ఒమిక్రాన్​ను తక్కువ అంచనా వేయొద్దు

ఒమిక్రాన్​ను తక్కువ అంచనా వేయొద్దు

న్యూఢిల్లీ: ఒమిక్రాన్.. చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వేరియంట్. అయితే సింప్టమ్స్‌‌ తక్కువగా ఉంటున్నాయి. ఆస్పత్రికి వెళ్లే అవసరం తక్కువగా ఉంటోంది. దీంతో ఒమిక్రాన్ అనేది ‘నేచురల్ వ్యాక్సిన్’ లాంటిదని ప్రపంచవ్యాప్తంగా కొందరు సైంటిస్టులు అంటున్నారు. కరోనా ‘ఎండెమిక్’ స్థాయికి చేరేందుకు కొత్త వేరియంట్ సాయపడొచ్చని చెబుతున్నారు. మొన్న మహారాష్ట్ర హెల్త్ ఆఫీసర్ కూడా ఇలాంటి కామెంట్లే చేశారు. కానీ ఇలా చెప్పడాన్ని వైరాలజిస్టులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ప్రమాదకర ఐడియా
‘‘ఒమిక్రాన్.. సహజ వ్యాక్సిన్ అనేది చాలా ప్రమాదకర ఐడియా. బాధ్యతలేని వ్యక్తులే ఇలాంటివి స్ప్రెడ్ చేస్తున్నారు. ‘లాంగ్ కొవిడ్’ పర్యవసానాలు ఎలా ఉంటాయో ఎవరికీ స్పష్టంగా తెలియదు” అని ఇండియన్ సార్స్ కోవ్‌‌2 జీనోమిక్స్ కన్సార్షయా (ఇన్సాకాగ్) అడ్వైజరీ గ్రూప్ మాజీ చీఫ్, వైరాలజిస్ట్ 
షాహిద్ జమీల్ అన్నారు.  
సహజ ఇన్ఫెక్షన్.. కాపాడదు..
‘‘మైల్డ్ ఒమిక్రాన్ అనేది వ్యాక్సిన్ కాదు. ఈ వేరియంట్ వల్ల కూడా ఆస్పత్రుల్లో చేరుతున్నారు, చనిపోతున్నారు. వ్యాక్సిన్‌‌తో పోల్చుకుంటే.. సహజ ఇన్ఫెక్షన్ అనేది ఏ వేరియంట్ నుంచి కాపాడలేదు” అని ప్రొఫెసర్ గిరిధార ఆర్.బాబు చెప్పారు.
జాగ్రత్తగా ఉండాలె
కరోనా వల్ల దీర్ఘకాలంలో ప్రభావాలు ఉండొచ్చని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఉజాల సిగ్నస్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఫౌండర్ శుచిన్ బజాజ్ సూచించారు. ‘‘మైల్డ్ సింప్టమ్స్‌‌ తర్వాత.. కీలక అవయవాల్లో 6 నెలలకంటే ఎక్కువ కాలం వైరస్ ఉంటుందని తేలింది. పోస్ట్ కొవిడ్ సమస్యలతో బాధపడుతున్న వాళ్లను, లాంగ్ కొవిడ్ పేషెంట్లను చూస్తున్నాం. ఒమిక్రాన్‌‌ వల్ల ఐసీయూల్లో చేరుతున్న వాళ్లూ ఉన్నారు. దాన్ని సహజ వ్యాక్సిన్‌‌లా భావించొద్దు” అని అన్నారు.