గొంతులో కొత్త అవయవాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. కేన్సర్ ట్రీట్మెంట్‌లో సాయం

గొంతులో కొత్త అవయవాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. కేన్సర్ ట్రీట్మెంట్‌లో సాయం

మానవ శరీర నిర్మాణం, అవయవాల పనితీరు గురించి చిన్నప్పటి నుంచే సైన్సు పుస్తకాల్లో ఎంతో కొంత చదువుకునే ఉంటారు. అయితే ఇప్పటి వరకు మనకు తెలియని ఒక్క కొత్త పార్ట్ మన శరీరంలో ఉందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. గొంతులో కొత్త మ్యూకస్ గ్రంధిని గుర్తించారు. ఒక కేన్సర్ పేషెంట్ల ట్రీట్మెంట్‌కు సంబంధించి ఒక స్టడీ చేస్తుండగా అనుకోకుండా దీనిని అబ్జర్వ్ చేశారు. ఈ విషయాన్ని ప్రముఖ సైన్స్ జర్నల్ రేడియోథెరపీ అండ్ ఆంకాలజీలో ప్రచురించారు. నోటి నుంచి గొంతుకు కనెక్ట్ అయ్యే భాగంలో కొండ నాలుకు ఉన్నట్లుగా… ముక్కు నుంచి గొంతుకు కనెక్ట్ అయ్యే భాగంలో ఒకటిన్నర అంగుళాల పొడవైన గ్రంధి ఉందని సైంటిస్టులు తెలిపారు.

ప్రొస్టేట్ కేన్సర్ ట్రీట్మెంట్‌పై నెథర్లాండ్స్ కేన్సర్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు సెప్టెంబర్‌లో పరిశోధనలు చేస్తుండగా అనుకోకుండా కొత్త అవయవాన్ని గుర్తించారు. మానవ శరీరంలో మెడికల్ సైన్స్ గతంలో గుర్తించని కొన్ని పార్ట్ ఉన్నాయని శాస్త్రవేత్తలు అన్నారు. ‘ప్రొస్టేట్ కేన్సర్‌కు ట్రట్మెంట్ తీసుకుంటున్న వంద మంది కేన్సర్ పేషెంట్లకు సంబంధించిన సీటీ స్కాన్లు, పెట్ స్కాన్లు, రేడియో యాక్టివ్ ట్రాకర్ ద్వారా తీసిన మరికొన్ని రిపోర్టులు కలిపి స్టడీ చేస్తుండగా దీనిని కనిపెట్టాం. ముక్కు చివరి భాగంలో గొంతుకు అనుసంధానమయ్యే ప్రదేశంలో పై భాగాన ఒక జంటలా అతుకుని 1.5 అంగుళాల పొడవున మ్యూకస్ గ్లాండ్స్ ఉన్నాయి. ఈ మొత్తాన్ని కలిపి ట్యూబరియల్ గ్లాండ్స్ అని పేరు ప్రపోజ్ చేస్తున్నాం. గొంతులో తడి ఆరిపోకుండా చేయడంలో వీటిదే మేజర్ రోల్ అని గుర్తించాం’ అని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ పరిశోధన ఫలితం ద్వారా కేన్సర్ ట్రీట్మెంట్‌లో చాలా హెల్ప్ అవుతుందని అన్నారు.

తల, మెడ భాగాల్లో రేడియోథెరపీ చేసేటప్పుడు ట్యూబరియల్ గ్లాండ్స్‌పై ప్రభావం పడకుండా యాంటీ రేడియంట్‌ను వాడాలని ప్రొఫెసర్ వోగల్ చెప్పారు. ఇలా కేన్సర్ పేషెంట్లలో ఈ ట్యూబరియల్ గ్లాండ్స్‌పై రేడియేషన్ ప్రభావం పడకుండా కాపాడితే రేడియో థెరపీ ట్రీట్మెంట్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ నుంచి కొంత తప్పించుకునేలా చూడొచ్చని ప్రొఫెసర్ వోగల్ తెలిపారు. కేన్సర్ నుంచి కోలుకున్నాక వాళ్ల లైఫ్ మంచిగా ఉంటుందని వివరించారు. మాట్లాడడం, ఆహారం తినడం, గుంటకలు మింగడం లాంటివాటిలో ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడొచ్చన్నారు. ఇప్పటి వరకు ట్యూబరియల్ గ్లాండ్స్ గురించి తెలియకపోవడంతో డాక్టర్లు ఆ ప్రాంతంలో రేడియేషన్‌ ఎఫెక్ట్ పడకుండా చూడాలన్న శ్రద్ధ తీసుకునేవారు కాదని అన్నారు.