వెలుగు లేనిదే .. మార్పు ఎక్కడిది.?

వెలుగు  లేనిదే .. మార్పు ఎక్కడిది.?

ఏ మాటకామాట చెప్పుకోవాలె. 2012లో ప్రారంభమైన వీ6 చానెల్ ఉద్యమ కాలమంతా ​ విస్తరింపజేసిన తెలంగాణ  భావజాలానికి ఎవరూ వెలకట్టలేరు.  ఆ మాటకొస్తే అది ఎవరి వత్తాసుకో లొంగి పనిచేస్తూ వచ్చిన  మీడియా కాదు. సర్వం తెలంగాణ ప్రేక్షకుల ఆదరణతో నడుస్తున్న మీడియా అది. 2018లో ‘వెలుగు’ పత్రిక ప్రారంభమై.. తెలంగాణ ప్రజల పక్షాన అక్షరయుద్ధం మొదలుపెట్టింది. రెండు రాష్ట్రాల వకాల్తా పుచ్చుకొని తెలంగాణను ఆగం పట్టించే ఆంధ్రా యాజమాన్య మీడియా రాతలకు, వీ6 ‘వెలుగు’ రాతలకు తేడా ఏముంటుందో..  గత 13 ఏండ్లుగా  తెలంగాణ ప్రేక్షకులకు, పాఠకులకూ బాగా తెలుసు. 


తెలంగాణ మలిదశ ఉద్యమ కాలమంతా  ఆంధ్రా మీడియా డొంకతిరుగుడు వాదాలను..తిప్పి కొట్టింది  వీ6 చానలేనని ఇవాళ తెలియని వారెవరైనా ఉంటారా? అసలు తెలంగాణకో మీడియా ఉంటదని అప్పట్లో ఎవరైనా ఊహించారా? ఆంధ్రా మీడియా చెప్పిందే వేదం అనే దుస్థితి నుంచి తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచి కొసదాకా పోరాడిన చానెల్​ వీ6 అని అందరికీ తెలుసు. 

అక్రమాలను వెలికితీస్తే  కడుపుమంట!

2014లో  అధికారం చేపట్టాక నమ్ముకున్న టీఆర్​ఎస్​ పాలకులే ఆంధ్రా మీడియాను పోషిస్తూ, వీ6 వెలుగును తొక్కేసే ప్రయత్నం చేశారు. అనేకమార్లు వీ6 వెలుగును బహిష్కరిస్తున్నామని బహిరంగ ప్రకటనలు చేశారు. కనీసం అధికారిక కార్యక్రమాలకు కూడా అటెండ్​ కాకుండా నిరోధించిన సంఘటనలు అనేకం. గత బీఆర్​ఎస్​ పాలకులకు కడుపు మంట ఎందుకో అందరికీ తెలిసిందే. అందుకు కారణం అవినీతి, అక్రమాలు, భూకబ్జాలు, ఇసుక, ల్యాండ్​ మాఫియాలను వీ6 వెలుగు.. వెలుగులోకి తేవడమే! కాళేశ్వరం ప్రాజెక్టు నిరర్థక నిర్మాణాన్ని ఎలుగెత్తి చూపడం బీఆర్​ఎస్​ యజమానులకు అస్సలు నచ్చలేదు.  పోతిరెడ్డిపాడు నుంచి మరింతగా నీటిదోపిడీకోసం ఏపీ  సంగమేశ్వరం నిర్మిస్తుంటే, కావాలని కళ్లు మూసుకున్న కేసీఆర్​ అసలు రూపాన్ని చూపిన వీ6  వెలుగును భరించలేకపోయారు. రోజా  రొయ్యల పులుసు విందు, రాయలసీమను రతనాలసీమ చేస్తామన్న కేసీఆర్​ ఆత్మలో తెలంగాణ ఏ కోశానా లేదని వీ6 వెలుగు బయటపెడుతూ వచ్చిన తీరును 
అంతకన్నా భరించలేకపోయారు. 

బహిష్కరణలే బహుమానాలయ్యాయి!

