ఒక గ్రామం ఒక గ్రంథాలయం గడ్చిరోలి విజ్ఞానగాథ

ఒక గ్రామం ఒక గ్రంథాలయం  గడ్చిరోలి విజ్ఞానగాథ

గడ్చిరోలిలో 'ఒక గ్రామం ఒక గ్రంథాలయం' కార్యక్రమం  అమలుచేసి విద్య, వై-ఫై, ఉద్యోగ మార్గదర్శకత్వం కల్పించడం ద్వారా నక్సల్స్ ప్రభావాన్ని తగ్గించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. 2023లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు 71  గ్రంథాలయాలను నిర్వహిస్తోంది.  దీనివల్ల 8,000 మందికి పైగా యువతకు సహాయం అందింది. ఈ కార్యక్రమం చాలామందికి ఉద్యోగాలు  సంపాదించడంలో  సహాయపడింది.  205 మంది యువకులు పోలీసు బలగాల్లో చేరారు.  ఈ  కార్యక్రమం ఆయా గ్రామాల్లో యువత జీవితాలను మార్చింది.  మహారాష్ట్రలోని  కొన్ని  ప్రాంతాలను నక్సల్స్ రహితంగా మార్చాలనే  లక్ష్యంతో  గడ్చిరోలి పోలీసులు జిల్లా అంతటా 71 గ్రంథాలయాలను ఏర్పాటు చేశారు.  ఈ  గ్రంథాలయాలను 'ఒక గ్రామం, ఒక గ్రంథాలయం' కార్యక్రమం కింద ఏర్పాటు చేశారు. విద్య, ఉద్యోగ అవకాశాలను కల్పించడం  ద్వారా నక్సల్స్ ప్రభావాన్ని తగ్గించడమే ఈ కార్యక్రమం లక్ష్యం.  ఈ కార్యక్రమం మొదట  చత్తీస్‌‌గఢ్  సరిహద్దుకు సమీపంలోని మారుమూల గ్రామం కోట్గుల్‌‌లో 2023 జనవరి 18న ప్రారంభమైంది.  ప్రతి పోలీసు స్టేషన్ లేదా ఔట్‌‌పోస్ట్ పరిధిలోని ప్రతి గ్రామంలో ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం.  

విద్యార్థులకు కల్పతరువు

ఈ  ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది పోలీసు సూపరింటెండెంట్  నీలోత్పాల్‌‌.   ఇప్పుడు   గడ్చిరోలి జిల్లావ్యాప్తంగా 71 గ్రంథాలయాలు పనిచేస్తున్నాయి. 8,000 మందికి పైగా యువత వాటిని దినపత్రికల కోసం, పుస్తకాల కోసం, పాఠ్యపుస్తకాల కోసం, కథల పుస్తకాల కోసం, నవలల కోసం వినియోగించుకుంటున్నారు.  ముఖ్యంగా ఈ ప్రాంతంలోని పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఇవి కల్పతరువుగా పనిచేస్తున్నాయి. ఎందుకంటే ఎలాంటి కోచింగ్ అవకాశాలు లేనిచోట ఈ గ్రంథాలయాలు వాటిలో వారికి కావలసిన పుస్తక సంపద, మౌలిక సదుపాయాల ఏర్పాటుతో విద్యార్థులు శ్రమించి వందలాది ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ఈ యువకులలో 205 మంది పోలీసు బలగాలకు ఎంపికయ్యారు. ఇంకా చాలామంది రెవెన్యూ డిపార్ట్​మెంట్‌‌లో ఉద్యోగాలు సంపాదించారు. నల్గొండ వంటి ప్రాంతాల్లో,  మేం  రిమోట్ గ్రంథాలయాలను పోలీస్ పోస్ట్ కనెక్టివిటీని ఉపయోగించి వై-ఫైతో అనుసంధానించాం.  ఈ గ్రంథాలయాలు వై-ఫై,  పుస్తకాలు,  ఆన్‌‌లైన్  కోచింగ్‌‌లను అందిస్తున్నాయి. తద్వారా ఈ విద్యార్థులకు నిజంగా ఏ పుస్తక వనరులు అవసరం ఉన్నాయో  వాటిని కల్పించే  వేదికగా ఈ గ్రంథాలయాలు ఉపయోగపడుతున్నాయి. 

