యువత ఆలోచన ఇది: లక్షల జీతం వద్దు.. ప్రభుత్వ ఉద్యోగమే కావాలి..

యువత ఆలోచన ఇది:  లక్షల జీతం వద్దు.. ప్రభుత్వ ఉద్యోగమే కావాలి..
  • లక్షల ప్యాకేజీకి నై సర్కారు కొలువుకే జై

  • ఏఈఈలుగా ఎంపికైన బిట్స్​ పిలానీ, నిట్, ఐఐటీ గ్రాడ్యుయేట్స్

  • ఇరిగేషన్, పంచాయతీరాజ్,ఆర్ అండ్ బీ శాఖల్లో కొలువులు

  • జాబ్​ సెక్యూరిటీ, ప్రజాసేవ చేసే అవకాశం ఉంటుందని సంతోషం

హైదరాబాద్, వెలుగు: బిట్స్ పిలానీ, ఎన్ఐటీ, ఐఐటీ, ఐఐఐటీలు దేశంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన ఎడ్యుకేషనల్​ ఇన్​స్టిట్యూషన్స్. ఇందులో ఇంజినీరింగ్ చదివే స్టూడెంట్స్​ చివరి ఏడాదిలో ఉన్నపుడే దేశ, విదేశాల్లో ప్రముఖ కంపెనీలు వచ్చి రూ. 15లక్షల నుంచి కోటికి పైగా ప్యాకేజ్ ఆఫర్ చేసి, రిక్రూట్ చేసుకుంటాయి. అయితే, ఆ లక్షల ప్యాకేజీని వద్దునుకొని ఇంజినీరింగ్​గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఇప్పుడు సర్కారు కొలువులవైపు చూస్తున్నారు. తాజాగా, టీజీపీఎస్సీ విడుదల చేసిన 1250 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ( ఏఈఈ ) సెలక్షన్ లిస్ట్ లో దాదాపు 261 మంది వాళ్లే ఉన్నారు. 

బిట్స్ పిలానీ, ఐఐటీ, ఐఐఐటీ, నిట్ , జేఎన్టీయూ, ఉస్మానియా, బాసర ఐఐఐటీ, ఇతర రాష్ట్రాల్లోని ప్రతిష్టాత్మక వర్సిటీలు, కాలేజీల్లో ఇంజినీరింగ్, ఎంటెక్ పూర్తి చేసినవారు ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఓ వైపు సివిల్స్, గేట్ కు ప్రిపేర్ అవుతూ.. ఏఈఈ పరీక్ష రాసి, సెలక్ట్ అయినవారు కూడా ఉన్నారు. వీరిని ఇరిగేషన్, మిషన్ భగీరథ, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ శాఖల్లో ఏఈఈలుగా కేటాయించారు. 

ఏఈఈలుగా జాయిన్ అయిన వాళ్లు రిటైర్ అయ్యే వరకు ఖాళీలు, రిజర్వేషన్ల ప్రకారం ఈఎన్సీ, సీఈల వరకు వెళ్లే అవకాశం ఉందని ఉన్నతాధికారులు చెబుతున్నారు.  వీరికి ప్రారంభ వేతనం రూ. 65 వేలు ఉంటుంది. ఇరిగేషన్‌‌ ఏఈఈలకు సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 26న అపాయింట్‌‌మెంట్‌‌ ఆర్డర్లు ఇచ్చారు. ఆర్‌‌‌‌ అండ్‌‌ బీ డిపార్ట్‌‌మెంట్‌‌లో వచ్చే నెల 2వ తేదీ ఇవ్వనున్నారు. త్వరలో పంచాయతీరాజ్‌‌, మిషన్‌‌ భగీరథ డిపార్ట్‌‌మెంట్లకు సెలక్ట్‌‌ అయిన వారికి అపాయింట్‌‌మెంట్‌‌ ఆర్డర్స్‌‌ ఇవ్వనున్నారు. 

జాబ్ సెక్యూరిటీ.. ప్రజాసేవ చేసే అవకాశం..