ఆంధ్రా అధికారులతో రాజ్యం నడిపిన బీఆర్ఎస్​ యజమానులు తెలంగాణను పదేండ్లలో ఏం చేశారో తెలియందికాదు. తెలంగాణ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేసిన వీ6 వెలుగును ఎంత నిర్బంధించాలని చూసినా.. బీఆర్​ఎస్​ ప్రజావ్యతిరేక పాలనపై, ఆంధ్రా రాజకీయాలతో అంటకాగిన బీఆర్​ఎస్​ పాలనపై.. 2023 వరకు వీ6 వెలుగు ప్రజల పక్షాన నిత్య పోరాటం చేసింది. బీఆర్ఎస్​కు వత్తాసుగా మారిన ఆంధ్రా మీడియాకు అడ్వర్టైజ్​మెంట్లు, నిత్యం తెలంగాణ గొంతు వినిపిస్తున్న వీ6  వెలుగుకు బహిష్కరణలు!  తెలంగాణ మీడియాకు బీఆర్​ఎస్​ యజమానులు ఇచ్చిన బహుమానాలు ఏమన్నా ఉన్నాయంటే అవి బహిష్కరణలే! అయినా..వచ్చిన తెలంగాణ నీళ్లను, నిధులను, నియామకాలను ఏపీకే  దోచిపెట్టిన పదేండ్ల పాలనను ప్రజల ముందుపెట్టిన మీడియాగా వీ6 వెలుగు ఇప్పటికీ గర్వంగా ఫీలవుతున్నది! 

ఏ మీడియా చేయని సాహసాలను వీ6 వెలుగు చేసి చూపింది!

 అవినీతి, అక్రమాల పాలనను గద్దె దించడం ఏ ఒక్క రాజకీయ పార్టీతో మాత్రమే అయ్యేది కాదు. ప్రజలకు నిజానిజాలు తెలిపే తెలంగాణ గొంతుగా వీ6 వెలుగు లేనిదే అది సాధ్యంకాలేదనే విషయాన్ని ప్రస్తుత పాలకులు మర్చిపోతున్నారేమో? పదేండ్ల కేసీఆర్​ పాలనలో ఏ మీడియా చేయని సాహసాలను వీ6 వెలుగు చేయగలిగింది. వీ6 వెలుగు చేసిన అలాంటి సాహసాలే, కేసీఆర్​లాంటి నియంతను ఇంటికి పంపించడంలో కీలకమయ్యాయని ఎవరూ మర్చిపోవద్దు.  ప్రజల పక్షాన నిలబడి పోరాడిన వీ6 వెలుగు వంటి తెలంగాణ మీడియానే లేకుండా బీఆర్​ఎస్​ను తామే గద్దె దించామనుకుంటే పొరపాటు. కాళేశ్వరం వరుస కథనాలను వెలికితీసి ప్రజల ముందు పెట్టింది రాజకీయ పార్టీలు కాదు.. వీ6 వెలుగు మాత్రమే అని అప్పుడే మర్చిపోతున్నారా? ఆర్టీసీ సమ్మెను ముందుకు నడిపించింది వీ6 వెలుగు మాత్రమే. ఉద్యోగుల సమస్యలపై, నిరుద్యోగుల ఆక్రందనలపై, పరీక్ష పేపర్ల లీకేజీలపై ఎప్పటికప్పుడు వీ6 వెలుగు స్పందించింది. ప్రజల పక్షాన నిలిచింది.  ఆ క్రెడిట్​ అంతా  ఏ రాజకీయ పార్టీదో కాదు.  వీ6 వెలుగు చేసిన పోరాట ఫలితం ప్రజలు మార్పు కోరుకోవడంలో బలంగా పనిచేసిందనేది అప్పుడే మర్చిపోతే ఎలా? ఇవాళ 
సంగమేశ్వరం నుంచి నేటి బనకచర్ల దాకా ఏపీ కుట్రలను ఏ రాజకీయ పార్టీ అయినా బయటపెట్టిందా? గత ఏడాది కాలంగా బనకచర్ల వరుస కథనాలను ప్రజల ముందు పెట్టి, ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది వీ6 వెలుగు మాత్రమే కదా! ప్రభుత్వాలు మారినా, ప్రజల పక్షాన నిలబడే మీడియా పట్ల ఏ ప్రభుత్వం వివక్ష చూపినా వీ6 వెలుగు తన గొంతు వినిపిస్తూనే ఉంటదని ఎప్పుడూ మర్చిపోవద్దు. ప్రభుత్వం తీసుకుంటున్న  మంచి నిర్ణయాలను ప్రజలకు చెప్పడంలో వీ6 వెలుగు ఎప్పుడూ ముందుంటుంది. అలాగే, నిర్ణయాల్లో తప్పులుంటే నిర్భయంగా ఎత్తిచూపడంలోనూ అంతే  ముందుంటుంది. 

ఎంత అవగతం చేసుకుంటే, అంత మంచిది!

