
- రెడ్డి సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సవాల్
- భవిష్యత్తు మొత్తం బీసీలదే అని కామెంట్
ఖైరతాబాద్, వెలుగు: అగ్రకులాల ఓట్లు తనకు వద్దని.. బీసీల ఓట్లు మాకొద్దంటూ అగ్రకులాల వాళ్లు చెప్పగలరా? అని.. రెడ్డి సామాజికవర్గానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సవాల్ విసిరారు. రాష్ట్రంలోని బీసీలంతా ఏకం అయ్యారని తెలిపారు.. బీసీ సమాజ్ ఆధ్వర్యంలో ‘బీసీ బాంధవుల ఆత్మీయ రౌండ్ టేబుల్ సమావేశం’ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం జరిగింది. సంగెం సూర్యారావు ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్‌కు రవికుమార్ ప్రజాపతి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హాజరై మాట్లాడారు.
‘‘భవిష్యత్తులో బీసీలకే ఉన్నత పదవులు లభిస్తాయి. అగ్రకులాల వాళ్లు గడ్డుపరిస్థితులు ఎదుర్కొంటారు. ఎన్నికలు ఏవైనా.. బీసీల ఓట్లే కీలకమనే విషయం నేతలందరూ గుర్తుపెట్టుకోవాలి. త్వరలో బాంబులాంటి వార్త బయటకు వస్తదని ఓ మంత్రి ప్రకటించారు. 2028 నాటికి హిరోషిమా కంటే పవర్ ఫుల్ బాంబు పేల్తది. రానున్న టీచర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలే గెలుస్తరు’’అని తీన్మార్ మల్లన్న ధీమా వ్యక్తం చేశారు. బీసీ రాజకీయ చైతన్య వేదిక, బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నవంబర్ 3న మిర్యాలగూడలో బీసీ గర్జన సభ జరుగుతుందన్నారు. బీసీలందరూ ఈ సభకు హాజరుకావాలని కోరారు. అనంతరం సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. సదస్సులో పలు బీసీ కుల సంఘాల నేతలు పాల్గొని మాట్లాడారు.