సర్కారు కొలువు అంటే 61 ఏండ్ల వరకు ఉద్యోగ భద్రత ఉంటుందని, హెచ్ఆర్ఏ, వెహికల్, ఈహెచ్ఎస్, డీఏతో పాటు ఎన్నో అలవెన్సులు ఉంటాయని, అందుకే సర్కారు కొలువులో జాయిన్ అయ్యేందుకు మొగ్గు చూపామని సెలక్ట్ అయిన ఏఈఈలు చెబుతున్నారు. సాఫ్ట్ వేర్ జాబ్ లో కోట్ల ప్యాకేజీ ఉన్నా పని ఒత్తిడి ఉంటుందని అంటున్నారు. 

ఒకవేళ ఆర్థిక మాంద్యం ఏర్పడితే ఉన్న జాబ్​ పోతుందని, జీవితమే డిస్టర్బ్​ అవుతుందని చెబుతున్నారు. ఒకవేళ ప్రస్తుతం చేస్తున్న కంపెనీలో పని నచ్చకుంటే వేరే కంపెనీలో చేరాలంటే 2 లేదా 3 నెలల ముందే నోటీసు పీరియడ్ ఇవ్వడం, ప్రాజెక్టులు, టార్గెట్లు వంటి ఎన్నో ఇబ్బందులు ఉంటాయని వివరిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగంలో టెన్షన్ ఉండదని, జాబ్ సెక్యూరిటీ ఉంటుందని చెబుతున్నారు. దీంతోపాటు ప్రజలకు నేరుగా సేవచేసే అవకాశం దక్కుతుందని, అందుకే లక్షల ప్యాకేజీలు వదిలి ప్రభుత్వ ఉద్యోగంలో చేరుతున్నామని అంటున్నారు.

గతంలోనూ ఎక్కువ మంది సెలెక్ట్​

గతంలోనూ టీఎస్ పీఎస్సీ నిర్వహించిన ఏఈఈ రిక్రూట్ మెంట్ లో ఉన్నత విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్​ పూర్తిచేసిన గ్రాడ్యుయేట్స్, పోస్ట్​గ్రాడ్యూయేట్స్ ఉన్నారని, అయితే ఈ సారి ఎక్కువమంది సెలెక్ట్​అయ్యారని 4 శాఖల ఉన్నతాధికారులు చెబుతున్నారు. ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఈ 4 శాఖల్లో క్షేత్రస్థాయిలో ఇరిగేషన్, ఆర్ అండ్ బీ , పంచాయతీ రాజ్ రోడ్స్, మిషన్ భగీరథలో పనిచేసే ఏఈఈ పోస్టులు భారీగా ఖాళీగా ఉన్నాయి. గతంలో రిటైర్ మెంట్ వయస్సు 58 ఏండ్లు ఉండగా.. గత ప్రభుత్వం 61 ఏండ్లకు పెంచింది. ఈ ఏజ్ కూడా పూర్తి కావడంతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రతి నెల అన్ని శాఖల్లో సుమారు 500 మంది ఉద్యోగులు, అధికారులు రిటైర్ అవుతున్నారు. 

ఈ నేపథ్యంలో 4 కీలక శాఖల్లో సుమారు 1200 మంది క్షేత్రస్థాయిలో వివిధ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం అయ్యేందుకు ఏఈఈలో విధుల్లో చేరుతుండడం మంచి పరిణామమని ఈఎన్సీలు చెబుతున్నారు. ప్రస్తుత బ్యాచ్ లో బాసర ఐఐఐటీ లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారు 100 మందికి పైగా ఉన్నారని, వీరు క్షేత్రస్థాయిలో మిషన్ భగీరథలో పనిచేస్తే గ్రామీణ వ్యవస్థ, ప్రజల స్థితిగతుల మీద వీరికి మంచి అవగాహన వస్తుందని అధికారులు చెబుతున్నారు. అలాగే, ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని అంటున్నారు.