ఇప్పటికీ తెలంగాణ గొంతు వినిపించే మీడియా ఉన్నదంటే.. అది వీ6 వెలుగు మాత్రమే. ఈ విషయాన్ని ఇప్పటి పాలకులు కూడా మర్చిపోతున్నారు. కాబట్టే  పత్రికా ప్రకటనలు ఇవ్వడంలో వివక్ష పాటిస్తున్నారని అర్థమవుతుంది. అదే ఆంధ్రా మీడియాను పెంచి పోషిస్తూ, తెలంగాణ మీడియాను తొక్కేసే ప్రయత్నాలు జరుగుతున్నాయేమోననే అనుమానాలు మాత్రం రోజురోజుకూ పెరుగుతున్నాయి. గత బీఆర్​ఎస్​ యజమానులకు, ఇప్పటి పాలకులకు తేడా ఏమిటో వారికి  ఆత్మపరిశీలన అవసరం. కేసీఆర్​ పాలనలో సాగిన వివక్ష కొనసాగకూడదనే, ప్రజలు మార్పు కోరుకున్నారని మర్చిపోకూడదు. ఈ విషయాన్ని ఎంత అవగతం చేసుకుంటే, ప్రస్తుత ప్రభుత్వానికి అంత మంచిది! అదే బీఆర్​ఎస్​ పాలనలో ఆంధ్రా అధికారుల పెత్తనం కొనసాగినట్లే.. తామూ అదే ఆంధ్రా అధికారుల పెత్తనంతోనే పరిపాలన సాగిస్తామంటే మాత్రం కుదిరే పనికాదు! 

ప్రకటనలు ఇవ్వడంలో వివక్ష ఎందుకు?

వీ6  వెలుగు ఆదాయ మార్గాలను ఆనాడు  మూసేసే ప్రయత్నాలు చేసిన అప్పటి బీఆర్​ఎస్​ యజమానులకు, ఇప్పటి పాలకులకు ఉన్న తేడా ఏమిటో చెప్పగలమా? ఇప్పటి పాలకులు వీ6 వెలుగుకు అడ్వర్టైజ్​మెంట్లు ఇవ్వడంలో అంతుచిక్కని వివక్ష ఎందుకు చూపుతున్నట్లు? గత బీఆర్​ఎస్​ పాలనలో ఆంధ్రా అధికారులే రాజ్యమేలారు. ఇపుడు ఈ ప్రభుత్వంలోనూ అదే ఆంధ్రా అధికారులే రాజ్యమేలుతున్నారని చెప్పడానికి.. తెలంగాణ మీడియా పట్ల చూపుతున్న వివక్ష అందుకు సాక్ష్యం కాదా? గత ప్రభుత్వంలో ఎదుర్కొన్న  వివక్షలు, ఈ ప్రభుత్వంలోనూ ఎదుర్కోవలసి వస్తుందని నిజానికి ఎవరూ ఊహించి ఉండరు! ప్రజల పక్షాన నిలబడి ఒక ప్రభుత్వాన్నే మార్చగలిగిన వీ6 వెలుగు వంటి తెలంగాణ మీడియానే లేకపోతే.. తమ ప్రభుత్వమెక్కడిదో ప్రస్తుత పాలకులు అర్థం చేసుకోవాలి. తెలంగాణ  మీడియా పట్ల  వివక్షకు కారణాలేమిటో తెలుసుకొని సరిదిద్దుకుంటారా, లేదా? చూడాలి!

2012 నుంచి ఈరోజు వరకు వీ6లో రాత్రి 9.30 నిమిషాలకు వచ్చే  తీన్మార్​ వార్తలు చూశాకనే గ్రామాల్లో ప్రజలు పడుకుంటారు. రోజంతా జరిగిన వార్తలను తీన్మార్​ వార్తల్లో చూస్తేగానీ సంతృప్తిపడని తెలంగాణ ప్రేక్షకులే వీ6 చానెల్ ఆదరణకు తిరుగులేని కొలమానం! అలాంటి వీ6 చానెల్​ గొంతు నొక్కాలనే ప్రయత్నాలు నాటి ఉమ్మడి రాష్ట్రంలో జరగడం ఒక ఎత్తయితే, వచ్చిన తెలంగాణలోనూ అవే ప్రయత్నాలు జరగడం,  ఎంత దుర్మార్గమో వేరే చెప్పేదేముంది? ప్రభుత్వం మారినా, ప్రస్తుత ప్రభుత్వంలోనూ అపుడపుడు అలాంటి అనుభవాలే ఎదురవుతుండటం చూస్తే.. వీళ్లు సైతం  మారరా అనిపిస్తోంది! 

- కల్లూరి శ్రీనివాస్​రెడ్డి
పొలిటికల్​ ఎనలిస్ట్​