ఎలక్ట్రిక్ వాహనాలు పర్యావరణానికి పూర్తి అనుకూలమా?

ఎలక్ట్రిక్ వాహనాలు  పర్యావరణానికి పూర్తి అనుకూలమా?

ప్రస్తుతం ఆటోమొబైల్  రంగంలో ఎలక్ట్రిక్ వాహనాలకు చాలా డిమాండ్ ఉంది.  దీనికి  కారణాలు విద్యుత్  వాహనాలు శిలాజ ఇంధనాలను ఉపయోగించకపోవడం,  పొగ,  కార్బన్ డయాక్సైడ్,  ఇతర గ్రీన్ హౌస్ వాయువులను విద్యుత్  వాహనాలు  విడుదల చేయకపోవడం. అదేవిధంగా ధ్వని కాలుష్యాన్ని కలగజేయకపోవడం వలన వినియోగదారులు వీటిని పూర్తిగా పర్యావరణ అనుకూలమైనవిగా భావిస్తారు. కానీ, వాస్తవంగా విద్యుత్ వాహనాలకు ఇంధనంగా వాడే  ‘లిథియం అయాన్ బ్యాటరీ’ తయారీలో వినియోగదారులకు కనిపించని పర్యావరణ విధ్వంసం జరుగుతుంది.

‘చాలామంది వినియోగదారులకు విద్యుత్ వాహనాల క్లీన్ అంశాల గురించి మాత్రమే తెలుసు.  కానీ, వాటి ఉత్పత్తి ప్రక్రియలో జరిగే మురికి అంశాలు వినియోగదారులకు కనిపించవు’, అని యునైటెడ్  నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్(యు.ఎన్.సి.టి.ఏ.డి.) అంతర్జాతీయ వాణిజ్య డైరెక్టర్, పమేలా కోక్ హామిల్టన్ అభిప్రాయపడ్డారు.   విద్యుత్  వాహనాలు కొన్ని పర్యావరణ సమస్యలను పరిష్కరించి, మరికొన్ని పర్యావరణ  సమస్యలను సృష్టిస్తాయి. లిథియం   అయాన్ బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలు కేవలం ‘క్లీన్ ఎనర్జీ మాత్రమే’ కానీ, పూర్తి పర్యావరణ అనుకూలమైనవికావు.  క్లీన్ఎనర్జీ(స్వచ్ఛమైన శక్తి) రెన్యువబుల్ ఎనర్జీ (పునరుత్పాదక శక్తి ),  గ్రీన్ ఎనర్జీ (హరిత శక్తి)  మధ్య గల భేదం.  క్లీన్ఎనర్జీ (స్వచ్ఛమైన శక్తి) రెన్యువబుల్ ఎనర్జీ (పునరుత్పాదక శక్తి) మరియు గ్రీన్ ఎనర్జీ(హరిత శక్తి), ఈ మూడు రకాలైన శక్తి వనరుల మధ్య కొంత వ్యత్యాసం ఉన్నది. ఈ వ్యత్యాసాన్ని వినియోగదారులు  తెలుసుకోవలసిన అవసరం ఉన్నది. 

క్లీన్ఎనర్జీ  అంటే..

క్లీన్ఎనర్జీ అంటే ‘వాయు కాలుష్యాన్ని కలగచేయని’ శక్తి వనరులు.  ఇవి  రెన్యువబుల్ ఎనర్జీ  వనరులు కావు.  వీటి సేకరణ,  తయారీ పర్యావరణానికి హాని కలగజేస్తుంది. వీటిని వినియోగిస్తున్నప్పుడు వాయు కాలుష్యం ఏర్పడదు, కనక వినియోగదారులు వీటిని పూర్తిగా  పర్యావరణ అనుకూల శక్తి వనరులుగా భావిస్తుంటారు. కానీ,  క్లీన్ఎనర్జీ శక్తి వనరుల తయారీలో జరిగే పర్యావరణ విధ్వంసం వినియోగదారులకు కనిపించదు. రెన్యువబుల్ ఎనర్జీ వనరులు అనగా ఎంత వినియోగించిప్పటికీ  తరిగిపోకుండా,   ప్రకృతి సిద్ధంగా తిరిగి పొందగలిగే అపరిమితమైన శక్తి వనరులు.  రెన్యువబుల్ ఎనర్జీ వనరులు రెండు రకాలుగా ఉంటాయి.  మొదటి రకం రెన్యువబుల్ ఎనర్జీ వనరుల సేకరణ, తయారీ పర్యావరణానికి అనుకూలంగానే ఉంటుంది.  అయితే,  వీటిని మండించినప్పుడు హరిత వాయువులు వెలువడతాయి.  వాయుకాలుష్యం ఏర్పడుతుంది.  ఉదాహరణకు  పశువుల పేడ నుంచి తయారు చేసే పిడకలు,  వృక్షాల  నుంచి  సేకరించే  కట్టెలను  మండించినప్పుడు పొగ,  హరిత వాయువులు వెలువడుతాయి.  అంటే  ఇవి  రెన్యువబుల్ ఎనర్జీ వనరులు అయినప్పటికీ  క్లీన్ఎనర్జీ  కాదు.  రెండోరకం  రెన్యువబుల్ ఎనర్జీ వనరులను  మండించినప్పుడు  ఎటువంటి  హరిత వాయువులు విడుదలకావు.  వాయు కాలుష్యాన్ని ఏర్పరచవు. వీటినే గ్రీన్ఎనర్జీ  వనరులు  అని పిలుస్తారు. 