ప్రభుత్వ సర్వీస్​లో చేరడం సంతోషంగా ఉంది 

ఐఐటీ ఖరగ్ పూర్ లో ఎంటెక్ సివిల్ పూర్తి చేశా. టీజీపీఎస్సీ రిలీజ్​చేసిన ఏఈఈ ఫలితాల్లో మున్సిపల్ డిపార్ట్ మెంట్ లో సెలెక్ట్ అయ్యా. ప్రభుత్వ సర్వీస్ లో చేరుతున్నందుకు సంతోషంగా ఉంది. మా క్యాంపస్ ప్లేస్ మెంట్స్​లో ఏడాదికి రూ.15 లక్షల నుంచి వార్షిక ప్యాకేజ్ తో ప్రముఖ కంపెనీలు జాబ్ ల్లో తీసుకున్నాయి. ప్రైవేట్ లో వేతనం ఎక్కువ ఉన్నా దానికి తగ్గట్టు వర్క్ ప్రెషర్, టెన్షన్స్ ఉంటయ్​. గవర్నమెంట్ సర్వీస్ లో అంత ఉండదు. ఇక్కడ పబ్లిక్ కు డైరెక్ట్​గా సేవచేసే అవకాశం ఉంటుంది.

ఇరిగేషన్ ఏఈఈగా సెలెక్ట్ అయ్యా..పోస్ట్ గ్రాడ్యుయేట్ (నల్గొండ)ఐఐటీ ఖరగ్ పూర్ 

ఐఐటీ నాగ్ పూర్ లో ఎంటెక్ పూర్తి చేశా. ఇరిగేషన్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్ మెంట్ లో జాబ్ చేయాలన్నది నా డ్రీమ్. నిరుడు యూపీలో కేంద్ర పోర్ట్ డిపార్ట్ మెంట్ శాఖలో గ్రౌండ్ వాటర్ లో జాబ్ చేశాను. ఇటీవల ఇరిగేషన్​ ఏఈఈగా సెలెక్ట్ అయ్యా. ఇరిగేషన్​కు సెలక్ట్ కావడం సంతోషంగా ఉంది. లక్షల ప్యాకేజీ కంటే నాకు నచ్చిన అంశంలో గవర్నమెంట్ సర్వీస్ లో చేరుతుండడం ఆనందంగా ఉంది. తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టులు, నీటి సరఫరా అంశాలపై అవగాహన పెంచుకుంటా. ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉంది. 


పంచాయతీరాజ్​లో ఏఈఈగా సెలెక్ట్​ అయ్యా..ఐఐటీ నాగ్ పూర్ , పోస్ట్​ గ్రాడ్యుయేట్ (జగిత్యాల) 

 గేట్​లో సెలెక్ట్​ అయ్యా. అయితే, ప్రజలకు సేవ చేసేందుకు సివిల్స్​రాయాలని నిర్ణయించుకున్నా. ఢిల్లీలో కోచింగ్ తీసుకొని, రెండుసార్లు సివిల్స్​రాశా. 2 మార్కులతో ప్రిలిమ్స్ మిస్ అయింది. టీజీపీఎస్సీలో ఏఈఈ నోటిఫికేషన్ రావడంతో ప్రిపేర్​ అయ్యా.పంచాయతీరాజ్​లో ఏఈఈగా సెలెక్ట్​ అయ్యా. మా నాన్న ప్రభుత్వ సర్వీస్ లో ఉన్నారు. ఇప్పుడు నేను కూడా ప్రజలకు దగ్గరగా ఉండే పంచాయతీరాజ్ డిపార్ట్ మెంట్​లో ఏఈఈగా సెలెక్ట్​ కావడం ఆనందంగా ఉంది. సాఫ్ట్​వేర్​జాబ్​లో టెన్షన్స్​ఉంటయ్. కానీ సర్కారు కొలువులో జాబ్​సెక్యూరిటీతోపాటు ప్రజలకు నేరుగా సేవ చేయొచ్చు. 

- సివిల్స్​క్యాండిడేట్​(వికారాబాద్)