రంగారెడ్డి జిల్లాలో డాక్యుమెంట్ రైటర్ కరుణాకర్ దారుణ హత్య

రంగారెడ్డి జిల్లాలో డాక్యుమెంట్ రైటర్ కరుణాకర్ దారుణ హత్య

షాద్​నగర్, వెలుగు: కిడ్నాప్​అయిన రంగారెడ్డి జిల్లా కొత్తూరుకు చెందిన డాక్యుమెంట్ రైటర్ మామిడి కరుణాకర్ రెడ్డి (29) హత్యకు గురయ్యారు. భూదం దాలు బయటపెడ్తాడనే అనుమానంతో కొత్తూరు బీఆర్ఎస్​ ఎంపీపీ పిన్నింటి మధుసూదన్​రెడ్డి ఈ దారుణానికి పాల్పడినట్టు బాధితుడి కుటుంబ స భ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మధుసూదన్​రెడ్డి అతని సోదరులపై హత్యకేసు నమోదు చేసి గాలిస్తున్నామని షాద్​నగర్ డీసీపీ నారాయణరెడ్డి సోమవారం తెలిపారు.

పోలీసుల వివరాల మేరకు కరుణాకర్ రెడ్డి గతంలో పిన్నింటి మధుసూదన్ రెడ్డి దగ్గర పీఏగా కొన్నాళ్లు పనిచేశారు. తర్వాత కొత్తూరులో డాక్యుమెంట్ రైటర్ షాప్ పెట్టుకున్నారు. ఎంపీపీ తనకు సంబంధించిన భూమి వ్యవహారాలు, లిటిగేషన్ ల్యాండ్ వ్యవహారాలు కరుణాకర్ వద్దనే కొనసాగించారు. ఈ క్రమంలో గతేడాది ఒక భూమికి సంబంధించిన విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. ఇరువురు ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత దసరా సమయంలో కరుణాకర్ పై మధుసూదన్ రెడ్డి దాడి చేశాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

కారును అడ్డగించి కర్రలతో దాడి, కిడ్నాప్​

కరుణాకర్ రెడ్డి ఆదివారం సాయంత్రం స్నేహితుడు శ్రీధర్ రెడ్డితో కలిసి తన దగ్గరి బంధువైన రామ చంద్రా రెడ్డిని కారులో మామిడిపల్లిలో దింపి తిరిగి స్వగ్రామం మల్లాపూర్​బయల్దేరారు. సాయంత్రం 5:30 గంటల టైమ్​లో మార్గమధ్యంలో తీగాపూర్ బ్రిడ్జి వద్దకు రాగానే ఎంపీపీ మధుసూదన్ రెడ్డి సోదరులు విక్రమ్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, డ్రైవర్ ఆరిఫ్, అరుణ్ కుమార్ రెడ్డి రోడ్డు బ్లాక్​చేసి వీరి కారును అడ్డుకున్నారు. ఆపగానే వెళ్లి అద్దాలు పగలగొట్టి అందులో ఉన్న కరుణాకర్ రెడ్డి, శ్రీధర్​రెడ్డిపై కర్రలతో దాడి చేశారు. కరుణాకర్ ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు. శ్రీధర్​రెడ్డి ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు, గ్రామస్థులకు చెప్పారు. వారు వెంటనే వెళ్లి ఎంపీపీ మధుసూదన్ రెడ్డి, అతని ఇద్దరు సోదరులు, ఇద్దరు అనుచరులపై కొత్తూరు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చే శారు.

కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు మొదలు పెట్టారు. ఇంతలో రాత్రి 9:30 గంటలకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్​ఆసుపత్రి నుంచి డాక్టర్లు షాద్ నగర్ పోలీసులకు కాల్ చేసి కొత్తూరు నుంచి యాక్సిడెంట్ కేస్ వచ్చిందని.. కొందరు వ్యక్తులు ఒకరిని అడ్మిట్ చేసి వెళ్లినట్లు చెప్పారు. అయితే ఆస్పత్రికి రావడానికి గంట ముందే బాధితుడు మృతిచెందినట్లు తమ పరీక్షల్లో తేలిందని వివరించారు. పోలీసులు హాస్పిటల్​వెళ్లి పరీక్షంచగా అతను కరుణాకర్​రెడ్డిగా తేలింది.