మోడీకి రావణుడిలా 100 తలలు ఉన్నాయా?: ఖర్గే

మోడీకి రావణుడిలా 100 తలలు ఉన్నాయా?: ఖర్గే

ప్రధాని నరేంద్ర మోడీని రావణాసురుడితో పోలుస్తూ కాంగ్రెస్​ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు గుజరాత్​ రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించాయి. ఆయన వ్యాఖ్యలను కమలనాథులు తప్పుబట్టారు. గుజరాత్ పుత్రుడిని కాంగ్రెస్ అవమానిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అహ్మదాబాద్‌లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు.

కార్పొరేషన్​ ఎన్నికల నుంచి ఎమ్మెల్యే ఎలక్షన్లు, ఎంపీ ఎన్నికలు ఎక్కడ చూసినా ప్రధాని ప్రచారం చేసుకుంటూనే ఉంటారని మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ఓటర్లు అందర్నీ పక్కనపెట్టి తనని చూసి ఓటేయమని ఆయన పదేపదే చెబుతుంటారని విమర్శించారు. అభ్యర్థుల ప్రస్తావన ఉండదు. ఎన్నిసార్లు మేము మిమ్మల్ని చూడాలి..? మీకు ఎన్ని రూపాలున్నాయి..? మీకు రావణుడిలా 100 తలలు ఉన్నాయా..? అని ఖర్గే ప్రశ్నించడంతో ఎన్నికల ప్రచార సభలో నవ్వులు వెల్లివిరిసాయి. 

ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోడీ పేరుతో ఓట్లు అడగటం చూస్తున్నానని..ఇప్పుడు గుజరాత్​లో అభ్యర్థి పేరుతో ఓట్లు అడగాలని సూచించారు. మోడీ వచ్చి మున్సిపాలిటీకి పని చేస్తారా..? అని ప్రశ్నించారు. ప్రజలకు అవసరమైన సమయంలో మోడీ మీకు సహాయం చేస్తారా అని ప్రశ్నించారు.

గుజరాత్ ఎన్నికల వేడిని తట్టుకోలేకనే కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే మాట తూలారని, ప్రధానమంత్రిని రావణునితో పోల్చారని అమిత్ మాలవీయ ట్వీట్‌లో ఖండించారు. ఖర్గే మాట్లాడిన వీడియోను కూడా షేర్ చేశారు. 'మౌత్ కా సౌదాగర్' నుంచి 'రావణ్' వరకూ కాంగ్రెస్ అనేక సార్లు విమర్శలు చేస్తూ గుజరాత్‌ను, గుజరాత్ పుత్రుడిని పదేపదే అవమానిస్తోందని అన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ 1,5 తేదీల్లో జరగనున్నాయి. డిసెంబర్ 8న ఫలితాలు వెలువడుతాయి.