
నేనే ఊర్లకు వస్త..ప్రగతిని చూస్త
సహకారం అందిస్తున్నం.. పల్లెలు బాగుపడి తీరాలె
త్వరలో పట్టణ ప్రగతిని ప్రారంభిస్తం
పల్లెలు, పట్టణాలు బాగుండాలన్నదే
సర్కారు సంకల్పం ప్రతి రోజు గ్రామాల్లో ఏం జరగాలో అన్నీ జరగాలె
పల్లె ప్రగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్, వెలుగు: పల్లె ప్రగతి ప్రోగ్రాం అమలవుతున్న తీరు, అధికారులు, ప్రజాప్రతినిధులు తమ పరిధిలో ఎలా విధులు నిర్వహిస్తున్నారనే విషయం ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు తాను త్వరలో గ్రామాల్లో ఆకస్మిక పర్యటనలు చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ‘‘జనం అయితే పల్లెల్లో, లేకుంటే పట్టణాల్లో నివసిస్తరు. ఈ రెండు చోట్లు బాగుంటే అంతా బాగున్నట్టే. పల్లెలు, పట్టణాలు బాగుండాలని ప్రభుత్వం సంకల్పించింది. ముందుగా పల్లెప్రగతి కార్యక్రమం చేపట్టింది. పంచాయతీ రాజ్ శాఖలో ఖాళీలన్నీ భర్తీ చేసినం. ప్రతీ గ్రామానికీ గ్రామ కార్యదర్శిని నియమించినం. పంచాయతీ సిబ్బంది వేతనాలు పెంచినం. ప్రతీ నెలా రూ.339 కోట్ల చొప్పున విడుదల చేస్తున్నం. ప్రభుత్వం ఇన్ని రకాలుగా సహకారం, ప్రేరణ అందిస్తున్నప్పటికీ పల్లెలు బాగుపడకుంటే ఎలా? కచ్చితంగా బాగుపడి తీరాలె’’అని సీఎం స్పష్టం చేశారు. ఆదివారం పల్లెప్రగతి పురోగతిపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష చేశారు. గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతతో వెల్లివిరియాలనే లక్ష్యంతో చేపట్టిన పల్లె ప్రగతి పకడ్బందీగా జరగాలని ఆదేశించారు. ‘‘ప్రతీ గ్రామానికి నర్సరీ ఏర్పాటు చేసినం. విధిగా అన్ని చోట్లా మొక్కలు పెంచాలె. గ్రామాన్ని శుభ్రంగా ఉంచడానికి ప్రతీ రోజు వీధులు ఊడ్చాలె. మోరీలు శుభ్రం చేయాలె. కొన్ని రోజులు చేసి చేతులు దులుపుకోవడం కాదు. ప్రతి రోజు గ్రామాల్లో ఏం జరగాలో అవన్నీ జరగాలె’’అని ఆదేశించారు. పల్లె ప్రగతి కార్యక్రమం స్ఫూర్తితో త్వరలోనే పట్టణ ప్రగతి ప్రారంభించనున్నట్లు సీఎం ప్రకటించారు.
పోజులు కాదు.. పనులు కావాలె
కొందరు మంత్రులు, కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు తామే గ్రామాన్ని ఊడ్చినట్లు పేపర్లో ప్రచారం కోసం ఫొటోలకు పోజులిస్తున్నారని, ఇది సరైంది కాదని సీఎం అన్నారు. వారంతా ఉన్నది చీపిరి పట్టి ఊడ్వడానికి కాదని, గ్రామాల్లో ఎవరి పని వారితో చేయించడానికి అని స్పష్టం చేశారు. ఫొటోలకు పోజులివ్వడం కాకుండా, చిత్తశుద్ధితో పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంచేలా పని చేయించాలని సూచించారు. పల్లె ప్రగతి పురోగతి, పనుల తీరు, ఎవరెవరు బాధ్యతలు సరిగ్గా నిర్వహిస్తున్నారనే విషయాలు పరిశీలించడానికి తానే స్వయంగా త్వరలో గ్రామాల్లో ఆకస్మిక పర్యటనలు చేస్తానని చెప్పారు. ఈ సమీక్షలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, అటవీశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ తివారీ, పంచాయతీ రాజ్ కమిషనర్ రఘునందన్ రావు, పీసీసీఎఫ్ శోభ, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి, ఓఎస్టీ ప్రియాంకా వర్గీస్ తదితరులు పాల్గొన్నారు.
పల్లె ప్రగతి పురోగతి ఇదీ
పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాల్లో జరిగిన పనులను ఈ సమావేశంలో సీఎంకు అధికారులు వివరించారు.
12,705 గ్రామాల్లో నర్సరీల ఏర్పాటు.
ఇప్పటికి 6,017 ట్రాక్టర్ల కొనుగోలు. మరో 4,534 ట్రాక్టర్లకు ఆర్డర్.
గ్రామాల్లో 10.78 కోట్ల మొక్కలు నాటారు. వాటిలో 84% బతికాయి.
76,562 కిలోమీటర్ల మేర వీధులను శుభ్రం చేశారు. 62,976 కిలోమీటర్ల మేర మురికి కాల్వలను శుభ్రం చేశారు.
1,24,655 చోట్ల పొదలు, తుప్పలు, మురికి తుమ్మలను తొలగించారు.
56,213 చోట్ల ఖాళీ ప్రదేశాలు, కామన్ ఏరియాలను శుభ్రం చేశారు.
9,954 పాత, పనిచేయని బోర్ల మూసివేత.
1,13,881 చోట్ల నీరు నిల్వ ఉండే బొందలను పూడ్చివేశారు.56,050 చోట్ల రోడ్ల గుంతలను పూడ్చి వేశారు.
67,245 చోట్ల ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాలను శుభ్రం చేశారు.
మార్కెట్లు, సంతలు నిర్వహించే 6,500 ప్రదేశాలను శుభ్రపరిచారు.
బస్తీ దవాఖాన్లు 350కి పెంచాలె
హైదరాబాద్‌లో పేదలకు వైద్యసేవలు అందిస్తున్న బస్తీ దవాఖాన్ల సంఖ్యను 350 వరకు పెంచాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న 118 బస్తీ దవాఖానాలు బాగా పనిచేస్తున్నాయని, ప్రజలు వీటితో ఎంతో సంతృప్తిగా ఉన్నారని, వీటి సంఖ్యను గణనీయంగా పెంచాలని చెప్పారు. ‘‘నగరంలోని 150 డివిజన్లలో ప్రతి డివిజన్ లో రెండు బస్తీ దవాఖాన్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, పేదలు నివసించే బస్తీలు, కాలనీల్లో ఎక్కువ దవాఖాన్లు ఏర్పాటు చేయాలి. రాబోయే నెల రోజుల్లోనే కొత్త బస్తీ దవాఖాన్లు ప్రారంభించాలి”అని అధికారులకు సీఎం సూచించారు.