ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇవ్వొద్దు.. సీపీఐకి మాలమహానాడు విజ్ఞప్తి

ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇవ్వొద్దు.. సీపీఐకి మాలమహానాడు విజ్ఞప్తి

న్యూఢిల్లీ, వెలుగు: ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇవ్వద్దని సీపీఐ నేషనల్ జనరల్ సెక్రటరీ డి.రాజాకు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య విజ్ఞప్తి చేశారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే పలు  పార్టీలు ఎస్సీ వర్గీకరణ డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు శనివారం చెన్నయ్య ఢిల్లీలో  రాజాను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉషా మెహ్రా కమిషన్ పేర్కొన్నట్లు తెలంగాణలో మాల, మాదిగల్లో ఎవరు అభివృద్ధి చెందారో స్టడీ చేసేందుకు జ్యూడిషీయల్ కమిషన్ వేయాలని డిమాండ్ చేశారు. అలాగే జనాభాకు అనుగుణంగా ఎస్సీ రిజర్వేషన్లను 20 శాతానికి పెంచాలన్నారు.

కాలం చెల్లిన వర్గీకరణ డిమాండ్ ను పక్కన పెట్టి అంబేద్కర్ కలలుకన్న రాజ్యాధికారం కోసం కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ మాట్లాడుతూ..ఎస్సీ వర్గీకరణ పేరుతో మాల, మాదిగల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. తద్వారా  రాజ్యాధికారం అనే లక్ష్యానికి బీసీలను దూరం చేస్తున్నారని విమర్శించారు. తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీలపై ఇంకా అనేక దాడులు, హత్యలు జరుగుతున్నాయని చెప్పారు. గతంలో యూపీఏ, బీజేపీలు అధికారంలో ఉన్నా ఎందుకు వర్గీకరణ చేయలేదో ఎస్సీ సోదరులు ఆలోచించాలని చెన్నయ్య అన్నారు.