యువతలో ఆత్మవిశ్వాసం

ఇంతకుముందు మావోయిస్టు గ్రూపులు స్థానిక యువతను తప్పుదారి పట్టించాయని ఎస్పీ నీలోత్పాల్‌‌ తెలిపారు. ఈ గ్రంథాలయ ప్రాజెక్ట్ దీనిని ఎదుర్కోవడానికి రూపొందించడం జరిగింది.  2020కి ముందు మావోయిస్టు  గ్రూపులు  యువతను తప్పుదారి పట్టిస్తున్నాయని తాము భావించి ‘ఒక గ్రామం ఒక గ్రంథాలయం’ అనే ప్రాజెక్టు రూపకల్ప న  చేశాం.  యువకులను  నిత్యం గ్రంథాలయంలో  పుస్తకాలతో   నిమగ్నం అయ్యే ప్రయత్నం ఇది. 

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి  పోలీసు శాఖను మాత్రమే కాకుండా స్థానిక గ్రామస్థులను కూడా ఇందులో భాగం చేశారు. ఇంతకు ముందు శిథిలావస్థలో ఉన్న గ్రంథాలయ భవనాలు  కమ్యూనిటీ సహాయంతో  పునరుద్ధరించి ఉపయోగపడేలా అందుబాటులోకి  తీసుకువచ్చారు.  ఇక్కడ క్రమం తప్పకుండా చదువుకునే విద్యార్థులతోపాటు,  పాఠశాల విద్యార్థులు కూడా వచ్చి ఇక్కడ చదువుకోవచ్చా అని అడుగుతున్నారంటే విద్యార్థుల మీద  ఈ గ్రంథాలయాలు ఏ విధంగా ప్రభావితం చేశాయో అర్థం చేసుకోవచ్చు.  గ్రంథాలయాలు ఈ ప్రాంతంలోని యువతలో ఆత్మవిశ్వాసాన్ని గణనీయంగా పెంచాయి.  
కమ్యూనిటీ నిమగ్నత:  ఈ  కార్యక్రమం కమ్యూనిటీ భాగస్వామ్యంపై ఆధారపడి ఉంది.  స్థానిక కమిటీలు గ్రంథాలయాలను నిర్వహించడానికి సహాయపడతాయి. ఇది సొంతం అనే భావాన్ని, సామూహిక బాధ్యతను పెంపొందిస్తుంది.  దీనివల్ల నక్సల్స్ ప్రభావాన్ని నిరోధించే శక్తి పెరుగుతుంది.

డిజిటల్ భాగస్వామ్యం:  ఉచిత వై-ఫై,  ఆన్‌‌లైన్  వనరులు  యువతను  ప్రపంచంతో  కలుపుతాయి.  తద్వారా  ఒంటరితనాన్ని తగ్గిస్తాయి.  నక్సల్ ప్రచారాన్ని అడ్డుకుంటాయి.  సమాచారం, డిజిటల్ అక్షరాస్యత అందుబాటులోకి రావడం వల్ల యువత సరైన నిర్ణయాలు తీసుకోవడానికి, తీవ్రవాద ఆలోచనలను నిరోధించడానికి వీలు కలుగుతుంది.

సానుకూల ప్రత్యామ్నాయాలు:  గ్రంథాలయాలు సురక్షితమైన కమ్యూనిటీ కేంద్రాలుగా పనిచేస్తాయి.  ఇక్కడ  యువత ఒకచోట చేరి చదువుకోవచ్చు,  నిర్మాణాత్మక  కార్యకలాపాలలో పాల్గొనవచ్చు. ఇది నక్సల్ గ్రూపుల వ్యతిరేక  ప్రభావానికి  సానుకూల  ప్రత్యామ్నాయంగా ఉంటుంది.  ఆ గ్రూపులు ఒంటరిగా ఉన్న లేదా అసంతృప్తితో ఉన్న యువతను ఎక్కువగా లక్ష్యంగా చేసుకుంటాయని పోలీసుల కథనం. 

విద్యా లభ్యత:  గ్రామీణ యువతకు విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి గ్రంథాలయాలు..  పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్, డిజిటల్ వనరులను అందిస్తాయి. 
వై-ఫై  కనెక్టివిటీ: ఉచిత ఇంటర్నెట్ సదుపాయం విద్యార్థులకు ఆన్‌‌లైన్ విద్యను అభ్యసించడానికి, ప్రభుత్వ పథకాలను పొందడానికి, ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఉద్యోగ మార్గదర్శకత్వం:  యువతకు పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి, ఉద్యోగ అవకాశాలను అన్వేషించడానికి సహాయపడటానికి కెరీర్  కౌన్సెలింగ్,  మార్గదర్శక సెషన్లు నిర్వహిస్తారు. 

- డా. రవి కుమార్ చేగొని
ప్రధాన కార్యదర్శి, తెలంగాణ గ్రంథాలయ సంఘం,
హైదరాబాద్