  • మహారాష్ట్ర ప్రభుత్వం ఎం.సి. గైక్వాడ్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన బీసీ కమిషన్ ద్వారా మరాఠా రిజర్వేషన్ల కల్పనను, వారి నివేదికలో ప్రత్యేక పరిస్థితులను గుర్తించలేదని తెలిపింది. 
  • కేంద్ర ప్రభుత్వం 102వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చిన ఆర్టికల్స్  338బి, 342ఎ, 366(26సి)లకు ఆమోదం తెలిపింది. 
  • 102వ రాజ్యాంగ సవరణల ద్వారా చేర్చిన 342ఎ, 366(26సి) అధికరణలు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులను గుర్తించడానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు కల్గిన అధికారాలను ఏమాత్రం తగ్గించవని తెలిపింది. 
  • రాజ్యాంగంలో 342ఎ అధికరణను చేర్చడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఫెడరల్ స్ఫూర్తి దెబ్బతినదని తెలియజేస్తూ, సదరు 102వ రాజ్యాంగ సవరణ, రాజ్యాంగ మౌలిక సూత్రాలను మార్చబోదని తేల్చిచెప్పింది. 

ధర్మాసనంలోని ఐదుగురు జడ్జిలు 1, 2, 3 అంశాలపై ఏకాభిప్రాయంతో, మరాఠా రిజర్వేషన్లను కొట్టివేస్తూ, ఇందుకు అనేక కారణాలను ఎత్తిచూపారు. మొదటి జాతీయ బీసీ కమిషన్ 1953 నుంచి 2016 వరకు నియమించిన జాతీయ, రాష్ట్ర బీసీ కమిషన్లు మరాఠా కులం వారిని సామాజికంగా, విద్యాపరంగా, రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందిన కులంగానే గుర్తించాయి. మరాఠాలను మండల్ కమిషన్ కూడా అగ్ర కులంగానే గుర్తిస్తూ 1980లో వీరి జనాభా దేశస్థాయిలో 2 శాతంగా తెలిపింది. ప్రభుత్వ నివేదికల ప్రకారం మహారాష్ట్రలో ప్రభుత్వ ఉద్యోగాలలో మరాఠాల ప్రాతినిధ్యం సరాసరి 35 శాతానికి పైగా ఉంది. కేవలం రాజకీయ ఒత్తిళ్లు  ఓటు బ్యాంకు కోసం మరాఠాలను బీసీలుగా గుర్తించారని తప్పుపట్టింది. కేసు విచారణ సమయంలో  దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను 50 శాతం రిజర్వేషన్ల పరిమితికి సంబంధించి వారి అభిప్రాయాలను కోర్టుకు తెలియజేయాలని ఆదేశించింది. వెలువడబోయే ధర్మాసనం తీర్పు దేశంలో అమలు చేస్తున్న రిజర్వేషన్లను ప్రభావితం చేస్తుందనే విధంగా ప్రచారం జరిగింది. కానీ, చివరికి తుది తీర్పు మరాఠా రిజర్వేషన్ల సమస్య పరిష్కారానికి పరిమితం చేస్తూ, ప్రభుత్వాలకు కొత్త సమస్యలను ముందుకు తెచ్చింది.  ధర్మాసనం 4, 5, 6 అంశాలపై 3:2 మెజారిటీ తీర్పు ప్రకారం, ఇక నుంచి ఆర్టికల్ 338బి, 342ఎ ప్రకారం,  కేంద్ర, రాష్ట్రాల బీసీ జాబితాలో ఏదైనా కులాన్ని చేర్చాలన్నా లేదా తీసివేయాలన్నా జాతీయ బీసీ కమిషన్ సిఫార్సుతో, పార్లమెంటు ఆమోదంతో, రాష్ట్రపతి బీసీ జాబితాను ప్రకటించాల్సి ఉంటుంది. ఆవిధంగా ఓబీసీ జాబితాను రాష్ట్రపతి ఆమోదం తెలిపే వరకూ ప్రస్తుతం గుర్తించబడిన ఓబీసీ/బీసీ జాబితాలను కొనసాగించాలని ధర్మాసనం తెలిపింది.

