- కోల్‌కతా డాక్టర్ హత్య కేసులో దోషులను శిక్షించాలని డిమాండ్
- ధర్నా చౌక్‌లో నిరసనకు హాజరైన ఎంపీ కడియం కావ్య
హైదరాబాద్/ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు దవాఖాన్లలో శనివారం వైద్యసేవలు నిలిచిపోయాయి. కోల్‌కతాలో ట్రెయినీ డాక్టర్ రేప్ అండ్ మర్డర్‌కు నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలోని డాక్టర్లంతా డ్యూటీలను బాయ్‌కాట్ చేశారు. ఎమర్జెన్సీ మినహా వైద్యం బంద్ పెట్టారు. ఈ బంద్‌కు హాస్పిటళ్ల యాజమన్యాలు కూడా మద్దతు ప్రకటించాయి.
రాష్ట్ర జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్, ఇతర వైద్య సంఘాల నాయకత్వంలో హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద డాక్టర్లు నిరసన చేపట్టారు. పలువురు నాయకులు ఈ కార్యక్రమానికి హాజరై డాక్టర్లకు సంఘీభావం ప్రకటించారు. హత్యకు గురయిన డాక్టర్‌కు న్యాయం చేయాలని, నేరస్తులను కఠినంగా శిక్షించాలని డాక్టర్లు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఎన్నడూ లేనివిధంగా డాక్టర్లు, హెల్త్ కేర్ వర్కర్లంతా రోడ్ల మీదకొచ్చి నినాదాలు చేశారు. రక్షణ కల్పించాలంటూ స్లోగన్స్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం 2018లో వైద్య ఆరోగ్య సిబ్బందిపై దాడుల నియంత్రణకు చట్టం తీసుకొచ్చింది. అయితే, దానిని అమలు చేయట్లేదని, వెంటనే ఆ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో భద్రతపై ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేయాలన్నారు.
బేటీ బచావో అంటే ఇదేనా?: కడియం కావ్య
బేటీ బచావో బేటీ పఢావో అంటూ పాలకులు స్పీచ్ లు ఇస్తున్నారు కానీ బతికే స్వేచ్ఛ కూడా కల్పించలేని స్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య విమర్శించారు. కోల్‌కతాలో డాక్టర్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. సమాజం తలదించుకునే ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకూడదన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడే డాక్టర్లు ఇలా రోడ్ల పైకి రావాల్సి రావడం చాలా దురదృష్టకరమన్నారు. ఇందిరాపార్క్ వద్ద డాక్టర్ల నిరసనలో ఆమె పాల్గొని మాట్లాడారు.
తాను ఎంపీగా ఇక్కడకు రాలేదని, ఓ డాక్టర్‌గా, తన కుటుంబంలో ఒకరిని కోల్పోయిన బాధలో వచ్చానని తెలిపారు. ఈ విషయాన్ని వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తుతానని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్, జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ పి. కాళీ ప్రసాద్ రావు, డాక్టర్ జె. విజయ రావు, సెక్రటరీ డాక్టర్ రాజేంద్ర కుమార్ యాదవ్ హాజరయ్యారు. ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఆస్పత్రులలో సరైన సౌలతులు లేకున్నా డాక్టర్లు బాధ్యతతో పని చేస్తున్నారని అన్నారు. ఇలాంటి మానవ మృగాలకు సమాజమే సరైన శిక్ష వేయాలన్నారు.
