
గూగుల్ అంటే కేవలం సెర్చ్ ఇంజిన్ మాత్రమే కాదు. మ్యాప్స్ నుంచి పేమెంట్స్ వరకూ.. న్యూస్ నుంచి ట్రాన్స్‌లేషన్ వరకూ గూగుల్ చేయని పనంటూ లేదు. మొబైల్ వాడే ప్రతి ఒక్కరి జీవితంలో గూగుల్ కూడా భాగమైపోయింది. అయితే గూగుల్‌కి సంబంధించి సుమారు 70కి పైగా టూల్స్ ఉన్నాయని చాలామందికి తెలియదు. షాపింగ్ చేసేందుకు, పాటలు సెర్చ్ చేసేందుకు, వర్చువల్ టూర్స్‌కు.. ఇలా గూగుల్ ప్రొడక్ట్స్‌లో యూజ్‌ఫుల్ టూల్స్ చాలానే ఉన్నాయి. వాటిలో కొన్ని ఇవి.
ఎక్స్‌ప్రెస్
షాపింగ్ అనగానే అందరికీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటివే గుర్తొస్తాయి. కానీ, గూగుల్ ఎక్స్‌ప్రెస్ లేదా గూగుల్ షాపింగ్ టూల్స్ ద్వారా కూడా రకరకాల ప్రొడక్ట్స్ షాపింగ్ చేయొచ్చు. అయితే ఇది డైరెక్ట్ ఇ–కామర్స్ టూల్ కాదు. ఇందులో రకరకాల ప్రొడక్ట్స్‌కు సంబంధించిన వివరాలు, ఏ ప్రొడక్ట్ ఎక్కడ తక్కువ ధరకు దొరుకుతుంది? ఏయే స్టోర్స్, ఆన్ లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో ఉంది? అన్న వివరాలు తెలుసుకోవచ్చు. డీల్ నచ్చితే ఆయా సైట్స్‌కు రీడైరెక్ట్ అయి షాపింగ్ చేయొచ్చు.
స్కాలర్
ఏదైనా విషయంపై లోతుగా రీసెర్చ్ చేయాలనుకునేవాళ్లకు గూగుల్ స్కాలర్ టూల్ చాలా సాయం చేస్తుంది. ఇందులో రకరకాల అంశాలపై చేసిన రీసెర్చ్ వివరాలు, ఆర్టికల్స్, బుక్స్, పబ్లికేషన్స్, కోర్ట్ జడ్జిమెంట్స్, ఎక్స్‌పర్ట్స్ ఒపీనియన్స్ లాంటివి ఉంటాయి. ఈ టూల్‌ను రీసెర్చ్ స్కాలర్స్ కోసం డెవలప్ చేసినా.. మిగతావాళ్లకు కూడా చాలా ఉపయోగకరం.
సౌండ్ సెర్చ్
పక్కన ఏదైనా సాంగ్ లేదా మ్యూజిక్ వినిపిస్తున్నప్పుడు ఆ మ్యూజిక్ ఎందులోదో తెలుసుకోవాలి అనిపిస్తుంది. అలాంటప్పుడు గూగుల్ సౌండ్ సెర్చ్ అనే టూల్ ద్వారా సెర్చ్ చేస్తే.. దానికి సంబంధించిన వివరాలు తెలిసిపోతాయి. తెలియని పాటలను గుర్తించడానికి ఈ టూల్ ఉపయోగపడుతుంది.
డిజిటల్ గ్యారేజ్
ఉద్యోగాలు చేసేవాళ్లు లేదా బిజినెస్ చేసేవాళ్లు తమ కెరీర్ బూస్ట్ చేసుకోవాలంటే కొత్తగా వస్తున్న డిజిటల్ స్కిల్స్ నేర్చుకోక తప్పదు. దానికోసం గుగూల్ డిజిటల్ గ్యారేజ్‌ను వాడుకోవచ్చు. ఇందులో డిజిటల్ మార్కెటింగ్, ఆన్‌లైన్ సెక్యూరిటీ, అడ్వర్టైజింగ్ లాంటి బేసిక్ కోర్సులతో పాటు కోడింగ్ లాంటి అడ్వాన్స్‌డ్ కోర్సులు కూడా అందుబాటులో ఉంటాయి. ఇందులో ఫ్రీగానే రకరకాల కోర్సులు నేర్చుకుని గూగుల్ నుంచి సర్టిఫికెట్ కూడా పొందొచ్చు.
ఎక్స్‌పెడిషన్స్
గూగుల్ ఎక్స్‌పెడిషన్స్ అనే టూల్ ద్వారా ప్రపంచంలోని రకరకాల హిస్టారికల్ ప్లేసులను, నేషనల్ పార్కులను వర్చువల్‌గా విజిట్ చేయొచ్చు. అంతేకాదు, ఈ టూల్‌తో సైన్స్, ఆర్ట్స్, జాగ్రఫీ, హిస్టరీ, యానిమల్స్, నేచర్... వంటి ఎన్నో విషయాలను ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. రకరకాల ప్లేసులకు వర్చువల్ టూర్స్ వేయొచ్చు.
ఫైనాన్స్
బిజినెస్ చేసేవాళ్లు, స్టాక్ మార్కెట్స్‌లో ఇన్వెస్ట్ చేసేవాళ్లు గూగుల్ ఫైనాన్స్ టూల్ ద్వారా ఎప్పటికప్పుడు మార్కెట్ ట్రెండ్స్ తెలుసుకోవచ్చు. ఈ టూల్ సాయంతో స్టాక్ మార్కెట్ అప్‌డేట్స్, మ్యూచువల్ ఫండ్స్ వివరాలు, కరెన్సీ వివరాలు, ఎక్స్ఛేంజ్ రేట్లు, ఫైనాన్స్‌కు సంబంధించిన న్యూస్ తెలుసుకోవచ్చు.
వేజ్
గూగుల్ మ్యాప్స్‌లో ఉండే కొన్ని ఇబ్బందులను సరిచేస్తూ ‘వేజ్’ అనే కొత్త లైవ్ ట్రాఫికింగ్ టూల్‌ను తెచ్చింది గూగుల్. ఇది ట్రాఫిక్‌లో డ్రైవ్ చేసేవాళ్లకు చాలా ఉపaయోగకరం. లైవ్ ట్రాఫిక్ కండిషన్స్‌ను బట్టి అప్పటికప్పుడు కొత్త రూట్స్ కూడా చూపిస్తుంది ఇది. గూగుల్ మ్యాప్స్ మాదిరిగా ఇందులో లొకేషన్‌కు సంబంధించిన పూర్తి డేటా ఉండదు. కేవలం బెటర్ రూట్స్ చూపించడం కోసం మాత్రమే దీన్ని డిజైన్ చేశారు.