
జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కోవాలి. ఒకవేళ ఎదుర్కోలేం అనిపిస్తే ఆ సమస్యల గురించి ఆలోచించకుండా విడిచిపెట్టేయాలి. అంతేకాని ఆ సమస్యల ఆలోచనలతో సహజీవనం చేయకూడదు అంటాడు ఓ తత్త్వవేత్త.
సమస్యలను ఎదుర్కొంటూ మొదటి మెట్టు ఎక్కితేనే కదా చివరి మెట్టుకు చేరుకోగలిగేది అని అర్థం చేసుకోవాలి. భగవంతుడు మనుషులతో పాటు సమస్యలను కూడా సృష్టించాడు. ఆ సమస్యలను ఎదుర్కొనే మనోధైర్యాన్ని మనకు మనంగా తెచ్చుకోవాలి. ఒకరు చెప్తే వచ్చేది కాదు మనోధైర్యం. కొన్ని కోట్ల మానవ మనస్తత్వాలను ఈ భూమ్మీద చూస్తుంటాం. కొందరు ఏ సమస్య వచ్చి నెత్తి మీద పిడుగులా పడుతున్నా చెక్కుచెదరకుండా, ఆత్మస్థయిర్యంతో ఆ సమస్యను తృణప్రాయంగా తీసి పక్కన పడేస్తారు. మరికొందరు ఏ చిన్నపాటి సమస్య ఎదురైనా దానిని భూతద్దంలో చూసి...పరిష్కారం కోసం ప్రయత్నించకుండా, ఆ సమస్యతో సహజీవనం చేస్తూ, చివరకు ప్రాణాలు తీసుకునేదాకా తెచ్చుకుంటారు.
ఉపాయంతో...
సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి అనేదానికి పంచతంత్రంలో అనేక కథలు మనకు ఉదాహరణగా నిలుస్తాయి. ఒకసారి కొన్ని పక్షులు గింజల కోసం బయల్దేరాయి. ఆకాశమార్గంలో విహరిస్తూ, నేల మీద తమ తిండి కోసం చూస్తున్నాయి. ఒకచోట చాలా గింజలు కనిపించాయి. వెంటనే ఆ పక్షులలో ఒక చిన్న పక్షి, ఉత్సాహంగా కిందకు దిగింది. అలా అన్ని పక్షులూ గింజల మీద వాలాయి. ఆ గింజల మీదకు బోయవాడు వల పన్నినట్లు అవి గమనించలేకపోయాయి. ఏమైతేనేం అన్ని పక్షులు ఆ వలలో చిక్కుకున్నాయి. సమస్యకు భయపడకుండా ఉపాయంతో తప్పించుకోవాలనుకున్నాయి. ‘బోయవాడు వచ్చి చెట్టుకి కట్టిన తాడు విప్పగానే మనమందరం కలిసి ఈ వలతో సహా ఎగిరిపోదాం. ఎవరైనా స్నేహితుడి ద్వారా వల నుండి బయటపడదాం’ అని ఒక పక్షి చెప్పిన ఉపాయంతో పక్షులన్నీ ఒక్కసారిగా ఎగిరిపోయి, ఎలుక సాయంతో వల నుంచి బయటకు వచ్చాయి.
ఒకసారి ఆలోచించుకోవాలి
సమస్యతో కలిసి జీవించటం అసాధ్యం. ఒక పక్షి చేసిన ఆలోచన వల్ల సమస్య పరిష్కారమైంది. సమస్య వచ్చింది కదా అని నిరాశతో, దుఃఖంతో ఏమీ ఆలోచించకుండా ఉంటే, పక్షులన్నీ ప్రాణాలు పోగొట్టుకోవలసి వచ్చేది. చాలామంది ఏ చిన్న సమస్య వచ్చినా, వెంటనే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటారు. దాని వల్ల మనం ఏం సాధిస్తాం అని ఒకసారి ఆలోచించుకోవాలి. ఎంతో పుణ్యం చేస్తేనే గానీ మానవ జన్మ లభించదని, ‘జంతూనాం నరజన్మ దుర్లభం’ అని చెప్తారు పెద్దలు. అంతటి ఉత్కృష్టమైన జన్మ లభించినప్పుడు ఆ జన్మలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనే శక్తిని మనం సంపాదించుకోవాలి అంటారు పండితులు.
పరిష్కారం అన్వేషించాలి
శ్రీకృష్ణదేవరాయలకు తెనాలి రామకృష్ణతో పాటు మంత్రి అయిన అప్పాజీ సలహాలు ఇచ్చి సమస్యలు పరిష్కరించారు. మౌర్య చంద్రగుప్తునికి చాణుక్యుడు సూచించిన సలహాలు సమస్యల వలయం నుండి బయటపడేందుకు సాయపడ్డాయి.
ధర్మరాజాదులు అరణ్యవాసంలో ఉన్న సందర్భంలో చెప్పరానన్ని కష్టాలు, సమస్యలు ఎదుర్కొన్నారు. మార్కండేయ మహర్షి వంటి ధర్మాత్ములతో ప్రసంగించి, సమస్యలకు పరిష్కారం తెలుసుకున్నారు. రామాయణంలో సుగ్రీవుడు తన అన్నగారైన వాలి నుంచి ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాడు. రాముడి సాయంతో సమస్యను అధిగమించాడు.
సీతమ్మను వెతకడానికి బయలుదేరిన హనుమంతుడికి అడుగడుగునా సమస్యలు ఎదురవుతూనే వచ్చాయి. అన్నిటినీ తన ఆలోచనతో ఎదుర్కొంటూ ముందుకు సాగాడు. సీతమ్మ కనిపించకపోవటంతో ఆత్మహత్య చేసుకునే స్థితికి కూడా చేరుకుంటాడు. అంతలోనే మరో ఆలోచన తన మెదడులోకి ప్రవేశించటంతో, ఆ ప్రయత్నం విరమించుకుని, సీతమ్మ జాడ తెలుసుకున్నాడు. శ్రీరాముడు లంకకు చేరుకోవటానికి సముద్రం ఏ విధంగా దాటాలా అని ఆలోచించాడే కానీ, ‘ఈ సముద్రం దాటలేను, జానకిని ఇక చూడలేను’ అనుకోలేదు. వానరుల సాయంతో వారధి నిర్మించి, తన సమస్య పరిష్కరించుకున్నాడు.
ఎప్పుడైనా మనకు సమస్య రాగానే, మన కంటే ఎక్కువ సమస్యల్లో ఉన్నవారిని తలచుకుని, మనకు వచ్చింది చిన్న సమస్యే కదా అనుకోవటం మొట్టమొదటి పరిష్కారం. సమస్య ఎదురవ్వగానే దానికి భయపడకుండా, జ్ఞాన సంపన్నులను సంప్రదించి పరిష్కార మార్గం అన్వేషించాలి.
- డా. వైజయంతి పురాణపండ
ఫోన్: 80085 51232