గ్రీన్ ఎనర్జీ  పర్యావరణానికి అనుకూలం

గ్రీన్ ఎనర్జీ నూటికి నూరుశాతం పర్యావరణానికి అనుకూలమైనది.  వీటి సేకరణ,తయారీ, వినియోగం అంతా పూర్తిగా పర్యావరణానికి అనుకూలంగా ఉంటుంది. గ్రీన్ఎనర్జీ  వనరులకు ఉదాహరణలు.  హరిత హైడ్రోజన్, జియో థర్మల్ ఎనర్జీ, సౌరశక్తి, విండ్ ఎనర్జీ,  గోబర్ గ్యాస్.  హరిత హైడ్రోజన్ కు కావలసిన హైడ్రోజన్  నీటిని విద్యుత్ విశ్లేషణ  చేయటం ద్వారా తయారుచేస్తారు.  ఈ  విద్యుత్ విశ్లేషణ ప్రక్రియకు అవసరమైన విద్యుత్తును సౌర శక్తిని లేక  పవన శక్తిని ఉపయోగించటం ద్వారా పొందుతారు.  హరిత హైడ్రోజన్ వాయువును  మండించినప్పుడు ఎటువంటి  హరిత వాయులు వెలువడవు. వాయు కాలుష్యం ఏర్పడదు.  లిథియం అయాన్  బ్యాటరీని ఉపయోగించే విద్యుత్ వాహనాలు ‘క్లీన్ ఎనర్జీ’ మాత్రమే.   కానీ,  ఇవి  ‘రెన్యువల్’, ‘గ్రీన్ ఎనర్జీ’లుగా  పనిచేయవు.  లిథియం,  కోబాల్ట్,  మాంగనీస్,  గ్రాఫైట్ లు, లిథియం అయాన్ బ్యాటరీ తయారీలో ఉపయోగపడే  నాలుగు ప్రధాన ముడి పదార్థాలు.  ఇవి భూమి లోపల  లభించే ఖనిజాలు.  వీటిని  గనులను  తవ్వడం (మైనింగ్) ద్వారా  వెలికితీస్తారు.  అంటే, ఈ ఖనిజ వనరులు పరిమితమైనవి.  నేటి వాణిజ్య లిథియం ఉత్పత్తిలో ఎక్కువభాగం భూగర్భ ఉప్పునీటి  రిజర్వాయర్ల  నుంచి లిథియంను సేకరిస్తారు.  కొన్ని అంచనాల ప్రకారం ఒక టన్ను లిథియం ఉత్పత్తి చేయడానికి దాదాపు రెండు మిలియన్ లీటర్ల నీరు అవసరం అవుతుంది.  లిథియం అయాన్ బ్యాటరీ తయారీ లో ఉపయోగించే మరియొక ప్రధానమైన ముడి పదార్థం కోబాల్ట్. కోబాల్ట్ ఉత్పత్తి చేసిన దానిలో సగభాగం విద్యుత్ వాహనాలకు ఉపయోగిస్తారు. ఒక్క బ్యాటరీ కి సుమారు 4-30 కేజీల కోబాల్ట్ వినియోగిస్తారు. 

శ్రమదోపిడీ

కోబాల్ట్.. ఆస్ట్రేలియా, అమెరికా, చైనా,  రష్యా వంటి వివిధ దేశాలలో లభ్యమవుతుంది.  కానీ, 70% కోబాల్ట్ డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో  నుంచి లభ్యమవుతుంది.  కాంగో  కోబాల్ట్ మైనింగ్  రెండువిధాలుగా ఉంటుంది.  ఒకటి  ఇండస్ట్రియల్ మైనింగ్,  ఇది క్రమబద్ధీకరించిన  మైనింగ్.  రెండోది ఆర్టిసినల్ మైనింగ్. ఇది క్రమబద్ధీకరించని మైనింగ్ వ్యవస్థ.  ఇది ప్రైవేటు వ్యక్తులు చేసే అక్రమ మైనింగ్.  ఆర్టిసినల్ మైనింగ్ వ్యవస్థ ద్వారా చాలా తక్కువ ధరకే  కోబాల్ట్ దొరకటం వల్ల పెద్ద కంపెనీలు ఆర్టిసినల్ మైనింగ్ వ్యవస్థ ద్వారానే  కోబాల్ట్ ను  కొనుగోలు చేస్తాయి. ఈ మైనింగ్ లో  సుమారు రెండు లక్షల మంది కార్మికులు పనిచేస్తుఉంటారు. వీరిలో 40 వేల మంది బాల కార్మికులు  అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులలో పనిచేస్తారు.  వీరిలో  ఆరు సంవత్సరాల పిల్లలు కూడా ఉంటారు. ఈ బాల కార్మికులు ఆక్సిజన్ తక్కువగా ఉండే లోతైన  కోబాల్ట్  మైనింగ్ లలో గంటలు కొద్ది పని చేస్తారు.  

- డా. శ్రీదరాల రాము, 
ప్రొఫెసర్ ఆఫ్  కెమిస్ట్రీ అండ్ 
ఎన్విరాన్మెంటల్ సైన్సెస్,  హైదరాబాద్