ఉద్యోగుల్లో అగ్రకులాలవాళ్లే 59%
కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉద్యోగాలలో మొత్తం కేటగిరీలను కలిపి షెడ్యూల్డ్ కులాలు 14 శాతం, షెడ్యూల్డ్ తెగలు 6 శాతం, ఇతర వెనుకబడిన తరగతులు 21 శాతం మాత్రమే ఉన్నాయి. మిగిలిన 59 శాతం ఉద్యోగులు అగ్రకులాలకు చెందిన వారుగా ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి.  అయినప్పటికీ ఈడబ్ల్యూఎస్  కోటా కింద వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధమనే చెప్పాలి. సదరు రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. ఆ రిజర్వేషన్లను నిలిపివేస్తారా? ఆమోదిస్తారా? వేచిచూడాలి. దేశంలో కుల నిర్మూలన జరగనంత కాలం, కుల వివక్షతలు కొనసాగినంత కాలం, వేల సంవత్సరాలు విద్యకు దూరమై సామాజికంగా, ఆర్థికంగా  వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జనాభా దామాషా పద్ధతిలో విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక తదితర రంగాల్లో రిజర్వేషన్లు కొనసాగాలి. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ ఓట్ల లబ్ధికోసం అభివృద్ధి చెంది, సామాజిక వెనుకబాటు లేని కులాలను బీసీ జాబితాలో చేర్చడాన్ని విరమించుకోవాలి. ఇప్పటివరకు  సుప్రీంకోర్టు వెలువరించిన 50 శాతం రిజర్వేషన్లు మించకూడదనే తీర్పులను పునఃసమీక్షించడం కోసం 11 మంది జడ్జిల విస్తృత ధర్మాసనానికి కేసులను బదిలీ చేసి,  ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది.

వేర్వేరు జాబితాలతో సమస్యలు
నేడు కేంద్ర, రాష్ట్రాల బీసీ జాబితాలు వేర్వేరుగా ఉన్నందువల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. అదే ఎస్సీ, ఎస్టీ జాబితాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఒకేవిధంగా ఉంటాయి. ప్రస్తుతం ఏదైనా కులాన్ని షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్  తెగల జాబితాల్లో  చేర్చాలన్నా లేదా తీసివేయాలన్నా కేంద్రమే చేస్తుంది. ఇదే విధానాన్ని ఓబీసీ/బీసీ రిజర్వేషన్లకు వర్తింపచేయడం సమర్థనీయమే. అదే జరిగితే చాలా రాష్ట్రాల్లోని బీసీ జాబితాలు  తారుమారయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని బీసీ– ఇ కేటగిరిలోని ముస్లింలను బీసీ జాబితా నుంచి తొలగించే అవకాశం ఉంది.  అయినప్పటికీ, కేంద్రం తీర్పులోని 4, 5, 6 అంశాలను పునఃసమీక్షించాలని సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తూ, ఆయా రాష్ట్రాలు కూడా ఏదైనా కులాన్ని రాష్ట్ర బీసీ జాబితాలో కలిపేందుకు లేదా తీసివేసేందుకు అధికారం కల్పించాలని కోరింది. తీర్పు ఏవిధంగా వస్తుందో చూడాలి. భారత రాజ్యాంగంలోని అధికరణల్లో 50 శాతం వర్టికల్ రిజర్వేషన్లు మించకూడదనే నిబంధనలు లేవు. అయినప్పటికీ మండల్ కమిషన్ తీర్పుతో సహా 1951 నుంచి ఇప్పటి వరకు సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో.. ప్రత్యేకమైన పరిస్థితులు, ఆయా వర్గాలు ఆమోదించబడిన లెక్కలు ఉన్నట్లయితే 50 శాతానికి మించి ఎస్సీ, ఎస్టీ, బీసీ  రిజర్వేషన్లు కల్పించుకోవచ్చని తెలిపాయి. 

- కోడెపాక కుమారస్వామి, రాష్ట్ర అధ్యక్షుడు, 

తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం