గంటల తరబడి పీపీఈ కిట్ లోనే.. ఎలా ఉంటుందో తెలుసా?

గంటల తరబడి పీపీఈ కిట్ లోనే.. ఎలా ఉంటుందో తెలుసా?

దేశాన్ని సెకండ్ వేవ్ కరోనావైరస్ తుఫాన్‌లా చుట్టుముట్టింది. దాంతో దేశంలో కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ప్రతిరోజూ మూడు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు వస్తున్నాయి. ఇక మరణాల విషయంలోనూ సంఖ్య అంతకంతకూ పెరుగుతుంది. గురువారం నాటికి దేశంలో మరణించిన వారిసంఖ్య రెండు లక్షల మార్కును దాటింది. దేశంలో ఆరోగ్య సంక్షోభం వేగంగా పెరుగుతుండటంతో.. వైద్య మౌలిక సదుపాయాలు పూర్తిగా అడుగంటుతున్నాయి. దాంతో ఆరోగ్య కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినా కూడా తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశ ప్రజలను కాపాడటానికి తమ వంతు కృషి చేస్తున్నారు. దేవుడు ఒకసారి ప్రాణం పోస్తే.. వైద్యులు ప్రజలను చావు నుంచి తప్పించి పునర్జన్మను ఇస్తున్నారు. అందుకే వైద్యున్ని దేవుడితో పోల్చుతారు.

అటువంటి వైద్యులు ప్రాణాలకు తెగించి కరోనా బారినపడిన వారిని రక్షిస్తున్నారు. అందుకోసం 24 గంటలూ సేవలు చేస్తున్నారు. అయితే డ్యూటీలో భాగంగా డాక్టర్లందరూ పీపీఈ కిట్లు ధరించి వైద్యం చేయాల్సి ఉంటుంది. దాంతో ఒక్కో డాక్టర్ ఏకబిగిన 15 నుంచి 20 గంటల పాటు పీపీఈ కిట్‌లోనే ఉండాల్సి వస్తోంది. అలా అన్ని గంటలపాటు పీపీఈ కిట్ ధరించడం తాము ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో చూడండి అంటూ సోహిల్ అనే వైద్యుడు తన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ ఫోటో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. కంటిన్యూగా పీపీఈ కిట్ 15 గంటలు ధరించడం వల్ల సోహిల్ మొత్తం చెమటతో తడిసి ముద్దయ్యాడు. ఆ ఫోటోకు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా నీరాజనాలు పలుకుతున్నారు. సోహిల్ ఈ ఫోటోను ఏప్రిల్ 28న తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. పీపీఈ కిట్‌లో ఒక ఫోటోను, తడిసి ముద్దయిన మరో ఫోటోను కలిపి షేర్ చేశాడు. ఆ ఫోటోకు ‘దేశానికి సేవ చేయడం గర్వంగా ఉంది’ అని ట్యాగ్ జత చేశాడు.

ప్రస్తుతం ప్రజలు కష్టసమయంలో ఉన్నారని.. కేవలం సామాజిక దూరాన్ని పాటించడం మాత్రమే తప్పనిసరని డాక్టర్ సోహిల్ పేర్కొన్నారు. కరోనావైరస్ బారిన పడకుండా సురక్షితంగా ఉండటానికి టీకా ఒక్కటే పరిష్కారమని.. అందుకే ప్రజలందరూ తప్పకుండా టీకాలు వేయించుకోవాలని ఆయన అభ్యర్థించారు.

‘వైద్యులు మరియు ఆరోగ్య కార్యకర్తల తరపున తెలియజేస్తున్నాను. మేం మా కుటుంబాలకు దూరంగా ఉండటానికి చాలా కష్టపడుతున్నామని తెలియజేస్తున్నాను. మేం కొన్నిసార్లు పాజిటివ్ రోగికి ఒక అడుగు దూరం నుంచే వెళ్లాల్సి వస్తుంది. మరికొన్నిసార్లు తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న వృద్ధుల నుంచి ఇంచ్ దూరంలో వెళ్లాల్సి వస్తుంది. ఎంత భయపడుతూ పనిచేస్తున్నామో మాకు తెలుసు. మా ప్రాణాలు.. మీ ప్రాణాలు దక్కాలంటే.. ప్రతి ఒక్కరూ కచ్చితంగా టీకాలు వేయించుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను. అదే పరిష్కారం! సురక్షితంగా ఉండండి’ అని డాక్టర్ సోహిల్ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

డాక్టర్ సోహిల్ ట్వీట్ చేసిన పోస్ట్‌కు వేలాదిగా లైకులు మరియు రీట్వీట్‌లు వస్తున్నాయి. ప్రజలతో సమాచారాన్ని పంచుకున్నందుకు సోహిల్‌ను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.

‘ప్రజలను కరోనా నుంచి నయం చేయడానికి మరియు ప్రాణాలను కాపాడటానికి నిరంతరం కృషి చేస్తున్న వైద్యులు, నర్సులు మరియు సంబంధిత సిబ్బంది అందరికీ ప్రేమతో ధన్యవాదాలు’ అని ఓ యూజర్ కామెంట్ చేశాడు.

కరోనాతో దేశంలో ఇప్పటికే రెండు లక్షలకు పైగా జనాభా మరణించారు. దాంతో ఎక్కువ మరణాలు కలిగిన నాలుగో దేశంగా భారత్ నమోదైంది. భారత్ కంటే ముందు వరుసలో అమెరికా, బ్రెజిల్, మెక్సికో దేశాలు ఉన్నాయి.