హామీలపై ప్రశ్నించే దమ్ము లేదా.. ? : వైఎస్​ షర్మిల

హామీలపై ప్రశ్నించే దమ్ము లేదా.. ? : వైఎస్​ షర్మిల

గోదావరిఖని, వెలుగు: ప్రధాని మోడీ రామగుండం పర్యటనకు వస్తుంటే.. సీఎం కేసీఆర్​ పిల్లిలా దాక్కుంటున్నారని వైఎస్సార్​టీపీ అధ్యక్షురాలు షర్మిల ఎద్దేవా చేశారు. ఆయనకు ఎదురెళ్లి రాష్ట్రంలో పరిష్కరించాల్సిన సమస్యలు, విభజన హామీల గురించి ప్రశ్నించకుండా తప్పించుకుని తిరుగుతున్నారని విమర్శించారు. గురువారం సాయంత్రం ప్రజా ప్రస్థానం పాదయాత్ర మంచిర్యాల జిల్లాలోని ఇందారం గ్రామం నుంచి గోదావరి నది మీదుగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చేరుకున్నది. ఈ సందర్భంగా పట్టణంలోని చౌరస్తాలో ప్రజలనుద్దేశించి ఆమె మాట్లాడారు. ‘‘గతంలో మోడీ, కేసీఆర్​ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. కానీ ఇప్పుడు ఆర్​ఎఫ్​సీఎల్​ ప్లాంట్​ను జాతికి అంకితం చేయడానికి మోడీ రామగుండం వస్తుంటే.. ఆయన్ను కలిసే దమ్ము కేసీఆర్​కు​ లేకుండా పోయింది. మోడీ ఎప్పుడొచ్చినా తప్పించుకుని తిరుగుతున్నడు. ప్రధానిని కలవకపోతే సమస్యలు ఎట్ల సాల్వ్​ అవుతాయి..”అని షర్మిల ప్రశ్నించారు.  

ప్రజలే బుద్ధి చెప్పాలి

కేసీఆర్‌‌‌‌ను నమ్ముకుంటే రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేస్తారని, రాబోయే ఎన్నికల్లో కేసీఆర్‌‌‌‌, టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పార్టీ అధికారంలోకి రాకుండా కర్రు కాల్చి వాత పెట్టాలని ఆమె ప్రజలను కోరారు. వరి వేస్తే ఉరి అన్న సీఎం కేసీఆర్‌‌‌‌కు సీఎం పదవి సరిపోదని పీఎం కావాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఒకప్పుడు వెహికల్​ కూడా కొనలేని కేసీఆర్​కు.. బుల్లెట్​ ప్రూఫ్​ బాత్​రూమ్​ ఉందని ఆరోపించారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌‌‌‌ ఒక రాజకీయ వ్యభిచారి అని మండిపడ్డారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి అభివృద్ధి కోసం టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌లో చేరుతున్నానని చెప్పి తానే అభివృద్ధి చెందుతున్నాడని ఆరోపించారు. 

ఎన్నికలొస్తేనే బయటికొస్తరు 

జైపూర్, వెలుగు: సీఎం కేసీఆర్ ఎన్నికలు వచ్చినప్పుడే బయటికి వస్తారని, ఓట్లు వేయించుకుని మళ్లీ ఫాం హౌస్ వెళ్లిపోతారని షర్మిల విమర్శించారు. గాడిదకు రంగు పూసి ఇదే ఆవు అని నమ్మిస్తారని ఎద్దేవా చేశారు. ఇందారంలో నిర్వహించిన సభలో ఆమె మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న దళిత బంధు స్కీం ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధుల బంధుగా మారిందని ఆరోపించారు.