‘కామన్​ రిక్రూట్​మెంట్ బోర్డు బిల్లు’పై మంత్రి సబితను ప్రశ్నించిన గవర్నర్

‘కామన్​ రిక్రూట్​మెంట్ బోర్డు బిల్లు’పై మంత్రి సబితను ప్రశ్నించిన గవర్నర్

రాజ్​భవన్​లో గవర్నర్​తో సమావేశమైన మంత్రి, అధికారులు

హైదరాబాద్​, వెలుగు: ‘యూనివర్సిటీస్​ కామన్​ రిక్రూట్​మెంట్​ బోర్డు’ ద్వారా చేపట్టబోయే నియామకాల్లో రిజర్వేషన్లు అమలు చేస్తున్నారా? రూల్స్​ పాటిస్తున్నారా? అని మంత్రి సబితా ఇంద్రారెడ్డిని గవర్నర్​ తమిళిసై ప్రశ్నించారు. వీలైనంత త్వరగా నిష్పక్షపాత పద్ధతిలో నియామకాలు చేపట్టాలన్నదే తన ఉద్దేశమని చెప్పారు. శుక్రవారం రాజ్​భవన్​లో గవర్నర్​ తమిళిసైతో ‘కామన్​ రిక్రూట్​మెంట్​ బోర్డు బిల్లు’పై విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉన్నతాధికారులు చర్చించారు. 

రిజర్వేషన్లు, రూల్స్​ పాటిస్తున్నరా?

ఈ సందర్భంగా గవర్నర్​ తమిళిసై.. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, ప్రయోజనాల నేపథ్యంలోనే కామన్​ రిక్రూట్​మెంట్​ బోర్డు బిల్లుపై సందేహాలు వ్యక్తం చేసినట్లు తెలిపారు. నియామకాల్లో రిజర్వేషన్ల అమలు, యూజీసీ నిబంధనలు పాటిస్తున్నారా ? లేదా ? సెలక్షన్​ ప్రాసెస్​, న్యాయపరమైన ఇబ్బందులపై మంత్రిని, అధికారులను అడిగి తెలుసుకున్నారు. అర్హత ఆధారంగానే నియామకాలు ఉండాలని స్పష్టం చేశారు. ఫ్యాకల్టీ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి యూజీసీ నిబంధనలను కచ్చితంగా పాటించాలని గవర్నర్​ స్పష్టం చేసినట్లు రాజ్​భవన్​ ఒక ప్రకటనలో వెల్లడించింది. వివిధ వర్గాల నుంచి వస్తున్న ఆందోళనలను పరిష్కరించడం అవసరమని గవర్నర్​ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ హాస్టళ్లను మెరుగుపర్చడం, విద్యా సంస్థల్లో ల్యాబొరేటరీ సౌకర్యాల పెంపుపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. యూనివర్సిటీల్లో లైబ్రరీ సౌకర్యాలు, డిజిటల్‌ వనరులు, ఇతర మౌళిక సదుపాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. యూనివర్సిటీల అభివృద్ధి కోసం  పూర్వ విద్యార్థుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో మంత్రితోపాటు విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్​ చైర్మన్ ప్రొఫెసర్​ ఆర్. లింబాద్రి, కాలేజియేట్​ ఎడ్యుకేషన్​ కమిషనర్​ నవీన్ మిట్టల్​ పాల్గొన్నారు.