
సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లాలోని చివరి గ్రామం వరకు కాళేశ్వరం నీళ్లు అందించామా ? లేదా ? అన్న విషయంపై సీఎం రేవంత్‌రెడ్డి చర్చకు రావాలని మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సవాల్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలో జరిగిన మీటింగ్‌లో కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సూర్యాపేటకు నీళ్లు వచ్చాయో.. లేదో.. రైతులనే అడిగి తెలుసుకుందామన్నారు. చిన్న సీతారాంతండాకు వెళ్లి అక్కడి రైతులనే అడిగితే నిజం తెలుస్తుందన్నారు.
కాళేశ్వరంపై కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సూర్యాపేట జిల్లాలోని లక్షలాది ఎకరాలకు కాళేశ్వరం నీళ్లు ఇచ్చామని చెప్పారు. కన్నేపల్లి నుంచి 380 కిలోమీటర్ల మేర ప్రవహించిన నీళ్లు సూర్యాపేటకు వస్తున్నాయన్నారు. మేడిగడ్డలో కుంగిన పిల్లర్లకు రిపేర్లు చేయకుండా.. కుంటిసాకులు చెబుతూ రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్నార్ననారు. కాళేశ్వరం నుంచి నీళ్లు ఇస్తే కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందన్న భయం పట్టుకుందన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మాజీఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.